Share News

రెక్కలు.. ముక్కలు

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:23 AM

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తలమానికంగా నిలిచిన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వం కాలరాసింది!

రెక్కలు.. ముక్కలు

ఐదేళ్లూ.. ఆగిన గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధి

అంతర్జాతీయ సర్వీసులు లేవు.. ప్రయాణికులూ తగ్గారు

టీడీపీ హయాంలో మిలియన్‌ మార్క్‌కు వృద్ధి

ఇప్పటికీ డిమాండ్‌ ఉన్నా నడపలేని దుస్థితి

ఐదేళ్లయినా శాశ్వత టెర్మినల్‌ పూర్తికాని వైనం

నిర్వాసితులపై జగన్‌ సర్కారు నిర్దయ

అద్దె కట్టడం లేదు.. కౌలూ ఇవ్వడం లేదు

(విజయవాడ - ఆంధ్రజ్యోతి)

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తలమానికంగా నిలిచిన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వం కాలరాసింది! టీడీపీ ప్రభుత్వం చూపించిన శ్రద్ధతో ఎయిర్‌పోర్టు కొత్త రెక్కలు తొడుక్కుంది. నవ్య రూపం సంతరించుకుని అంతర్జాతీయ సర్వీసులను ఆకర్షించింది. జగన్‌ ప్రభుత్వం దీనికి రివర్స్‌లో విమానం రెక్కలు విరిచేసింది.

నాటి విమానాల మోత ఇప్పుడేది ?

టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ విమానాశ్రయం నుంచి దేశీయంగా మొత్తం 54 విమాన సర్వీసులు నడిచేవి. ప్రస్తుతం 38 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ విమానాలు కూడా ఎటొచ్చీ ఒక ఏడాది కాలంగానే! అంతకుముందు అయితే డజనులోపే విమానాలు నడిచాయి. దాదాపుగా విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులనేవి ఇప్పుడు లేవు. శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ టెర్నినల్‌ బిల్డింగు పనులు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాతగానీ ప్రారంభించలేదు. ఇప్పటికీ సగం పనులు కూడా కాలేదు.

అప్పట్లో శరవేగంగా..

రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి 700 ఎకరాల భూములను సమీకరించింది. కేవలం 6 నెలల్లో 700 ఎకరాలను సమీకరించి ‘ఏఏఐ’కు అప్పగించటంతో విస్తరణకు శ్రీకారం జరిగింది. మాస్టర్‌ ప్లాన్‌ రూపుదిద్దుకుంది. ముందుగా ఇంటీరియం టెర్మినల్‌ బిల్దింగ్‌, రన్‌వే విస్తరణ, ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌, నైట్‌ ల్యాండింగ్‌, పాత విమానాశ్రయ టెర్మినల్‌ బిల్డింగ్‌ ఆధునీకరణ వంటి అనేక పనులు జరిగాయి. రాజధానికి వచ్చే వారితో విజయవాడ ఎయిర్‌పోర్టుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభోత్సవానికి ఏడాది పట్టింది. శాశ్వత ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మించాల్సిందిగా చంద్రబాబు కోరటంతో ఏఏఐ అధికారులు ఓకే చెప్పారు. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను 15 ఏళ్ల తర్వాత నిర్మించాల్సి ఉండగా, అనూహ్యంగా పెరిగిన వృద్ధి కారణంగా వెంటనే రెండో టెర్మినల్‌ బిల్డింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందే ఈ బిల్డింగ్‌ పనులకు శంకుస్థాపన జరిగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో విమానాశ్రయం వృద్ధి చూస్తే కళ్లు తిరగాల్సిందే! దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల పెంపుదల వంటి అనేక చర్యలు చేపట్టడం ద్వారా 2017-18లో 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఇది ఆల్‌టైమ్‌ రికార్డు! ఈవిధంగా టీడీపీ ప్రభుత్వం దీనికి అంతర్జాతీయ హోదాను సాధించి పెట్టింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయి పెరిగిన తర్వాత బైలేట్రల్‌ ట్రాఫిక్‌ రైట్స్‌ లేనప్పటికీ విజయవాడ నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసును వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ విధానంలో నడపటానికి సహకరించింది. ఈ క్రమంలో ఎన్నికలు వచ్చాయి. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం విమానాశ్రయాభివృద్ధిని గాలికొదిలేసింది.

భూములిచ్చిన రైతులపై కర్కశం

విమానాశ్రయ అభివృద్ధికి భూములిచ్చిన రైతుల పట్ల, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల పట్ల వైసీపీ ప్రభుత్వం కాఠిన్యం చూపింది. భూసమీకరణలో భూములు అప్పగించిన వారిలో చాలామందికి అమరావతిలో ఇప్పటికీ రిటర్నబుల్‌ ప్లాట్లు ఇవ్వలేదు. రిటర్నబుల్‌ ప్లాట్లు ఇచ్చిన వారికి వార్షిక కౌలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. కౌలు అందని, రిటర్నబుల్‌ ప్లాట్లూ రాని రైతులు తమ భూములను మళ్లీ సాగు చేసుకుంటున్నారు. విమానాశ్రయ నిర్వాసితులైన 400 మందికి టీడీపీ ప్రభుత్వం చిన్న అవుటపల్లిలో 48 ఎకరాల భూములు కొని, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో భాగంగా లే అవుట్‌ వేసి, మౌలిక సదుపాయాలు కల్పించారు. మోడల్‌ ఇళ్లు కట్టేందుకు డిజైన్లు వేయించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక డబ్బులిస్తాం మీరే ఇళ్లు కట్టుకోమని చెప్పింది. ఇందుకు రెండు విడతల్లో రూ.9 లక్షలు ఇస్తామని చెప్పింది. దీనిపై ఉత్తుత్తి జీవోలను ఇచ్చింది. దీంతో నిర్వాసితులు ఇప్పటికీ అద్దె ఇళ్లలో ఉంటున్నారు.

మీది ప్రచారం.. మాది వ్యాపారం!

ఒకరిది ప్రచార ఆర్భాటం... మరొకరికి ఆకలి తీరే మార్గం. ఎన్నికల ప్రచార హోరులో రంగు రంగుల బెలూన్లకు భారీ గిరాకీ ఏర్పడింది. దాంతో ఏ పార్టీ ప్రచారం సాగుతుంటే ఆ పార్టీ రంగు బెలూన్లు విక్రయిస్తూ చిరు వ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. విజయనగరంలో టీడీపీ ప్రచార కార్యక్రమంలో పసుపు బెలూన్ల విక్రయిస్తున్న చిరు వ్యాపారి గ్యాస్‌ సిలిండర్‌ను కూడా తనతో తీసుకొచ్చి అప్పటికప్పుడు బెలూన్లు సిద్ధం చేసి ఇస్తున్నారు.

సై సై.. జోడెడ్ల బండి..!

కారులు, బస్సులు, హెలికాఫ్లర్లు, విమానాల్లో సాగిపోతున్న ఎన్నికల ప్రచార హోరులో ఓ జోడెడ్ల బండి కనిపించింది. భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి బాలరామాంజినేయులు మంగళవారం ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్ల బండిపై.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నామినేషన్‌ వేసేందుకు వచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న ఆయన.. కర్ణాటక నాగేపల్లి సర్కిల్‌ నుంచి పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం వరకు డప్పుల వాయిద్యాలతో ఎడ్లబండిపై ర్యాలీగా వచ్చారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్వో భాగ్యరేఖకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

- పుట్టపర్తి

Updated Date - Apr 24 , 2024 | 03:23 AM