Share News

Rains : గాలులు.. వానలు

ABN , Publish Date - May 26 , 2024 | 02:11 AM

రోళ్లు పగిలేంతగా ఎండలు మండిపోవాల్సిన రోహిణీ కార్తె శనివారం ప్రారంభమైంది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ముసురు పట్టింది.

Rains : గాలులు.. వానలు

అనంత, కర్నూలు జిల్లాల్లో కూలిన 450 విద్యుత్‌ స్తంభాలు

వందకుపైగా ట్రాన్స్‌ఫార్మర్లు, 300 చెట్లు కూడా..

396.52 హెక్టార్లల్లో దెబ్బతిన్న ఉద్యాన పంటలు

కర్నూలు జిల్లాలో క్రేన్‌ కూలి ఒకరు మృతి

బంగాళాఖాతంలో ‘రీమల్‌’ తుఫాన్‌

నేడు తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం

అర్ధరాత్రి బెంగాల్‌, బంగ్లాదేశ్‌ మధ్య తీరంపైకి?

రాజస్థాన్‌లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రోళ్లు పగిలేంతగా ఎండలు మండిపోవాల్సిన రోహిణీ కార్తె శనివారం ప్రారంభమైంది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ముసురు పట్టింది. తుఫాను ప్రభావం రాష్ట్రంపై ఉండదని వాతావరణ శాఖ ప్రకటించినప్పటికీ ఏపీ వైపు మేఘాలు విస్తరించాయి. శనివారం ఉదయం నుంచి రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈదురుగాలులకు సుమారు 250 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. గంటల తరబడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు మండలాల్లో అరటి, బొప్పాయి, టమోటా పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 396.52 హెక్టార్లలో రూ.13.83 కోట్ల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కువ శాతం అరటి పంటకు నష్టం జరిగింది. పెద్దపప్పూరు మండలం సింగనగుట్టపల్లిలో పిడుగుపాటుకు రెండు పశువులు మృతి చెందాయి. మడకశిర మండలం జిల్లేడకుంట ఎస్సీ కాలనీలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి.

fgrfftrt.jpg

కళ్యాణదుర్గంలో 86.4 మి.మీ., మడకశిరలో 72.2, కణేకల్లు 70, ఉరవకొండ 62.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా తీరప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. చేపలు, రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్‌ అందకపోవడంతో రియేటర్‌లు పెట్టి జలచరాలకు ఆక్సిజన్‌ అందిస్తున్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. గోనెగండ్ల మండలంలో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షానికి 200 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. వందకుపైగా విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్లు, 300 చెట్లు నేల కొరిగాయి. గోనెగండ్ల మండలం పెద్దనేలటూరు గ్రామంలో క్రేన్‌ విరిగిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కోడుమూరు గ్రామానికి చెందిన చంద్ర(35) ఒక కంపెనీలో బోలేరో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి పెద్దనేలటూరు గ్రామంలో బోలెరో వాహనాన్ని పార్కింగ్‌ చేసి ఆ పక్కనే నిలుచుని ఉండగా, గాలివానకు విండ్‌ పవర్‌ రెక్కలు ఎత్తే భారీ క్రేన్‌ ఆయనపై కూలిపోయింది. చంద్రతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. చంద్రను కర్నూలులోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా, మృతిచెందారు. విజయవాడ నగరంలో మోస్తరు వర్షం కురిసింది.

రాష్ట్రంలో నేడూ వర్షాలు

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఏపీపై తుఫాన్‌ ప్రభావం ఏమీ లేదని పేర్కొంది. మన్యం, అల్లూరి, అనకాపల్లి,కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆదివారం మోస్తరు వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. తుఫాన్‌ తీరం దాటే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించింది.


నేడు అర్ధరాత్రి సాగర్‌ ఐలాండ్స్‌, కేపుపురా మధ్య తీరంపైకి..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సాయంత్రానికి తుఫాన్‌గా మారింది. ప్రస్తుతం ఇది తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌ ఐలాండ్స్‌కు 350, బంగ్లాదేశ్‌లోని కేపుపురాకు 360 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. తుఫాన్‌కు ఒమన్‌ దేశం సూచించిన ‘రీమల్‌’ అనే పేరు పెట్టారు. ఇది ఉత్తరంగా పయనించి ఆదివారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా బలపడనున్నది. ఆదివారం అర్ధరాత్రి సాగర్‌ ఐలాండ్స్‌, కేపుపురా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కి.మీ., అప్పుడప్పుడు 135 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, అతిభారీ, అక్కడక్కడ కుండపోత వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుఫాన్‌ ప్రభావంతో శనివారం నైరుతి, ఈశాన్య, మధ్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలో మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. కాగా, కేరళ పరిసరాలు, విదర్భలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. రాజస్థాన్‌ నుంచి మధ్యప్రదేశ్‌, విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.

ఫలోడిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత..

పశ్చిమ రాజస్థాన్‌లోని ఫలోడి గ్రామంలో శనివారం అసాధారణంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం ఇదే గ్రామంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, శనివారం మరో డిగ్రీ పెరిగింది. రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, పంజాబ్‌, హరియాణా, ఛత్తీ్‌సగఢ్‌, విదర్భతోపాటు పలు రాష్ట్రాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - May 26 , 2024 | 02:12 AM