Share News

ఓట్ల అక్రమాలకు..కళ్లెం వేస్తారా?

ABN , Publish Date - Jan 08 , 2024 | 05:51 AM

త్వరలో రాష్ట్రంలో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) దృష్టి సారించింది.

ఓట్ల అక్రమాలకు..కళ్లెం వేస్తారా?

నేడు రాష్ట్రానికి సీఈసీ రాజీవ్‌కుమార్‌ రాక

ఇద్దరు కమిషనర్లు, అధికారులు కూడా..

రేపు ఉదయం పార్టీలతో భేటీ

అనంతరం ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, ఏర్పాట్లపై సమీక్ష

అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): త్వరలో రాష్ట్రంలో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) దృష్టి సారించింది. ఏర్పాట్లు, సన్నద్ధతను పర్యవేక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌, కమిషనర్లు అనూ్‌పచంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌ సోమవారం రాత్రి విజయవాడ రానున్నారు. వారి వెంట ఈసీ ఉన్నతాధికారులు కూడా వస్తున్నారు. వీరంతా నోవాటెల్‌ హోటల్‌లో బస చేస్తారు. ఆ రోజుతో కలిపి ఈసీ బృందం మొత్తం మూడ్రోజులు పర్యటిస్తుంది. 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రాజకీయ పార్టీలతో సమావేశమవుతుంది. అనంతరం ఓటర్ల జాబితాల్లోని తప్పిదాలు, పార్టీల ఫిర్యాదులు, ఎన్నికలకు ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా, జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీన ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా, ఏర్పాట్లపై సీఈవో ప్రజంటేషన్‌ ఇస్తారు. అనంతరం రాష్ట్రంలోని కేంద్ర విభాగాలకు సంబంధించిన అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీ బృందం భేటీ అవుతుంది. సాయంత్రం 4.30 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహిస్తుంది. అనంతరం ప్రధాన కమిషనర్‌, కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీ బయల్దేరతారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ రాష్ట్రం నుంచి వెళ్లనన్ని ఫిర్యాదులు.. ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల జాబితాల్లో జరిగిన అవకతవకలపై ఈసీకి వెళ్లిన సంగతి తెలిసిందే. కింది స్థాయిలో కొందరు ఎన్నికల అధికారులు పదే పదే ఈసీ ఆదేశాలను, నిబంధనలను తుంగలో తొక్కి.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు కమిషన్‌ దృష్టికి వెళ్లాయి. మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వయంగా రెండు సార్లు ఢిల్లీ వెళ్లి ఈసీకి కంప్లయింట్‌ చేశారు. ఇతర ప్రతిపక్షాలు కూడా పెద్దఎత్తున ఫిర్యాదు చేశాయి. వీటన్నిటి భరతం భరతం పట్టేందుకే ప్రధాన కమిషనర్‌, కమిషనర్లు వస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

తప్పుల కుప్పలు..

రాష్ట్రంలో ఓటర్ల జాబితాల్లో గతంలో ఎన్నడూ జరగనన్ని అవకతవకలు జరిగాయి. 2024 ముసాయిదా ఓటర్ల జాబితాను తప్పులతడకగా రూపొందించారు. చాలాచోట్ల అధికారులు పాలక పక్షంతో కుమ్మక్కై ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లు తొలగించారు. మృతుల ఓట్లు కొనసాగించారు. ఒకే డోరు నంబరుతో వందలు, వేల దొంగ ఓట్లు చేర్పించారు. వీటిని తొలగించకుండానే ముసాయిదా విడుదల చేయడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. వలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) క్షేత్ర స్థాయి పరిశీలనలు చేయడం లేదు. ఒకవేళ వెళ్లినా వలంటీర్లను వెంటబెట్టుకుని వెళ్తున్నారు. వైసీపీ నేతల ఇళ్లలో మకాం వేసి ఇష్టానుసారం ఓటర్ల తొలగింపు, చేర్పులు చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఈవోకి 8 జిల్లాల కలెక్టర్లపై ఫిర్యాదు చేశారు. ఒకే డోర్‌ నంబర్లపై వందల సంఖ్యలో ఓట్లు ఉండడం, ప్రతిపక్షాల ఓట్లు తీసేయడానికి వైసీపీ నాయకులు ఆన్‌లైన్లో వందల కొద్దీ ఫాం-7 దరఖాస్తులు సమర్పించడం. పలు చోట్ల ఎన్నికల అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాసి ప్రతిపక్షాల ఓట్లు తీసేయడంతో.. వలంటీర్లను, గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందిని ఎన్నికల ప్రక్రియకు దూరం ఉంచాలంటూ సిటిజెన్స్‌ ఫోరం ఫర్‌ డెమోక్రసీ (సీఎ్‌ఫడీ) తరఫున రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎన్ని ఫిర్యాదులు చేసినా పలువురు కింది స్థాయి ఎన్నికల అధికారుల తీరు మారలేదు. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి ఈ నెల 22 తేదీన విడుదల చేసే తుది ఓటర్ల జాబితా-2024 తప్పులతడకగా లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్‌దేనని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు.. రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఏ విధమైన ఆదేశాలిస్తారో చూడాలి.

Updated Date - Jan 08 , 2024 | 05:51 AM