Share News

నన్నూ నరికేస్తారేమో

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:56 AM

వైఎస్‌ వివేకానందరెడ్డిని కేవలం రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకే అత్యంత దారుణంగా నరికిచంపారని ఆయన కుమార్తె డాక్టర్‌ సునీత ఆరోపించారు.

నన్నూ నరికేస్తారేమో

రాజకీయంగా అడ్డమనే వివేకాను దారుణంగా నరికి చంపారు

ఆ దుర్మార్గులు ఎంతకైనా తెగిస్తారు

వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారు

వారి చేతిలో అధికారం ఉండొద్దు

వైఎస్‌ మరణించాక పులివెందుల టికెట్‌ను భాస్కరరెడ్డి అడిగారు

అందుకు వివేకా వ్యతిరేకించారు

ఆయనను తప్పించాలని జగన్‌, అవినాశ్‌ కుటుంబం కుట్ర

వివేకా కోరిక మేరకే బరిలో షర్మిల

ప్రజల తీర్పుతోనే న్యాయం: సునీత

ఫోన్‌ కాల్‌ రికార్డ్స్‌ ఎందుకు మ్యాచ్‌ అవుతున్నాయి?

హంతకులతో మీకు సంబంధమేంటి?

వివేకా ఇల్లంతా రక్తంతో ఉంటే

‘గుండెపోటు’ అంటారా?

అవినాశ్‌ ఎందుకు అబద్ధం చెప్పారో?

సోషల్‌ మీడియాలో మాపై దూషణలు

విజయమ్మనూ అవమానించారు: షర్మిల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ వివేకానందరెడ్డిని కేవలం రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకే అత్యంత దారుణంగా నరికిచంపారని ఆయన కుమార్తె డాక్టర్‌ సునీత ఆరోపించారు. ఆ దుర్మార్గుల చేతిలో అధికారం లేకుండా చేసేందుకు తాను ఒంటరి పోరాటం చేస్తున్నానన్నారు. ఒంటరిగా బయటకు వెళుతున్నందున తనను కూడా అడ్డులేకుండా చేయడానికి నరికేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో వాస్తవాలు చెప్పి ఎన్నికల్లో ప్రజల తీర్పుతో తమకు న్యాయం కావాలని అడుగుతున్నామన్నారు. వివేకా కోరిక మేరకే తన సోదరి షర్మిల కడప నుంచి పోటీ చేస్తున్నారని చెప్పారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్న వ్యక్తుల చేతుల్లో అధికారం ఉండకూడదని, అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని తాను నమ్ముతున్నానన్నారు. శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... వివేకా హత్యకు గల కారణాలను, పరిస్థితులను వివరించారు. కుటుంబ సభ్యులు ఇంత ఘోరానికి పాల్పడతారని తాను ఊహించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రికి జరిగిన అన్యాయంపై వ్యవస్థలతో కలిసి పోరాటం చేస్తున్నానని, తన వెనుకాల ఎవరూ లేరని, కోర్టులకు, పోలీసు స్టేషన్లకు ఒక్కదాన్నే వెళుతున్నానన్నారు. న్యాయం కావాలనే పోరాటం చేస్తున్నాను తప్ప ప్రతీకారం కోసం కాదన్నారు. ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన ఉంటే తన తండ్రిని చంపిన వారిని తానే ఈపాటికి నరికివేసేదాన్నని చెప్పారు. ఇలాంటి సంఘటన మరోసారి జరగకుండా, తన బాధ మరొకరికి రాకుండా న్యాయపోరాటం చేస్తున్నానన్నారు.

కుటుంబం కలిసుండాలనే...

‘‘వైఎస్‌ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన తరువాత పులివెందుల ఎమ్మెల్యే టికెట్‌ ఎవరికి ఇవ్వాలనే దానిపై మా కుటుంబంలో రాజకీయ చర్చ మొదలైంది. వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి తనకు కావాలని కోరగా అందుకు వివేకా వ్యతిరేకించారు. వైఎస్‌ విజయమ్మ లేదా షర్మిలలో ఎవరికో ఒకరికి కేటాయించాలని ప్రతిపాదించారు. కొద్ది రోజులకు వైఎస్‌ వివేకానంద రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడంతో, చిన్నాన్నకు మంత్రి పదవి ఎలా ఇస్తారంటూ వైఎస్‌ జగన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. తన తల్లితో పాటు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆ తరువాత కొద్ది రోజులకే వైఎ్‌సఆర్‌సీపీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ ఏర్పాటు విషయంలో వివేకాతో ఏనాడు కనీసం చర్చించలేదు. తరువాత జరిగిన ఎన్నికల్లో పులివెందుల నుంచి విజయమ్మ, వివేకా పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. వివేకా ఓడిపోవడం, ఆ తరువాత సీబీఐ కేసుల్లో జగన్‌ను అరెస్టు చేయడంతో కుటుంబమంతా ఒకటిగా ఉండాలని భావించిన వివేకా కాంగ్రె్‌సకు రాజీనామా చేసి వైసీపీలో చేరారు’’ అని సునీత వివరించారు.

షర్మిలే పార్టీని బతికించారు

‘‘జగన్‌ జైలుకు వెళ్లాక పార్టీ బాధ్యతలను పూర్తిగా షర్మిల తన భుజాల మీద వేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లారు. లేదంటే అసలు ఆ పార్టీ బతికేదే కాదు. జగన్‌ జైల్లో ఉండగానే ఉప ఎన్నికలు రావడంతో షర్మిల ప్రచారం చేయడంతో వైసీపీ తరఫున 13 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిచారు. ఆ తరువాత షర్మిల రాష్ట్రమంతా తిరిగి పార్టీని బతికించారు. షర్మిలకు పెరుగుతున్న ఆదరణ చూసిన జగన్‌ తట్టుకోలేక ఆమెను పార్టీ నుంచి బైటకు పంపారు. 2014 ఎన్నికల్లో షర్మిలకు కడప ఎంపీ సీటు ఇవ్వాలని వైఎస్‌ వివేకా ప్రతిపాదించారు. షర్మిల ఇక్కడ ఉంటే తమకు ఇబ్బంది అని భావించిన జగన్‌, అవినాశ్‌ రెడ్డి కుటుంబాలు ఆమెను విశాఖ నుంచి పోటీ చేయిస్తామని చెప్పి చివరకు సీటే లేకుండా చేశారు. కడప ఎంపీ సీటు అవినాశ్‌ రెడ్డికి ఇవ్వడంపై వివేకా తీవ్ర అభ్యంతరం తెలిపారు’’ అని చెప్పారు.

వివేకాను దారుణంగా చంపారు

‘‘2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను కావాలని ఓడించారు. తనను ఓడించినా జగన్‌ను వ్యతిరేకించకుండా వైసీపీ కోసం ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో కడప నుంచి షర్మిలను పోటీ చేయించాలని వివేకా పట్టుపట్టారు. ఆ ఏడాది ఫిబ్రవరి 10న కడపలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రజల ఎదుటే వేదికపై అవినాశ్‌ పట్ల తనకున్న కోపాన్ని వివేకా చూపారు. వివేకాకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని, ఆయన్ను రాజకీయాల నుంచి తప్పించాలని జగన్‌, అవినాశ్‌ కుటుంబం పథకం ప్రకారమే కుట్రలు చేయడం మొదలు పెట్టారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు పులివెందులలో ఆయన ఓటు తొలగించారు. దీనిపై 2019 మార్చి 4న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రత్యర్థి పార్టీల నాయకులే ఆ పని చేశారేమో అని మేమంతా భావించాం. ఎన్నికల్లో నా తండ్రి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారేమోనన్న భయంతో అత్యంత దారుణంగా నరికి చంపేశారు’’ అని సునీత ఆరోపించారు.

Updated Date - Apr 07 , 2024 | 03:56 AM