Share News

మేరుగుపై దర్యాప్తు కొనసాగిస్తారా? లేదా?

ABN , Publish Date - Nov 13 , 2024 | 04:31 AM

తప్పుడు ఫిర్యాదు చేశానంటూ బాధిత మహిళ ప్రమాణ పూర్వక అఫిడవిట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై నమోదైన అత్యాచారం కేసులో దర్యాప్తును కొనసాగిస్తారా? లేదా? అని ప్రాసిక్యూషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది.

మేరుగుపై దర్యాప్తు కొనసాగిస్తారా? లేదా?

తప్పుడు ఫిర్యాదు చేశానని బాధిత మహిళే చెప్పారు కదా..

పూర్తి వివరాలు రాతపూర్వకంగా హైకోర్టు ముందు ఉంచండి

పిటిషనర్లపై ఈ నెల 27 వరకు తొందరపాటు చర్యలు వద్దు

పోలీసులకు హైకోర్టు ఆదేశం.. విచారణ నవంబరు 28కి వాయిదా

అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): తప్పుడు ఫిర్యాదు చేశానంటూ బాధిత మహిళ ప్రమాణ పూర్వక అఫిడవిట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై నమోదైన అత్యాచారం కేసులో దర్యాప్తును కొనసాగిస్తారా? లేదా? అని ప్రాసిక్యూషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. వివరాలను రాతపూర్వకంగా కోర్టు ముందు ఉంచాలని, పిటిషనర్లపై ఈ నెల 27వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు కోర్టుకు హాజరైన బాధిత మహిళతో న్యాయమూర్తి నేరుగా మాట్లాడారు. ప్రమాణ పత్రం తానే దాఖలు చేశానని ఫిర్యాదుదారైన ఆ మహిళ సమాధానం ఇచ్చారు. మేరుగు నాగార్జున, మురళీమోహన్‌రెడ్డి తనపై అత్యాచారానికి పాల్పడలేదని, రాజకీయ ఒత్తిడి వల్లే తప్పుడు కేసు పెట్టానని చెప్పారు. వారిపై పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని అభ్యర్థించారు. ఉద్యోగం, కాంట్రాక్ట్‌ పనులు ఇప్పిస్తామని ఆశచూపి తన వద్ద నుంచి డబ్బులు తీసుకోవడమే కాకుండా శారీరకంగా వాడుకున్నారని ఆరోపిస్తూ విజయవాడకు చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా, తాడేపల్లి పోలీసులు మేరుగు నాగార్జున, మురళీమోహన్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ వారు ఇరువురు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫున న్యాయవాది దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. తప్పుడు కేసు పెట్టానని ఫిర్యాదుదారే చెబుతున్నందున కేసు కొట్టివేయాలని కోరారు. పిటిషనర్లను పోలీసులు అరెస్ట్‌ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. ఫిర్యాదుదారు మహిళ తరఫు న్యాయవాది నాగార్జునరెడ్డి స్పందిస్తూ.. కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో సవివరంగా అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు అనుమతించాలని అభ్యర్థించారు. సహాయ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాయి రోహిత్‌ స్పందిస్తూ.. బాధిత మహిళ ఎలాంటి కాంప్రమైజ్‌ పిటిషన్‌ వేయలేదని,. కేవలం మెమో మాత్రమే దాఖలు చేశారన్నారు. వాదనలన్నీ విన్న న్యాయమూర్తి.. తప్పుడు కేసు పెట్టేందుకు కారణమైన వారు ఎవరో కూడా తేల్చాల్సిన అవసరం కూడా ఉంది కదా అని వ్యాఖ్యానించారు.

Updated Date - Nov 13 , 2024 | 04:31 AM