చనిపోయినా ప్రభుత్వం కనికరించదా?
ABN , Publish Date - Jan 18 , 2024 | 04:05 AM
విజయనగరం జిల్లా చిట్టింపాడు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయాను.
చిట్టింపాడు ఘటనపై చంద్రబాబు ఆవేదన
అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా చిట్టింపాడు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయాను. తీవ్ర అనారోగ్యం పాలైన బాలింతను, ఆర్నెల్ల చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 5 కిలోమీటర్లు డోలీపై మోసుకురావాల్సి రావడం దురదృష్టకరం. ఇలాంటి దుస్థితి రాకూడదనే ఉద్దేశంతో గతంలో ఫీడర్ అంబులెన్స్‌లు తెచ్చాం. ఇప్పుడు వాటిని పక్కన పడేసి, గిరిజనుల ప్రాణాలతో చెలగాటంఆడుతున్నారు. తల్లీ, బిడ్డా చనిపోవటానికి కారణం ప్రభుత్వ అలసత్వం కాదా? కనీసం మనిషి చనిపోయాక కూడా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా? మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయలేరా? ఏమై పోయాయి అంబులెన్స్‌లు? పుట్టెడు దుఃఖంలో భార్య మృత దేహాన్ని బైక్ మీద తీసుకెళ్లాల్సి రావడం ఎంత దయనీయం? ఎంత బాధాకరం? గిరిజనులకు ఎందుకీ దుస్థితి? ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని, ఘటనపై విచారణ జరిపించాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. చిట్టంపాడుకు రోడ్డు నిర్మాణాన్ని సత్వరం చేపట్టాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇది జగన్ వైఫల్యం: మాణిక్కం ఠాగూర్
విజయనగరం జిల్లా ఎస్.కోట గిరిశిఖర గ్రామం చిట్టెంపాడుకు మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై మోసుకువెళ్లిన ఘటనపై ఏపీసీసీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘హృదయం బద్దలయ్యే విషాద ఘటన నన్ను తీవ్ర విచారంలోకి నెట్టేసింది. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు లేకపోవడాన్ని ఈ ఘటన ఎత్తిచూపుతోంది. దీనిపై అత్యవసరంగా దృష్టిపెట్టాలి. వైద్య సేవలను అందుబాటులో ఉంచడంలో, రవాణా సౌకర్యాలను కల్పించడంలో జగన్ విఫలమయ్యారు’ అని ఠాగూర్ విమర్శించారు.