Share News

మమ్మల్ని ఎందుకు సమ్మెలోకి దించారు?

ABN , Publish Date - Jan 12 , 2024 | 04:32 AM

సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించడంపై విమర్శలు మొదలయ్యాయి. సమ్మెలోకి దించి ఏం సాధించారో చెప్పాలంటూ ఎస్‌ఎ్‌సఏ ఉద్యోగులు నిలదీస్తున్నారు.

మమ్మల్ని ఎందుకు సమ్మెలోకి దించారు?

మధ్యలోనే కాడి వదిలేయడం కరెక్టేనా?

సమగ్రశిక్ష జేఏసీపై తీవ్ర విమర్శలు

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించడంపై విమర్శలు మొదలయ్యాయి. సమ్మెలోకి దించి ఏం సాధించారో చెప్పాలంటూ ఎస్‌ఎ్‌సఏ ఉద్యోగులు నిలదీస్తున్నారు. బుధవారం రాత్రి విద్యాశాఖ మంత్రి వద్ద చర్చలు జరిపిన అనంతరం సమగ్రశిక్ష ఉద్యోగులు సమ్మెను విరమిస్తున్నట్లు సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్‌ బి.కాంతారావు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీలు రాకుండానే ఆయన సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించేశారు. దీనిపై జిల్లాల్లోని సమగ్రశిక్ష నాయకత్వం, ఉద్యోగులు మండిపడుతున్నారు. అసలు ఎవరిని అడిగి ఆ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల వాట్సాప్‌ గ్రూపుల్లోనూ గురువారం ఇదే కీలక చర్చగా మారింది. మరికొంతకాలం సమ్మెను కొనసాగించి ఉంటే ఫలితాలు వచ్చేవని అనేక మంది అభిప్రాయపడ్డారు. ఏం సాధించారని సమ్మె విరమించారో అర్థకావడం లేదని ఉద్యోగులంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సమగ్రశిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేయగా అది కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మినిమం టైమ్‌ స్కేలు వర్తింపజేయాలని కోరగా దానిపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా దీనిపై మూడు కేటగిరీల్లో వివరాలు సేకరిస్తున్నామని సమగ్రశిక్ష ఎస్పీడీ వారికి చెప్పారు. హ్యూమన్‌ రీసోర్స్‌ పాలసీపై ఉద్యోగులు పట్టుబట్టినా దీనిపై ఒక కమిటీని నియమిస్తామని మాత్రమే మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా జీతాలు పెరగనివారికి 23శాతం పెంచుతామని మంత్రి హామీ ఇచ్చారు. గత చర్చల్లోనే వీటిని ప్రకటించారు. కారుణ్య నియామకాలు చేపడతామని, కేజీబీవీల్లో పీజీటీలను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

బరిలోకి దించి నీరుగార్చారు

సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడం లేదు. గత ఆరు నెలలుగా మూడు నెలలకోసారి జీతాలు ఇస్తున్నారు. దీంతో సకాలంలో జీతాలు ఇవ్వాలనే డిమాండ్‌తో ఉద్యోగులు సమ్మెకు దిగారు. అనంతరం క్రమబద్ధీకరణ లేకపోతే ఎంటీఎస్‌ అయినా ఇవ్వాలని కోరారు. ఉద్యోగ భద్రత ఇతర ప్రయోజనాలు ఇచ్చే హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని పట్టుబట్టారు. జీతాలు పెంచాలనేది మరో డిమాండ్‌. ఈ డిమాండ్లతో డిసెంబరు 20 నుంచి సమ్మెలోకి వెళ్లారు. అనంతరం కొద్దిరోజులకు విద్యాశాఖ మంత్రి విశాఖపట్నంలో వీరితో చర్చలు జరిపి ప్రధాన డిమాండ్లు పరిశీలిస్తామని, ఈ ప్రభుత్వంలో జీతాలు పెరగనివారికి 23శాతం పెంచుతామని హామీ ఇచ్చారు. చర్చల అనంతరం బయటికొచ్చిన జేఏసీ చైర్మన్‌ కాంతారావు చర్చలు విఫలమైనట్లు ప్రకటించారు. అనంతరం కేజీబీవీ టీచర్లు కూడా సమ్మెలోకి వచ్చారు. సమ్మె చేస్తున్నవారిని తొలగించాలని సమగ్రశిక్ష ఎస్పీడీ ఆదేశించడంతో కొందరు టీచర్లు భయపడి సమ్మె విరమించారు.

Updated Date - Jan 12 , 2024 | 06:28 AM