Share News

ఉద్యమాల పురటిగడ్డ తెనాలిలో గెలుపెవరిది?

ABN , Publish Date - May 03 , 2024 | 04:11 AM

రాజకీయ చైతన్యానికి తెనాలి పెట్టింది పేరు. ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ పట్టణం.. ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, సినీ, నాటక రంగ ప్రముఖులు, రాజకీయ ఉద్దండులను జాతికి అందించింది.

ఉద్యమాల పురటిగడ్డ తెనాలిలో గెలుపెవరిది?

మనోహర్‌ X శివకుమార్‌

టీడీపీ-బీజేపీ మద్దతుతో జనసేన అభ్యర్థిగా నాదెండ్ల

వైసీపీ తరఫున రెండోసారీ అన్నాబత్తుని

‘ఆంధ్రా ప్యారిస్‌’లో గెలిచిన పార్టీదే రాష్ట్రంలో అధికారం

1983 నుంచీ ఇదే ఆనవాయితీ

ఉద్యమాల పురిటిగడ్డ.. రాజకీయ చైతన్యానికి తెనాలి పెట్టింది పేరు. ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ పట్టణం.. ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, సినీ, నాటక రంగ ప్రముఖులు, రాజకీయ ఉద్దండులను జాతికి అందించింది.

పైరుగాలులతో పచ్చచీర కట్టుకున్నట్లు కనిపించే ఈ పట్టణం మధ్య నుంచి వెళ్లే మూడు కాల్వలు దానికి ‘ఆంధ్రా ప్యారిస్‌’ పేరునూ తెచ్చిపెట్టాయి.

1952లో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడ్డాక 15 సార్లు ఎన్నికలు జరిగాయి. మే 13న 16వ ఎన్నిక జరగనుంది. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం 1983 ఎన్నికల నాటి నుంచీ ఆనవాయితీగా వస్తోంది.

ఇక్కడ గెలిచిన కొణిజేటి రోశయ్య, నాదెండ్ల భాస్కరరావు, అన్నాబత్తుని సత్యనారాయణ, నాదెండ్ల మనోహర్‌ వంటివారు మంత్రివర్గాల్లోనూ చోటు దక్కించుకున్నారు. తొలి ఎమ్మెల్యేగా గెలిచిన ఆలపాటి వెంకటరామయ్య కుంటుంబంలోనివారే ఇక్కడ ఆరు సార్లు గెలుపొందడం విశేషం. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి తెనాలి రాజకీయ చిత్రం మారుతూ వచ్చింది.

నువ్వా నేనా?

టీడీపీ-బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా జనసేన తరఫున ఆ పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పోటీ చేస్తుంటే.. అధికార వైసీపీ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ తలపడుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటుకాకపోవడటంతో ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యే నెలకొంది. మనోహర్‌ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుమారుడే అయినా.. తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు స్పీకర్‌గా కూడా వ్యవహరించారు. తర్వాత జనసేనలో చేరి ఆ పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్త్తున్నారు.

వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన శివకుమార్‌ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత అన్నాబత్తుని సత్యనారాయణ కుమారుడు. టీడీపీని వీడి ఆయన వైసీపీలో చేరారు. ఒకసారి ఓడిపోయినా, గత ఎన్నికల్లో గెలుపొందారు. అభ్యర్థులిద్దరూ ఒకే సామాజిక వర్గం కావడం విశేషం. నియోజకవర్గంలో ఎస్సీ, కాపు, కమ్మ సామాజిక వర్గాలది కీలక పాత్ర. తటస్థంగా ఉండే ఆర్యవైశ్యుల ఓట్లు నిర్ణయాత్మకంగా ఉంటాయి.

నాదెండ్ల మనోహర్‌ బలాలు...

సౌమ్యుడు, వివాదరహితుడు. నియోజకవర్గ ప్రజలందరికీ సుపరిచితుడు. జనసేనలో కీలక నేత. టీడీపీ-బీజేపీ నుంచి సంపూర్ణ మద్దతు. స్పీకర్‌గా ఉన్న సమయంలో రూ.100 కోట్లతో తాగునీటి పథకం, నాలుగు లైన్ల రహదారి సహా పలు భారీ అభివృద్ధి పనులు. కాపు, కమ్మ సామాజికవర్గాల ఓట్లు ఎక్కువగా ఉండడం. ప్రభుత్వంపై వ్యతిరేకత.

బలహీనతలు..

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా రాష్ట్రమంతటా తిరుగుతుండడం వల్ల నియోజవకర్గంలో అందుబాటులో ఉండరనే ప్రచారం. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ వర్గీయుల్లో కొంత అసంతృప్తి.


శివకుమార్‌ బలాలు..

శివన్నగా స్థానిక జనంలో గుర్తింపు. అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా హాజరవడం, వైసీపీ తరపున గెలిచినా టీడీపీ వారికీ పనులు చేసిపెట్టడం.

బలహీనతలు..

ఇసుక విచ్చలవిడి తవ్వకాలు.. మేనల్లుడి ఇసుక దందా. గంజాయి విక్రయాలు పెరిగిపోవడం, అల్లరి మూకలను కట్టడి చేయలేకపోవటం, రౌడీషీటర్ల ఆగడాలు, ఆర్యవైశ్యులపై దాడులు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల అవస్థలు, 25వేల మందికి ఇళ్ల స్థలాలిచ్చినా, అన్నీ పట్టణానికి దూరంగా ఉండడం..

ఈ స్థలాల కోసం పొలాలను అఽధిక రేట్లకు కొనుగోలు చేసి, భారీగా వెనకేశారనే ఆరోపణలు. ఆ స్థలాల్లో ఇళ్లు కట్టించేందుకు లబ్ధిదారుల పేరుపై డ్వాక్రా రుణాలు తీసుకుని.. ఏళ్లు గడచినా పనులు మొదలుపెట్టకపోవడం.

నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గం పరిధిలో తెనాలి

పట్టణం, రూరల్‌ మండలం, కొల్లిపర

మండలం ఉన్నాయి.

మొత్తం ఓటర్లు: 2,65,863

పురుషులు: 1,28,188.. మహిళలు: 1,37,642, ట్రాన్స్‌జెండర్లు: 33

సామాజిక వర్గాల వారీగా ..

ఎస్సీలు: 56 వేలు, కాపులు: 40 వేలు, కమ్మ: 31 వేలు, వైశ్యులు: 26 వేలు, ముస్లిం: 24 వేలు, యాదవ: 20 వేలు, రెడ్లు: 12 వేలు.

- తెనాలి, ఆంధ్రజ్యోతి.

కలయిక మేలుచేస్తుందన్న ధీమా!

గత ఎన్నికల్లో త్రిముఖ పోటీ కారణంగా ఓట్లు చీలి వైసీపీ నెగ్గింది. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌కు 94,495 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు 76,846 ఓట్లు, జనసేన అభ్యర్థి మనోహర్‌కు 29,905 ఓట్లు పోలయ్యాయి.

టీడీపీ-జనసేన కలిస్తే 1,06,751 ఓట్లు. 12,256 ఓట్ల మెజారిటీతో ఉమ్మడి అభ్యర్థి గెలిచేవారు. ఈసారి మనోహర్‌ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలవడంతో విజయం ఖాయమని కూటమి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - May 03 , 2024 | 04:19 AM