Share News

AP News: సీట్ల సర్దుబాటుపై బాబు-పవన్‌ విస్తృత మంతనాలు.. జనసేనకు కేటాయించిన నియోజకవర్గాలివే!

ABN , Publish Date - Feb 05 , 2024 | 06:58 AM

సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన చర్చలు కొలిక్కి వస్తున్నాయి. జనసేనకు కేటాయించే సీట్లపై దాదాపు స్పష్టత వచ్చింది.

AP News: సీట్ల సర్దుబాటుపై బాబు-పవన్‌ విస్తృత మంతనాలు.. జనసేనకు కేటాయించిన నియోజకవర్గాలివే!

బాబు-పవన్‌ విస్తృత మంతనాలు

32 సీట్లు కోరిన జనసేనాని.. 20చోట్ల ఏకాభిప్రాయం

మరో ఐదు ఇచ్చే చాన్సు.. 27 అడుగుతున్న పవన్‌!

మధ్యాహ్నం, రాత్రి రెండు దఫాలుగా చర్చ.. జనసేన సీట్లపై వస్తున్న స్పష్టత

రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్‌, యలమంచిలి, భీమవరం,

నరసాపురం జనసేనకే!.. పోలవరం, బెజవాడ వెస్ట్‌, తెనాలి, దర్శి కూడా..

విజయావకాశాలే ప్రాతిపదికగా సీట్లపై కీలక నిర్ణయం

గోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు కోరుతున్న సేన

8న మళ్లీ భేటీ.. 14న పాలకొల్లులో ఉమ్మడి సభ.. మేనిఫెస్టో ప్రకటన

కుదిరితే అభ్యర్థుల వెల్లడి కూడా?.. ఇద్దరూ కలిసి ఒకరోజు పాదయాత్ర?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన చర్చలు కొలిక్కి వస్తున్నాయి. జనసేనకు కేటాయించే సీట్లపై దాదాపు స్పష్టత వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదివారం మధ్యాహ్నం, రాత్రి పొద్దుపోయాక రెండు దఫాలుగా సమావేశమయ్యారు. ఉభయ పార్టీల నేతలెవరూ లేకుండా ఏకాంతంగా, సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. పొత్తు సీట్లను త్వరత్వరగా తేల్చడమే ఈ భేటీల ఉద్దేశం. మధ్యాహ్నం తొలుత ఇక్కడి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్‌ వచ్చారు. వెంట ఎవరూ లేకుండా మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయం నుంచి తన కారు తానే డ్రైవ్‌ చేసుకుంటూ పవన్‌ వచ్చారు. ఆయనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వాగతం పలికారు. తర్వాత చంద్రబాబు ఆయన్ను ఇంట్లోకి తోడ్కొని వెళ్లారు. సుమారు మూడు గంటలపాటు చర్చలు జరిపారు. ప్రధానంగా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార కార్యాచరణపై చర్చలు సాగాయి. రాత్రి 9.30 గంటలకు మరోసారి పవన్‌ ఉండవల్లికి వచ్చి చంద్రబాబుతో మంతనాలు జరిపారు. ఒక్కో అసెంబ్లీ స్థానాన్ని తీసుకుని.. అక్కడ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది.. ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి.. తమ తమ సర్వేల నివేదికల ఆధారంగా చర్చలు జరిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జనసేనాని 32 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలు ఇవ్వాలని కోరారు. ఇందులో 20 స్థానాలిచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని.. వాటిపై ఏకాభిప్రాయం కూడా కుదిరిందని జనసేన వర్గాలు తెలిపాయి. టీడీపీ మరో ఐదు స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని, 27 ఇవ్వాలని పవన్‌ కోరుతున్నారని అంటున్నాయి. అలాగే కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను ఇప్పటికే జనసేనకు ఇచ్చారు. తాజాగా అనకాపల్లి గానీ, తిరుపతి గానీ ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలిసింది.

రెండు పార్టీల శిబిరాల నుంచి ‘ఆంధ్రజ్యోతి’ సేకరించిన సమాచారం ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాలో సీట్ల సర్దుబాటే ఈ పార్టీలకు కష్టతరంగా ఉన్నట్లు సమాచారం. జనసేనకు ఎక్కువ మంది నాయకులు అక్కడే ఉన్నారు. అక్కడే ఆ పార్టీ ఎక్కువ సీట్లు కోరుతోంది. టీడీపీకి కూడా బలమైన నాయకత్వం ఆ జిల్లాల్లోనే ఉంది. దీంతో రెండు పార్టీల్లో ఎక్కడ ఎవరికి మంచి అభ్యర్థి ఉన్నారు.. ఎవరికి విజయావకాశాలు ఉన్నాయో బేరీజు వేసుకుని.. తదనుగుణంగా ముందుకెళ్లాలని అధినేతలిద్దరూ నిర్ణయించారు. అదే సమయంలో సామాజిక సమీకరణలు, వైసీపీ అభ్యర్థులు, సర్వేల్లో వస్తున్న ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాల్లో జనసేన అడిగిన స్థానాల్లో విజయనగరంలో 1, విశాఖ-6, తూర్పుగోదావరి-6, పశ్చిమ గోదావరి-4, కృష్ణా-3, గుంటూరు-2, ప్రకాశం-2, నెల్లూరు-2, కడప-1, చిత్తూరు-2, కర్నూలు-1, అనంతపురంలో 2 ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్‌, యలమంచిలి, భీమవరం, నరసాపురం, పోలవరం, విజయవాడ (పశ్చిమ), తెనాలి, దర్శి సహా 20 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని చెబుతున్నారు.

ఒకే చోట కాకుండా..

జనసేనకు కేటాయించే సీట్లన్నీ ఒకేచోట ఉండకుండా వివిధ ప్రాంతాల్లో ఉండేలా సర్దుబాటు చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఉదాహరణకు.. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో జనసేన కోరుతున్న సీట్లన్నీ భీమవరం డెల్టా ప్రాంతం చుట్టుపక్కలే ఉన్నాయి. అందువల్ల అక్కడ తగ్గించి మెట్ట ప్రాంతంలోని గిరిజన నియోజకవర్గం పోలవరం ఇవ్వాలని అనుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇలాంటి సర్దుబాటే జరుగుతున్నట్లు తెలిసింది. కాకినాడ రూరల్‌ సీటు జనసేనకు ఇచ్చి.. కాకినాడ అర్బన్‌ సీటులో తాను పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. కొన్ని చోట్ల ఒకే నియోజకవర్గంలో రెండు పార్టీలకు గట్టి అభ్యర్థులు ఉన్నచోట సమస్య వస్తోంది. ఉదాహరణకు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ ఇన్‌చార్జిగా బంగార్రాజు ఉన్నారు. ఆయన నాలుగేళ్లుగా అక్కడ చురుగ్గా పనిచేస్తున్నారు. జనసేనలో అదే నియోజకవర్గంలో లోకం మాధవి అనే మహిళా నేత ఉన్నారు. ఆమెకు అవకాశం కల్పించాలని జనసేన ఆసక్తిగా ఉంది. కానీ బంగార్రాజుకు విజయావకాశాలు బాగా ఉన్నాయని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. ఆ జిల్లాలో నెల్లిమర్లకు బదులు జనసేనకు గజపతినగరం ఇస్తామని ప్రతిపాదించినట్లు సమాచారం.

గట్టి అభ్యర్థి ఉంటే తిరుపతి జనసేనకే!

రాయలసీమ జిల్లాల్లో జనసేన ఆశిస్తున్న వాటిలో తిరుపతి, మదనపల్లె, రాజంపేట, అనంతపురం వంటివి ఉన్నాయి. జనసేనకు గట్టి అభ్యర్థి ఉంటే తిరుపతి సీటు ఆ పార్టీకి ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ జనసేన తరఫున ప్రతిపాదనలో ఉన్న నేతలకు సర్వేల్లో మొగ్గు రాకపోవడంతో ఆ సీటు విషయం ఇంకా తేలలేదు. విశాఖ నగరంలో తమ పార్టీలోకి కొత్తగా వచ్చిన ఒక నేతను దృష్టిలో ఉంచుకుని ఒక సీటును జనసేన నాయకత్వం కోరుతోంది. ఏ సీటు ఇవ్వవచ్చో అంతర్గతంగా టీడీపీ కసరత్తు చేస్తోంది. జనసేనకు ఏదైనా సీటు ఇస్తే అక్కడ టీడీపీకి ఇన్‌చార్జిగా ఉన్న నేతను మరో స్థానంలో సర్దుబాటు చేసే అవకాశాన్నీ పరిశీలిస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం, తూర్పుగోదావరి నిడదవోలు, కృష్ణా జిల్లా పెడన కూడా చర్చల్లో నలుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎవరూ లేకుండా ఏకాంత చర్చలు..

ఆదివారం రాత్రి రెండో దఫా భేటీ అయిన బాబు, పవన్‌ అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగించారు. సోమవారం నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్తుండడంతో వీలైనన్ని ఎక్కువ సీట్లపై ఆదివారమే స్పష్టత తేవాలన్నది వారి ప్రయత్నంగా చెబుతున్నారు. త్వరగా స్పష్టత వస్తే ఎవరికి వారు తమ పార్టీల్లో నేతలతో చర్చలు, సంప్రదింపులు, బుజ్జగింపులు పూర్తి చేసుకోవచ్చన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. చర్చల సరళిపై చంద్రబాబు, పవన్‌ ఎవరి వద్దా పెదవి విప్పడం లేదు. పూర్తిగా వారిద్దరే ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. ఈ నెల 8న మరోసారి సమావేశమవుతారు. ఈ భేటీ తర్వాత రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి బహిరంగ సభల నిర్వహణపై స్పష్టత వస్తుందని ఆ పార్టీల వర్గాలు తెలిపాయి. మరోవైపు.. ఈ నెల 14న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రెండు పార్టీల ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అందులో చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ పాల్గొంటారు. ఉమ్మడి మేనిఫెస్టోను ఆ సందర్భంగా విడుదల చేయాలని నిశ్చయించారు. అదే సభలో పొత్తు కుదిరిన సీట్ల వివరాలు కూడా ప్రకటిస్తారా.. లేక మరో సందర్భం ఎంచుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. కలిసి ఒకరోజు పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందన్నదానిపైనా చర్చించుకున్నారు. అపోహలకు తావు లేకుండా పరస్పరం సహకరించుకోవాలని, ఎవరి పార్టీ నేతలకు వారు పరిస్థితిని వివరించి.. కలిసి పనిచేసే వాతావరణం నెలకొల్పాలని ఉభయులూ అనుకున్నారు.

టీడీపీ నేతలకు ముందే చెప్పి..

ఏదైనా సీటు జనసేనకు ఇస్తున్నప్పుడు ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలను ముందుగా పిలిపించి పరిస్థితిని వివరించి వారి ఆమోదం తీసుకోవాలని టీడీపీ నాయకత్వం యోచిస్తోంది. ఈ వారంలోనే ఈ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Updated Date - Feb 05 , 2024 | 07:16 AM