Share News

ఎవరి కోసం కొత్త కాలేజీలు?

ABN , Publish Date - Feb 26 , 2024 | 03:01 AM

రాష్ట్రంలో కొత్త కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే.. ఈ ఏర్పాటు వెనుక ఎన్నికల ఎత్తుగడ ఉందనే వాదన వినిపిస్తోంది.

ఎవరి కోసం కొత్త కాలేజీలు?

డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు నోటిఫికేషన్‌

ప్రస్తుతం ఏటా 2 లక్షల సీట్లు ఖాళీ

విద్యార్థుల్లేక వెలవెలబోతున్న కాలేజీలు

అయినా కొత్త కాలేజీల నిర్మాణానికి మొగ్గు?

ఎన్నికల ముందు ప్రచారానికి ఎత్తుగడ

ఏప్రిల్‌ చివరికి మంజూరుచేసేలా షెడ్యూలు

కోర్టుకు వెళ్లాలని యాజమాన్యాల నిర్ణయం!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో కొత్త కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే.. ఈ ఏర్పాటు వెనుక ఎన్నికల ఎత్తుగడ ఉందనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే, గత మూడేళ్లుగా ఏటా 2 లక్షలకు పైగా డిగ్రీ సీట్లు రాష్ట్రంలో మిగిలిపోతున్నాయి. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన డిగ్రీ కాలేజీలు ఇప్పుడు పూర్తిగా వెలవెలబోయే స్థితికి చేరాయి. ఈ నేపథ్యంలో ఐదేళ్లపాటు మౌనం వహించిన జగన్‌ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికలకు ముందు కొత్త కాలేజీల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీచేయడం వెనుక ఆంతర్యం ఏంటనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని, అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నామని ప్రచారం చేసుకునేందుకే ఇలా ఎన్నికల ఎత్తు వేశారనే వాదన వినిపిస్తోంది.

విద్యార్థుల్లేని కాలేజీలు

రాష్ట్రంలో 1,180 ప్రైవేటు, 165 ప్రభుత్వ, 51 ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 3.60 లక్షల సీట్లు ఉన్నాయి. 2023-24లో కేవలం 1.65 లక్షల మంది విద్యార్థులు మాత్రమే డిగ్రీ కోర్సుల్లో చేరారు. 2022-23లో 1.4 లక్షల మంది మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు. అంటే ఏటా 2లక్షల సీట్లు మిగిలిపోతున్నాయి. ఇంటర్మీడియట్‌ తర్వాత ఎక్కువ మంది ఇంజనీరింగ్‌ బాట పట్టడం దీనికి ప్రధాన కారణం. అదేవిధంగా ఎంపీసీయేతర గ్రూపులు చదివిన వారు కూడా ప్రైవేటు యూనివర్సిటీలకు, ఇతర రాష్ర్టాల కాలేజీలకు వెళ్తున్నారు. ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయకపోవడం, హడావుడిగా సింగిల్‌ మేజర్‌ డిగ్రీ విధానం ప్రవేశపెట్టడం లాంటి చర్యలు డిగ్రీ అడ్మిషన్లు పడిపోవడానికి కారణంగా మారాయి. బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(బీసీఏ) లాంటి కోర్సులు ఇంజనీరింగ్‌కు ప్రత్యామ్నాయంగా ఉండటంతో వాటి కోసమే కొందరు డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. సాధారణ బీఏ, బీకాం కోర్సుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. మరోవైపు ఏటా రకరకాల కారణాలతో ఉన్నత విద్యామండలి డిగ్రీ అడ్మిషన్లను జాప్యం చేయడం కూడా అడ్మిషన్లు తగ్గిపోవడానికి కారణమవుతోంది.

అన్ని జిల్లాల్లో కాలేజీలట!

గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఓ కమిటీని నియమించి డిగ్రీ కాలేజీల అవసరంపై అధ్యయనం చేయించింది. 40 శాతం అడ్మిషన్లు లేని కాలేజీలు అవసరం లేదని, కొత్త కాలేజీల అవసరం తలెత్తదని ఆ కమిటీ సిఫారసు చేసింది. దీంతో అప్పటి ప్రభుత్వం ఆ ప్రక్రియను నిలిపివేసి, విద్యల నాణ్యతపై దృష్టి పెట్టింది. జగన్‌ ప్రభుత్వం కూడా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ, ఎన్నికల ముందు హఠాత్తుగా కొత్త కళాశాలల నిర్మాణానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 26 జిల్లాల్లో కనీసం నాలుగైదు ప్రాంతాల్లో కాలేజీల అవసరం ఉన్నట్లు అంచనా వేసింది. సీఎం సొంత జిల్లా కడపలోని బద్వేలు, కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాలను గుర్తించింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలోని బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్‌.కోట, విజయనగరం, రాజాంలను కాలేజీల ఏర్పాటుకు గుర్తించింది. కొత్త కాలేజీ ఏర్పాటుకు మెట్రోపాలిటన్‌ నగరాల్లో 2 ఎకరాలు, ఇతర నగరాలు, ప్రాంతాల్లో 5 ఎకరాల స్థలం ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. 12 వేల చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియా ఉండాలని, ప్రతి తరగతి గది 900 చదరపు అడుగుల్లో ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన భవనాలుంటేనే అనుమతి ఉంటుందని, నిర్మాణంలో ఉంటే దరఖాస్తుకు అర్హులు కారని తెలిపింది.

మాకే లేకపోతే మళ్లీనా?

ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుత డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే 1,180 ప్రైవేటు కాలేజీలున్నాయని, ఏ కాలేజీలోనూ 50శాతం అడ్మిషన్లు జరగడం లేదని, ఈ క్రమంలో కొత్త కాలేజీలు తీసుకురావడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే 2 లక్షల సీట్లు ఖాళీగా ఉంటే, కొత్త కాలేజీల వల్ల ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందని, అంతే తప్ప లాభం ఉండదని భావిస్తున్నాయి. పైగా, కొత్త కాలేజీల వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతుందని, కాలేజీలు మూతపడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు నోటిఫికేషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి.

Updated Date - Feb 26 , 2024 | 08:10 AM