Share News

అభ్యర్థుల ప్రకటన ఇంకెప్పుడు?

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:15 AM

‘ఎన్డీఏ కూటమిలో ప్రధాన పక్షమైన టీడీపీ మూడు విడతల్లో 139 అసెంబ్లీ, 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది.

అభ్యర్థుల ప్రకటన ఇంకెప్పుడు?

బీజేపీ శ్రేణుల్లో పెరిగిపోతున్న అసహనం

రోజుల తరబడి ఢిల్లీలో మకాం వేసిన నేతలు

ఇంకా జాప్యం చేస్తే అభ్యర్థులకు ఇబ్బందులే!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘ఎన్డీఏ కూటమిలో ప్రధాన పక్షమైన టీడీపీ మూడు విడతల్లో 139 అసెంబ్లీ, 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. జనసేన విడతల వారీగా 17 అసెంబ్లీ, ఒక(కాకినాడ) లోక్‌సభ స్థానానికి అభ్యర్థుల పేర్లు వెల్లడించిం ది. మన పార్టీ ఢిల్లీ నుంచి 4 విడతలుగా ప్రకటించిన జాబితాలో ఏపీ మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించేసింది. ఏపీ విషయంలో ఎందుకింత జాప్యం. 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసేందుకు ఇంత కసరత్తు చేయాలా? ఇప్పటికీ అభ్యర్థి ఎవరో తేల్చకపోతే పొత్తుల్లో ఉన్న మిత్ర పక్షాల నేతలను, శ్రేణుల్ని ఎప్పుడు కలవాలి? ’ అంటూ బీజేపీలో టికెట్‌ ఆశిస్తోన్న అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు కుదరక ముందు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుని, ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురిని ఎంపిక చేసిన పార్టీ పెద్దలు.. ఇప్పుడు అఽభ్యర్థుల్ని ఎంపిక చేసుకోలేరా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో నియోజకవర్గం పేరు తెరపైకి వస్తుండటంతో కేడర్‌ సైతం గందరగోళానికి గురౌతోందని, మార్చి 24 నాటికీ బీజేపీ అభ్యర్థులెవరో వెల్లడి కాకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ప్రతి నిమిషమూ విలువైందేనని, ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ముఖ్యనేతలు ఏమీ చెప్పకుండా రోజుల తరబడి ఢిల్లీలో కూర్చుం టే కేడర్‌ సహనం నశిస్తోందని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా జాప్యం చేస్తే ఇబ్బందేనని పార్టీ పెద్దల ఫోన్లకు సందేశాలు పంపుతున్నారు.

ఆ స్థానాల్లోనూ గందరగోళమే..

పొత్తుల్లో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు వార్తలు వచ్చాయి. కూటమి పార్టీ నేతల్లో వినిపిస్తున్న వివరాల ప్రకారం రాయలసీమలో 4, కోస్తాలో 3, ఉత్తరాంధ్రలో 3 సీట్లలో బీజేపీ బరిలో నిలవనుంది. కర్నూలు జిల్లాలో ఆదోని, ఆలూరు సీట్లలో ఒకటి బీజేపీకి ఇస్తారని తెలుస్తోం ది. అనంతపురంలో ధర్మవరం ఖరారైనట్లు చెబుతున్నా.. ఇటీవలే వైసీపీ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే గుంతకల్లు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ధర్మవరం అభ్యర్థికి సహకరించబోమంటూ పరిటాల కుటుంబం నుంచి బీజేపీ పెద్దలకు సంకేతాలు అందడంతో కేడర్‌లో అయోమయం నెలకొంది. కడపలో జమ్మలమడుగు, బద్వేలు బీజేపీకి కేటాయించినట్లు తెలిసినప్పటి నుంచి జమ్మలమడుగు అభ్యర్థి కుటుంబం నుంచి వ్యతిరేకత ఎక్కువైంది. ఇదే అవకాశంగా రాజంపేట అసెంబ్లీ స్థానం కోసం మాజీ సీఎం ద్వారా ఒక ఎమ్మె ల్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విజయవాడ పశ్చిమలో జనసేన టికెట్‌ ఆశించిన నేత మద్ధతుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కైకలూరు నుంచి మాజీ మంత్రి పేరు వినిపిస్తున్నా ఆయన వయసు ఎక్కువంటూ పార్టీలో మరో వర్గం బలంగా ప్రయత్నిస్తోంది. అనపర్తి సీటుకు అభ్యర్థి పేరు చెప్పలేక పార్టీలోనే నీళ్లు నములుతున్నారు. పాడేరు బరిలో దిగుతారనే అభ్యర్థి ఏ మాత్రం సత్తాలేని వ్యక్తి అంటూ ప్రచా రం జరుగుతోంది. ఎచ్చెర్ల అభ్యర్థి సామాజిక వర్గం ఓట్లు కనీసం వెయ్యి కూడా లేవంటున్నారు. అక్కడ టీడీపీలో బలమైన నేతలు సహకరించే అవకాశమేలేదని, తూర్పు కాపులకు కాకుండా మరెవ్వరికి ఇచ్చినా డిపాజిట్లు కష్టమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పేరు వినిపిస్తోన్న అభ్యర్థి, వైసీపీ అభ్యర్థికి వ్యాపార భాగస్వామి అనే ప్రచారం కూడా సోషల్‌ మీడియాలో జరుగుతోంది. ఇక లోక్‌సభ స్థానాల్లోనూ విజయనగరం, రాజంపేట ఇప్పటికీ అయోమయంగానే ఉన్నాయి.

Updated Date - Mar 24 , 2024 | 03:15 AM