సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రానికి ఏం చేస్తాడు..?
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:03 AM
నాన్నని చంపిన వారిని శిక్షించాలని సొంత చెల్లి సునీత కన్నీళ్లు పెడుతున్నా న్యాయం చేయలేని సీఎం జగన్..

జగన్ నిర్వాకంతో వలసపోతున్న యువత
అసెంబ్లీ తాకట్టుపై వైసీపీ నేతల మాటలు బాధాకరం: పురందేశ్వరి
గుంటూరు సిటీ, మార్చి 5: నాన్నని చంపిన వారిని శిక్షించాలని సొంత చెల్లి సునీత కన్నీళ్లు పెడుతున్నా న్యాయం చేయలేని సీఎం జగన్... రాష్ర్టానికి ఏం చేస్తాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. మంగళవారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఆవరణలో జరిగిన ప్రజాపోరు ముగింపు సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ‘సీఎం ఇంటికి సమీపంలోనే ఓ మహిళ హత్యాచారానికి గురయింది. ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇక రాష్ట్రంలోని ఆడపడుచులకు ఏమి భద్రత కల్పించగలడు? 2019 ఎన్నికల్లో ‘ఒక్క అవకాశం’ అన్న జగన్ మాటలు విని ప్రజలు భస్మాసురుని మాదిరిగా వారి చేతులు వారి నెత్తిన పెట్టుకుని రాష్ర్టాన్ని నాశనం చేసుకున్నారు. జగన్‌ని చూసి రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. జగన్ నిర్వాకం వల్లే రాష్ర్టానికి చెందిన యువకులు పొట్ట చేత పట్టుకుని పొరుగు రాష్ర్టాలకు వలస పోతున్నారు. చివరకు జగన్ ధన దాహానికి పవిత్రమైన సచివాలయం కూడా తాకట్టులోకి వెళ్లింది. తాకట్టు పెట్టకూడదని ఎక్కడైనా ఉందా? అని వైసీపీ నాయకులు ప్రశ్నించడం చూస్తుంటే బాధ కలుగుతుంది. చివరకు రాష్ట్రంలోని గనులు కూడా రూ.7 వేల కోట్లకు తాకట్టు పెట్టటం సిగ్గుచేటు. నా చెల్లి, నా తల్లి అంటూ సంబోధిస్తున్న జగన్.. నకిలీ మద్యంతో వారి పుస్తెలు తెంచేస్తున్నారు. రైతులకు మద్దతు ధర స్థిరీకరణ నిధి, పసల్ బీమా యోజన అంటూ ప్రగల్భాలు పలికిన జగన్ వారిని మోసం చేశాడు. అమరావతి రాజధానికి కేటాయించిన నిధులనూ వినియోగించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. 22 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే కేవలం 3 లక్షలు మాత్రమే పూర్తి చేశారంటే జగన్‌కు పేదలపై ఉన్న ప్రేమ ఎంతో అర్థం అవుతుంది’ అని పురందేశ్వరి ఎద్దేవా చేశారు.