Share News

మేమేమి చేశాం పాపం..

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:02 AM

మేమేమి పాపం చేశాం... మాకు జగనన్న కాలనీలో పట్టాలు ఇచ్చి... రిజిస్ర్టేషన్‌ , జియో ట్యాగ్‌ చేసినా రెవెన్యూ అధికారులు మరో వ్యక్తికి పొజిషన్‌ పట్టా ఎలా ఇస్తారు’ అంటూ ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం హాలహర్వి గ్రామ మహిళలు బుడ్డమ్మ, శేకమ్మ, రంజానమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

మేమేమి చేశాం పాపం..
సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న హాలహర్వి గ్రామస్థులు

ఆంధ్రజ్యోతి కథనంతో కదిలిన అధికారులు

46మందికి రిజిస్ర్టేషన్‌

ముగ్గురికి పెండింగ్‌

సబ్‌ కలెక్టర్‌ను కలిసిన బాధితులు

ఆదోని రూరల్‌, ఫిబ్రవరి 12 : ‘మేమేమి పాపం చేశాం... మాకు జగనన్న కాలనీలో పట్టాలు ఇచ్చి... రిజిస్ర్టేషన్‌ , జియో ట్యాగ్‌ చేసినా రెవెన్యూ అధికారులు మరో వ్యక్తికి పొజిషన్‌ పట్టా ఎలా ఇస్తారు’ అంటూ ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం హాలహర్వి గ్రామ మహిళలు బుడ్డమ్మ, శేకమ్మ, రంజానమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని సర్వే నెం.407లో 117మందికి ఒకటిన్నర సెంటు చొప్పున ప్రభుత్వం ఏడాది క్రితం జగనన్న ఇంటి స్థలాలు కేటాయించి హద్దులు ఏర్పాటు చేసి పట్టాలు ఇచ్చి జియో ట్యాగింగ్‌ కూడా చేశారు. అందులో 49 మంది లబ్ధిదారుల స్థలాలను స్థానిక వైసీపీ నాయకులు కబ్జా చేశారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు నెలల తరబడి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా వారికి న్యాయం జరగలేదు. గత సోమవారం 5వ తేదీన బాధితులు ఆదోని సబ్‌ కలెక్టర్‌ శివ నారాయణ శర్మను కలిసి తమ గోడును చెప్పుకున్నారు. ఈ సంఘటనపై ఆంధ్రజ్యోతి పత్రికలో జగనన్న స్థలాల కబ్జా కథనం 6వ తేదీన ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. దిగివచ్చిన రెవెన్యూ అధికారులు రాత్రికి రాత్రే బాధితులను సచి వాలయానికి పిలిపించి 46మందికి రిజిస్ర్టేషన్లు చేశారు. అయితే ముగ్గురికి మాత్రం రిజిస్ర్టేషన్‌ చేయకుండా నిలిపేశారు. కారణం అప్పటి తహసీల్దార్‌ నిత్యానంద రాజు ఈ ముగ్గురికి ఇచ్చిన 72, 73, 74 ప్లాట్లను అదే గ్రామానికి చెందిన జోమప్ప కొక్కడికే పొజిషన్‌ పట్టా ఇచ్చారు. దీంతో వ్యక్తి ఆ స్థలంలోకి లబ్ధిదారులను రానివ్వడం లేదు. దీంతో ఆ ముగ్గురు మహిళా లబ్ధిదారులు సోమవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ సిబ్బందిని కలిసి తమ గోడును విన్నవించారు. 49మందిలో 46మందికి రిజిస్ర్టేషన్‌ చేశారని, మేం ముగ్గురం మాత్రం ఏ పాపం చేశామని వాపోయారు. రెండు రోజుల్లో మీకు న్యాయం చేస్తామని, అలాగే త్వరలో 49మంది లబ్ధిదారులకు క్షేత్ర స్థాయిలో ప్లాట్లను అప్పజెబుతామని సిబ్బంది హామీ ఇచ్చారు.

Updated Date - Feb 13 , 2024 | 12:02 AM