Share News

అతిసారం మరణాలని మీరెలా చెబుతారు?

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:39 AM

గుంటూరులో అతిసారం మరణాలు జరిగాయని ప్రతిపక్ష పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు.

అతిసారం మరణాలని మీరెలా చెబుతారు?

ఆరోగ్య శాఖ మంత్రి రజిని వితండవాదం

గుంటూరు జీజీహెచ్‌లో పెరుగుతున్న డయేరియా కేసులు

రోగుల కోసం హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు

గుంటూరు(మెడికల్‌) ఫిబ్రవరి 11: గుంటూరులో అతిసారం మరణాలు జరిగాయని ప్రతిపక్ష పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. గుంటూరులో అతిసారం ప్రబలి ఇద్దరు మృతి చెందగా, పెద్ద సంఖ్యలో రోగులు ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంత జరిగినా మంత్రి మాత్రం మరణాలకు కారణం అతిసారం కాదని చెప్పడం గమనార్హం. మరో పక్క అతిసారాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఉన్నతాధికారులతో ఆమె ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఇంకా వైద్యుల నుంచి పరీక్షల నివేదికలు పూర్తిస్థాయిలో అందకుండానే అతిసారం మరణాలని ప్రచారం చేయడం తగదన్నారు. విపక్షాలు అనవసరంగా యాగీ చేస్తున్నాయని, అవి డయేరియా మరణాలని వారెలా చెబుతారని ప్రశ్నించారు.

పెరుగుతున్న కేసులు...

గుంటూరు నగరంలోని పలు కాలనీల్లో ఆదివారం కూడా డయేరియా కేసులు వెలుగు చూశాయి. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ పలువురు నగరంలోని ప్రైవేటు వైద్యశాలల్లో చేరారు. మరో 29 మంది గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. ప్రస్తుతం 42 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నామని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. డయేరియా పరిస్థితిపై సమీక్షించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ట్రోల్‌ఫ్రీ ఫోన్‌ నెంబర్‌ ప్రకటించారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ కీర్తి చేకూరి ఆదివారం డయేరియా ప్రబలిన ప్రాంతాలను సందర్శించారు. పైపులైన్లను పరిశీలించారు. నీటి నాణ్యతపై నివేదిక లు వచ్చే వరకు ఆయా ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీ టిని సరఫరా చేస్తామని మేయర్‌ మనోహర్‌ ప్రకటించారు.

ప్రభుత్వానిదే బాధ్యత: టీడీపీ వైద్య విభాగం

నెల్లూరు, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): డయేరియాతో గుంటూరులో ఇద్దరు చనిపోవడం బాధాకరమని, ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జెడ్‌.శివప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ..మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 12 , 2024 | 02:39 AM