భార్గవ్‌రెడ్డిపై పెట్టిన కేసేంటి?
ABN , Publish Date - Nov 13 , 2024 | 05:12 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణిపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టాల్సిందిగా ఆదేశించారంటూ వైసీపీ సోషల్ మీడియా మాజీ అధినేత సజ్జల భార్గవ్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని గుడివాడ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

వివరాలు సమర్పించాలని గుడివాడ పోలీసులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణిపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టాల్సిందిగా ఆదేశించారంటూ వైసీపీ సోషల్ మీడియా మాజీ అధినేత సజ్జల భార్గవ్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని గుడివాడ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వలేమని పేర్కొంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న అర్జున్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను కూడా అదే రోజుకు వాయిదా వేశారు. చంద్రబాబును, ఆయన భార్య భువనేశ్వరిని దూషిస్తూ కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మహ్మద్ ఖాజాబాబా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని గుడివాడ బాపూజీనగర్‌కు చెందిన ఆకునూరి శ్రీరాం కనకాంబరం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అక్కడి పోలీసులు ఈ నెల 3న కేసు నమోదు చేశారు. ఖాజాబాబాను అరెస్టు చేసి సంబంధిత కోర్టులో రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు.
సజ్జల భార్గవ్‌రెడ్డి ఆదేశాల మేరకే పోస్టులు పెట్టామని అతడు వాంగ్మూలం ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. భార్గవ్‌రెడ్డిని కేసులో మొదటి నిందితుడిగా, ఎస్.అర్జున్‌రెడ్డిని రెండో నిందితుడిగా చేర్చారు. వారిద్దరూ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకు రాగా.. వారి తరఫున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఓ మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఎన్‌ఎస్ చట్టం 2024 జూలై 1న అమల్లోకి వచ్చిందని.. నేర ఘటన జరిగేనాటికి అది అమల్లో లేనందున ఆ చట్టంలోని సెక్షన్ 111 కింద పిటిషనర్లపై నమోదు చేసిన కేసు చెల్లుబాటు కాదని తెలిపారు. పోలీసులు మొదట నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి పేర్లు లేవని.. ఓ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వారిని కేసులో నిందితులుగా చేర్చారని.. వారిని అరెస్టు చేసే ప్రమాదం ఉందని, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించాలని కోరారు. ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పంది స్తూ.. ఈ ఏడాది సెప్టెంబరులో కూడా అసభ్యకర పోస్టులు పెట్టారని.. అందుచేత బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 111 వర్తిస్తుందని తెలిపారు. ముందస్తు బెయిల్ పిటిషన్లు మొదటిసారి విచారణకు వచ్చాయని.. కేసు వివరాలు తెలుసుకుని వాదనలు వినిపించేందుకు సమయమివ్వాలని కోరారు.