వలంటీర్లకు విధులేవీ?
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:26 AM
సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ సజావుగా సాగుతోంది.

సచివాలయ ఉద్యోగులతోనే విజయవం తంగా పింఛన్ల పంపిణీ
వచ్చే నెలా వారితోనే ఆ పనులు!
పనిచేయకుండానే వలంటీర్లకు ఒక నెల జీతాలు
మరో నెల జీతాలకూ బిల్లులు పెట్టిన అధికారులు
ప్రతి నెలా వలంటీర్లకు 50 కోట్ల దాకా చెల్లింపులు
జాబ్‌చార్టూ లేదు.. సచివాలయాలకు వెళ్లాలనే నిబంధనాలేదు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ సజావుగా సాగుతోంది. ఈనెల ఒకటో తేదీన సచివాలయ ఉద్యోగులు సమర్థవంతంగా పింఛన్లు పంపిణీ చేయడంతో ఇక నుంచి వారితోనే పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చని, అందుకోసం అదనంగా సిబ్బంది అవసరం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, పనిచేయని వలంటీర్లకూ టీడీపీ కూటమి ప్రభుత్వం జీతాల బిల్లులు పెడుతుండటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు వలంటీర్లు రాజీనామా చేయగా, చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ఆశతో మిగిలినవారు కొనసాగుతున్నారు. వారికి ప్రభుత్వం ఎలాంటి జాబ్‌చార్ట్‌నూ అప్పగించలేదు. సచివాలయాలకు హాజరు కావాలన్న నిబంధనలు కూడా వారికి పెట్టలేదు. అయినా.. వారికి జీతాలు చెల్లించేందుకు అధికారులు బిల్లులు పెట్టారు. ఇప్పటికే పని చేయకుండానే ఒక నెల జీతం తీసుకున్నారు. మరో నెలకు కూడా వారికి జీతం బిల్లు పెడుతుండటంతో పనిచేయకుండానే టీడీపీ కూటమి సర్కార్ వైసీపీ కార్యకర్తలకు జీతాలు ఇస్తోందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండన్నర లక్షల మంది వలంటీర్లు ఉండగా, ఎన్నికల సమయంలో వారిలో సగం మంది రాజీనామా చేసినట్లు చెప్తున్నారు. అంటే లక్ష మందికిపైగా పని లేకుండానే ఒక్కొక్కరికీ రూ.5 వేల చొప్పున నెలకు సుమారుగా రూ.50 కోట్ల దాకా వైసీపీ కార్యకర్తలకు జీతాలుగా చెల్లిస్తున్నారు.
గత ఐదేళ్లలో పింఛన్ల పంపిణీ విధులకే రూ.7,600 కోట్లు..
పింఛన్‌దారులకు మొదటి రోజునే సచివాలయ ఉద్యోగులు పింఛన్ అందించి వారి మన్ననలు పొందారు. జగన్ ప్రభుత్వం దీని కోసం వలంటీర్లును నియమించుకుని గత ఐదేళ్లలో రూ.7,600 కోట్లు ఖర్చు చేసింది. పింఛన్ల పంపిణీ తప్ప వలంటీర్లు ప్రజల కోసం ప్రత్యేకంగా పనిచేసిన దాఖలాల్లేవు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన నగదు బదిలీ పథకాలన్నీ సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగాయి. మొబైల్‌లో యాప్‌లు పెట్టి ఫోన్ల ద్వారా డేటా సేకరించడం, పార్టీకి అనుకూలంగా పనిచేయడమే వలంటీర్ల విధులు. వలంటీర్లుగా సొంత పార్టీ కార్యకర్తలను నియమించుకుని వేల కోట్ల ప్రజాధనాన్ని వైసీపీ ప్రచారానికే వాడుకున్నారు. వలంటీర్లతో పాటు పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కూడా ప్రభుత్వ ఖర్చుతో చేయించుకున్నారు. తద్వారా ప్రజల సొమ్మును వైసీపీ ప్రభుత్వం యథేచ్ఛగా దుర్వినియోగం చేసింది. వలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే వారిని దేని కోసం వాడుకోవాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వారు చేసే పింఛన్ పంపిణీని ఇప్పుడు సచివాలయ ఉద్యోగులే సమర్థవంతంగా చేపడుతున్నందున, ఈ కార్యక్రమం కోసం వలంటీర్లు అవసరం లేదంటున్నారు. అయితే, వలంటీర్లకు జీతాలు ఇస్తున్నందున వారినీ ఏదో పనికి ఉపయోగించుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సాధ్యమని నిరూపించేందుకే..
టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే రీతిలో అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే ఐదు హామీలపై మొదటి సంతకాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటి అమలుకు శ్రీకారం చుట్టారు. అందులో ప్రధానమైన సామాజిక పింఛన్లు ఎన్టీఆర్ భరోసా హామీని అమలు చేశారు. సచివాలయ ఉద్యోగులతోనే పింఛన్లను ఇంటింటికీ పంపిణీ చేసి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వంలో వలంటీర్ల వల్లనే పింఛన్ పంపిణీ సజావుగా జరిగిందని, వారు లేకుండా పింఛన్లు ఇంటింటికెళ్లి ఇవ్వలేమని ఎన్నికల వేళ వైసీపీ నేతలు, ప్రభుత్వ పెద్దలు పెద్దఎత్తున ప్రచారం చేశారు. అధికారులు సైతం సచివాలయ ఉద్యోగులకు ఈ బాధ్యత అప్పచెప్పకుండా అకౌంట్లలో పింఛన్ వేసి పింఛన్‌దారులను ఇబ్బంది పెట్టారు. 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఓ వైపు పింఛన్ పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అప్పట్లో అధికారులు అంగీకరించలేదు. దీంతో సచివాలయ ఉద్యోగులతోనే పకడ్బందీగా పింఛన్ల పంపిణీ చేపట్టవచ్చని నిరూపించేందుకు కూటమి సర్కార్ చర్యలు ప్రారంభించి విజయవంతం చేసింది.