Share News

భలే చెప్పారు!

ABN , Publish Date - Jun 07 , 2024 | 01:55 AM

వాళ్లేం సెఫాలజిస్టులు కాదు! తలపండిన రాజకీయ విశ్లేషకులూ కాదు! సర్వేలు చేయలేదు! జ్యోతిష్యులు అసలే కాదు. అయినా, జనం నాడి ఇదే అని తేల్చి చెప్పారు.

భలే చెప్పారు!

నిజమైన ‘ఆంధ్రజ్యోతి’ పాఠకుల పోల్స్‌

కూటమికి 164... వైసీపీకి 11

కచ్చితమైన అంచనా వేసిన 13 మంది

‘ఎవరు గెలిచినా మీదే గెలుపు’ పోటీకి భారీ స్పందన

త్వరలో ‘డ్రా’ తీసి విజేతల ప్రకటన

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

వాళ్లేం సెఫాలజిస్టులు కాదు! తలపండిన రాజకీయ విశ్లేషకులూ కాదు! సర్వేలు చేయలేదు! జ్యోతిష్యులు అసలే కాదు. అయినా, జనం నాడి ఇదే అని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలిచే, వైసీపీకి దక్కే సీట్లను వందశాతం కచ్చితత్వంతో అంచనా వేశారు. ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా 13 మంది ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులు ఈ ఘనత సాధించారు. కూటమికి 164 సీట్లు వస్తాయని, వైసీపీ 11 స్థానాలతో సరి పెట్టుకుంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌కంటే ముందే అంచనా వేశారు. ఈ ఎన్నికల్లో జనం నాడిని తెలుసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ఒక వినూత్నమైన ప్రయోగం చేసింది. ‘ఎవరు గెలిచినా మీదే గెలుపు’ అంటూ రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేసి చెప్పాలంటూ పాఠకులను కోరింది. వారానికి రెండు చొప్పున మొత్తం 8 కూపన్లు ప్రచురించింది. దీనికి పాఠకుల నుంచి భారీ స్పందన లభించింది. రాష్ట్రస్థాయిలో వేలాది కూపన్లు అందాయి. ఇందులో దాదాపు 80 శాతం మంది కూటమే గెలుస్తుందని, వైసీపీకి పరాభవం తప్పదని అంచనా వేశారు. అందులోనూ... 13 మంది పాఠకులు కూటమికి 164, వైసీపీకి 11 స్థానాలు వస్తాయని కచ్చితత్వంతో అంచనా వేశారు. ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి ఇద్దరేసి పాఠకులు, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి ఒక్కొరు చొప్పున ఈ ఘనత సాధించారు. ఎగ్జిట్‌ పోల్స్‌కంటే ముందే వెలువడిన ‘పాఠకుల పోల్స్‌ ఇది! మొత్తం 13 మంది ‘విజేత’లుగా నిలిచిన నేపథ్యంలో... ‘డ్రా’ తీసి బహుమతులను అందించడం జరుగుతుంది. మొదటి బహుమతిగా రూ.లక్ష బంపర్‌ ప్రైజ్‌ లభిస్తుంది. రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు, ఆ తర్వాతి ఐదు స్థానాల్లో ఉన్న వారికి రూ.10వేల చొప్పున నగదు బహుమతి అందిస్తాం.

Updated Date - Jun 07 , 2024 | 01:55 AM