Share News

చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పిస్తాం

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:02 AM

చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించి చేనేత కార్మికులకు చేయూతనిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు.

చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పిస్తాం

జీఎస్టీని రద్దు చేయించి ఆదుకుంటాం

నాటి సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం

దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించండి

చేనేత మహిళలకు నారా భువనేశ్వరి పిలుపు

ఉమ్మడి అనంతలో కొనసాగిన ‘నిజం గెలవాలి’ యాత్ర

పుట్టపర్తి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించి చేనేత కార్మికులకు చేయూతనిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా ఆమె ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో బుధవా రం పర్యటించారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ధర్మవరంలో చేనేత మహిళల ఆత్మీయ సమావేశంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ధర్మవరం చేనేత వస్త్రాలకు 125 ఏళ్ల చరిత్ర ఉందని, వరల్ట్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఈ వస్త్రాలు చేరడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. చేనేత రంగానికి ఊతమిచ్చిన ఘనత తన తండ్రి ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు. చంద్రబాబు పాలనలో చేనేత కార్మికులకు గుర్తింపునిచ్చి, రాయితీలు, సంక్షేమ పథకాలతో ఆదుకున్నామని అన్నారు. చంద్రబాబు హయాంలో వారికి అందిన పథకాలను వైసీపీ ప్రభుత్వం ఆపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా చేనేత రంగంపై ఆధారపడిన కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల బలవన్మరణాలకు వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుంటుంబాలకు టీడీపీ అండగా నిలబడుతుందని అన్నారు.

అధికారంలోకి వచ్చాక ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయిస్తామని అన్నారు. కేంద్రం ఒప్పుకోకపోతే ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టాలని కోరారు. అధికారంలోకి రాగానే గతం లో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని, మరిన్ని సంక్షేమ ఫలాలు అందిస్తామని అన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించి, కృష్ణా మిగులు జలాలతో రాయలసీమను చంద్రబాబు సస్యశ్యామలం చేశారని అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సాగు, తాగు నీరిచ్చిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు. కియ కార్ల తయారీ పరిశ్రమ, టెక్స్‌టైల్‌, ఫుడ్‌ పార్క్‌లతో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. ఇక్కడి భూముల విలువలు పెరిగాయని అన్నారు. ఇది చంద్రబాబు మార్కు అని అన్నారు. యువగళం పాదయాత్రలో లోకేశ్‌ ‘మిషన్‌ రాయలసీమ’ డిక్లరేషన్‌ ప్రకటించారని, ఉమ్మడి అనంతపురం జిల్లాను ఆటోమొబైల్‌ హబ్‌గా మారుస్తామని మాట ఇచ్చారని, అధికారంలోకి రాగానే అమలు చేస్తామని అన్నారు. ఇవన్నీ జరగాలంటే రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీ దుర్మార్గపు ప్రభుత్వాన్ని మహిళలు ఓటు ఆయుధంతో గద్దె దించాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు.

మేమున్నాం.. అధైర్యపడొద్దు

కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మృతిచెందిన వారి కుటుంబాలను బుధవారం పరామర్శించారు. బత్తలపల్లి మండలంలోని సంజీవపురంలో ముళ్లగురి వెంకటరాముడు, చక్కిరయ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. కనగానిపల్లి మండలం వేపకుంటలో టీడీపీ కార్యకర్త బెస్త నారాయణ కుటంబాన్ని, రామగిరి మండలం పోలిపల్లిలో కంపల్లి వెంకటరాముడు కుటుంబాన్ని, పెనుకొండలో టీడీపీ కార్యకర్త రహీమ్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

Updated Date - Feb 15 , 2024 | 03:02 AM