Share News

రోడ్డు వేస్తేనే కదలనిస్తాం..!

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:12 AM

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. తమ ఊర్లకు రోడ్డు ఎందుకు వేయలేదంటూ రెండు గ్రామాల ప్రజలు ఆయనను ఘెరావ్‌ చేసినంత పనిచేశారు.

రోడ్డు వేస్తేనే కదలనిస్తాం..!

మంత్రి పెద్దిరెడ్డిని చుట్టుముట్టిన ప్రజలు

దళితులమని చిన్నచూపు చూస్తున్నారా అని నిలదీత

హిందూపురం, జనవరి 10: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. తమ ఊర్లకు రోడ్డు ఎందుకు వేయలేదంటూ రెండు గ్రామాల ప్రజలు ఆయనను ఘెరావ్‌ చేసినంత పనిచేశారు. అధికారంలోకొచ్చి ఐదేళ్లవుతున్నా రెండు కిలోమీటర్ల రోడ్డు కూడా వేయలేరా.. అంటూ మంత్రి పెద్దిరెడ్డిని చుట్టుముట్టి నిలదీశారు. మీకు ఓటుతోనే బుద్ధి చెబుతామని మంత్రి ముఖానే చెప్పేశారు. హిందూపురం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి పంచాయతీల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం లేపాక్షి మండలంలోని మానెంపల్లిలో సమావేశానికి పెద్దిరెడ్డి హాజరయ్యారు. అనంతరం స్థానిక సర్పంచ్‌ నిర్మలమ్మ ఇంటికి భోజనానికి వెళ్లారు. మానెంపల్లి పంచాయతీ పరిధిలోని గౌరిగానిపల్లి, వెంకటాపురం గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని, నినాదాలు చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డిని చుట్టుముట్టారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా తమ గ్రామాలకు 2 కి.మీ. రోడ్డు కూడా వేయలేకపోయారని మండిపడ్డారు. వెంకటాపురంలో దళిత విద్యార్థులు అధికంగా ఉన్నారని, అందుకే తమపట్ల చిన్నచూపు చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు లేకపోవడంతో రెండు కిలోమీటర్లు నడిచివెళ్లి బస్సు ఎక్కాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్య పరిష్కరించాలని, అప్పటిదాకా కదిలే ప్రసక్తేలేదని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు ససేమిరా అన్నారు. చివరికి ఎన్నికల్లోపుగాని, ఆ తరువాతగాని తప్పకుండా రోడ్డు వేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో వారు శాంతించి వెనుదిరిగారు.

Updated Date - Jan 11 , 2024 | 03:12 AM