మేం ఉద్యోగం ఇస్తాం.. జీతం మీరు ఇవ్వండి!
ABN , Publish Date - Mar 01 , 2024 | 02:58 AM
ఏటా జాబ్ కేలండర్ అన్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు. పోలీసు ఉద్యోగాలు, మెగా డీఎస్సీ.. అబ్బో ఒకటేమిటి ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అన్నీ మర్చిపోయారు. నాలుగున్నరేళ్ల పాటు ఆ
ఆర్‌అండ్‌బీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌లో వింత
రాష్ట్ర వ్యాప్తంగా 467 పోస్టుల భర్తీకి జీవో జారీ
జీతాల చెల్లింపు బాధ్యత ఎస్‌ఈలదేనని లింకు
అతిథిగృహాల ఆదాయంతో చెల్లించాలని మెలిక
ప్రతినెలా ఏకంగా రూ.70 లక్షల వరకూ భారం
గెస్ట్‌హౌ్‌సలను ఉచితంగా వాడేస్తున్న వీఐపీలు
జిల్లా కేంద్రాల్లోనే 5 వేలకు మించని ఆదాయం
చాలాచోట్ల నయా పైసా కూడా రావడం లేదు
జీతాలు ఎలా చెల్లించాలని ఎస్‌ఈల ఆవేదన
అనంతపురం సిటీ: ఏటా జాబ్ కేలండర్ అన్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు. పోలీసు ఉద్యోగాలు, మెగా డీఎస్సీ.. అబ్బో ఒకటేమిటి ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అన్నీ మర్చిపోయారు. నాలుగున్నరేళ్ల పాటు ఆ ఊసెత్తకుండా ఎన్నికలు దగ్గర పడటంతో ఇప్పుడు అరకొర పోస్టులతో నోటిఫికేషన్లు ఇస్తూ హడావుడి చేస్తున్నారు. నిరుద్యోగులను మభ్య పెట్టేందుకు ఒక వింత జీవో జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు భవనాల శాఖ పరిధిలో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 467 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. జీతాలు మాత్రం ఆర్‌అండ్‌బీ శాఖ చెల్లిస్తుందని చెప్పకుండా లింకు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్‌అండ్‌బీ అతిథి గృహాల నుంచి వచ్చే ఆదాయం నుంచి కొత్త సిబ్బందికి జీతాలు చెల్లించాలని జీవోలో పేర్కొంది. ఈ బాధ్యతను ఆయా జిల్లాల ఎస్‌ఈలకు ప్రభుత్వం అప్పగించింది. ‘ఉద్యోగాల భర్తీ మా బాధ్యత.. జీతాల చెల్లింపు ఎస్‌ఈల బాధ్యత’ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. పోనీ.. కొత్తగా నియమించే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేంత ఆదాయం అతిథిగృహాల నుంచి వస్తుందా.. అంటే అదీ లేదు. వీటికి వచ్చే ఆదాయం చాలా చాలా తక్కువ. చాలాచోట్ల ఒక్కోదానికి నెలకు రూ.3వేలు కూడా రావడం లేదు. కొన్నింటికి అసలు ఆదాయమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జీతాలు ఎక్కడినుంచి చెల్లించాలని ఎస్‌ఈలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
33 వేల దరఖాస్తులు
రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో వాచ్‌మెన్-139, ఆఫీస్ సబార్డినేట్-170, శానిటరీ వర్కర్-158 పోస్టులు మొత్తం 467 ఉన్నాయని, వీటిని అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్టు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు ఆయా జిల్లాల్లోని ఆర్‌అండ్‌బీ ప్రధాన కార్యాలయాల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో జిల్లాల వారీగా ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 33వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. ఈ పోస్టులకు విద్యార్హత పదో తరగతి అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నా.. బీటెక్, ఎంటెక్, పీజీ, డిగ్రీ పూర్తి చేసినవారు కూడా దరఖాస్తు చేశారు.
ఆదాయం అంతంతే
రాష్ట్రవ్యాప్తంగా 139 ఆర్‌అండ్‌బీ అతిథి గృహాలు ఉన్నాయి. వీటి నుంచి ఎక్కడా పెద్దగా ఆదాయం లేదని ఎస్‌ఈలే చెబుతున్నారు. వీటిలో దిగే వీఐపీలు ఎవరూ అద్దె చెల్లించడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జేసీలు వంటివారు వస్తే.. అద్దె అడిగే సాహసం సిబ్బంది చేయలేకపోతున్నారు. చాలామంది వీఐపీలు పైసా చెల్లించకుండా అతిథిగృహాలను వాడుకుని దర్జాగా వెళ్లిపోతున్నారు. వారిని డబ్బులు అడిగితే ‘అంతే సంగతులు’ అని ఉద్యోగులే అంటున్నారు. కొందరు మాత్రం తమ పరిస్థితిని అర్థం చేసుకుని నామమాత్రంగా నగదు చెల్లిస్తారని చెబుతున్నారు. 26 జిల్లాల్లోనూ ఇదే తంతు సాగుతోంది. జిల్లా కేంద్రాల్లో ఉన్న అతిథి గృహాలకు నెలకు రూ.2000 నుంచి రూ.5 వేల వరకు ఆదాయం వస్తోంది. కానీ నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న వాటికి రూ.2వేలు కూడా రావడం లేదు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. అతిథి గృహాల నుంచి వచ్చే ఆదాయం నుంచి కొత్త సిబ్బందికి జీతాలు చెల్లించాలని జీవోలో పేర్కొనడం ఏంటని కొందరు ఎస్‌ఈలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లు భవనాల శాఖ పరిధిలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన 467 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్తగా వచ్చే ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.15వేలు చొప్పున అతిథి గృహాల ఆదాయం నుంచి జీతంగా ఇవ్వాలని జీవోలో పేర్కొన్నారు. అంటే వీరికి జీతాలకు నెలకు రూ.70లక్షల వరకూ ఖర్చవుతుంది. అధికార లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 139 ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలు ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కోదాని నుంచి సగటున రూ.50వేలకు పైగా జీతం చెల్లించాల్సి ఉంటుంది. పైసా కూడా ఆదాయం లేని అతిథిగృహాలు ఈ మొత్తాన్ని ఎలా చెల్లిస్తాయో ప్రభుత్వమే చెప్పాలి.
ఆర్‌అండ్‌బీ అతిథి గృహాలు
రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఉన్నవి: 139
వీటి సగటు ఆదాయం నెలకు: రూ.2,000 లోపు
కొత్తగా జీతాలకు ఆయ్యే ఖర్చు: రూ.50వేలకు పైగా
పోస్టుల వివరాలు
ఆఫీస్ సబార్డినేట్: 170
వాచ్‌మెన్: 139
శానిటరీ వర్కర్: 158
మొత్తం పోస్టులు: 467
ఒక్కో పోస్టుకు వేతనం: రూ.15,000
ఇదెక్కడి జీవో?
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆర్‌అండ్‌బీలో పరిస్థితి దారుణంగా తయారైంది. చేసిన పనులకు బిల్లులు కావడం లేదు. శాఖాపరంగా పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పుడు ఉద్యోగాల భర్తీ పేరిట హడావుడి చేయడం, జీతాల చెల్లింపు బాధ్యతలను ఎస్‌ఈలపై మోపడం విమర్శలకు తావిస్తోంది. ‘ఇప్పటి వరకూ చాలా నోటిఫికేషన్‌లు చూశాం. కానీ ఇలాంటి నోటిఫికేషన్‌ను ఏ ప్రభుత్వమూ విడుదల చేయలేదు’ అని పలువురు ఎస్‌ఈలు వాపోతున్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులను మభ్యపెట్టేందుకే ప్రభుత్వం గిమ్మిక్కు జీవో జారీ చేసిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాల భర్తీతో పాటు జీతాల చెల్లింపు బాధ్యత కూడా తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.