Share News

నిర్మాణ రంగాన్ని ఆదుకుంటాం

ABN , Publish Date - Apr 03 , 2024 | 04:00 AM

మంగళగిరి, ఏప్రిల్‌ 2: ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెరుగైన ఇసుక విధానాన్ని అమలు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు.

నిర్మాణ రంగాన్ని ఆదుకుంటాం

అధికారంలోకి వచ్చాక మెరుగైన ఇసుక విధానం అమలు

అమరావతి పనులు కొనసాగిస్తాం.. మళ్లీ చంద్రన్న బీమా: లోకేశ్‌

మంగళగిరి, ఏప్రిల్‌ 2: ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెరుగైన ఇసుక విధానాన్ని అమలు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి పాతబస్టాండు సెంటరులో మంగళవారం ఆయన భవన నిర్మాణ కార్మికులు, అడ్డా కూలీలను కలసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం లోకేశ్‌ మాట్లాడుతూ అమరావతి పనులు కొనసాగించి నిర్మాణ రంగానికి గత వైభవం తీసుకువస్తామని, చంద్రన్న బీమాను పునరుద్ధరిస్తామని, సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేసి బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. ‘జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. అమరావతి పనులు నిలిపివేయడంతో ఉపాధి కోసం కార్మికులు పొట్ట చేతపట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. గత టీడీపీ ప్రభుత్వం చంద్రన్న బీమా పేరిట కార్మికులకు భరోసా కల్పించింది. ఆ పథకాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు రూ.2,500కోట్లు వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించి కార్మికులకు తీరని ద్రోహం చేసింది’ అని ఆరోపించారు. అమరావతి నిర్మాణం కొనసాగించి ఉంటే దాదాపు ఐదు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవని తెలిపారు. టీడీపీ పాలనలో ట్రాక్టరు ఇసుక రూ.1,500 ఉంటే.. జగన్‌ రెడ్డి పాలనలో రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పెరిగిందన్నారు. దీంతో నిర్మాణ రంగం కుదేలై కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఉపాధి దొరక్క వందలాది మంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారని చెప్పారు. గతంలో చంద్రన్న బీమా ద్వారా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతే రూ.5లక్షల సాయం, మట్టి ఖర్చులకు రూ.5వేల తక్షణ సాయం అందించి ఆదుకున్నామని గుర్తుచేశారు. సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు సాయం అందేదని చెప్పారు. కార్మికులు, పేదలను కష్టాల నుంచి గట్టెక్కించేందుకే చంద్రబాబు సూపర్‌-6 పథకాలు ప్రకటించారని లోకేశ్‌ తెలిపారు.

Updated Date - Apr 03 , 2024 | 04:00 AM