Share News

రాక్షస పాలన అంతానికే కలిశాం

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:08 AM

రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికే మూడు పార్టీలు కలిసి పోటీచేయాలని నిర్ణయానికి వచ్చాయని బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్‌ శ్రీపాద సత్యనారాయణ పేర్కొన్నారు.

రాక్షస పాలన అంతానికే కలిశాం

సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టి గెలవాలని చూస్తున్న వైసీపీ

టీడీపీ వర్క్‌షా్‌పలో బీజేపీ నేత శ్రీపాద సత్యనారాయణ

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికే మూడు పార్టీలు కలిసి పోటీచేయాలని నిర్ణయానికి వచ్చాయని బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్‌ శ్రీపాద సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ సమావేశ మందిరంలో టీడీపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అభ్యర్థుల కోసం నిర్వహించిన వర్క్‌షా్‌పలో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ‘సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టి గెలవాలని వైసీపీ చూస్తోంది. ఆ విషయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. అమరావతి, పోలవరం, రైల్వే జోన్‌, విశాఖ ఉక్కు విషయంలో బీజేపీ నుంచి మరి కొంత స్పష్టత రావాల్సి ఉంది. త్వరలో అది వస్తుందని ఆశిస్తున్నాం. కుల గణన సమాచారాన్ని వైసీపీ తన వద్ద పెట్టుకొని బయటకు చెప్పడం లేదు. దానిని ఖచ్చితంగా బహిర్గతం చేసేలా చర్యలు తీసుకోవాలి. రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఉన్న కేసులను పోలీస్‌ శాఖ బహిరంగంగా ఆన్‌లైన్‌లో పెట్టాలన్నది మా డిమాండ్‌. దీనిపై ఎన్నికల కమిషన్‌ను కోరాలని అనుకొంటున్నాం. మూడు పార్టీలు కింద నుంచి సమన్వయం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడ తగ్గాలో జనసేన పార్టీని చూసి నేర్చుకోవాలి. రాష్ట్ర హితం కోసం సీట్ల విషయంలో ఆ పార్టీ తగ్గి ఆదర్శంగా వ్యవహరించింది’ అని శ్రీపాద సత్యనారాయణ ప్రశంసించారు.

రాష్ట్రం కోసం కలిశామని ప్రతివారూ గుర్తించాలి: మనోహర్‌

రాజకీయ పదవులు, అధికారం కోసం కాకుండా రాష్ట్రం కోసం కలిశామని మూడు పార్టీల్లో ప్రతి నాయకుడు, కార్యకర్త గుర్తించాలని, పొత్తు విలువను కాపాడుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విజ్ఞప్తి చేశారు. ‘రూ.500 చెల్లించి క్రియాశీల సభ్యత్వం తీసుకొన్న వారు జనసేన పార్టీలో ఆరున్నర లక్షల మంది ఉన్నారు. అందరినీ కలుపుకొని ఎన్నికల వాతావరణం సృష్టించండి. ఎవరైనా దూరంగా ఉంటే మీ స్థాయిలో నాలుగైదు రోజులు ప్రయత్నించండి. అప్పటికీ కాకపోతే కేంద్ర కార్యాలయానికి చెప్పండి. సమయం వృఽథా చేయవద్దు. మూడు పార్టీల వారిపై వైసీపీ దాడులు జరుగుతూనే ఉంటాయి. కలిసికట్టుగా వాటిని ఎదుర్కోండి’ అని మనోహర్‌ సూచించారు.

కోడ్‌ వల్ల విశాఖలో డ్రగ్స్‌ దొరికాయి: అచ్చెన్న

ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం వల్ల విశాఖ పోర్టులో డ్రగ్స్‌ దొరికాయని, లేకపోతే దొరికేవి కావని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘వైసీపీ నేతలు విశాఖను డ్రగ్స్‌ కేంద్రం చేశారు. కోడ్‌ వల్ల రాష్ట్రంలో వారి చేతుల్లో ఉన్న పోలీసు అధికారులు వైసీపీ నేతలకు సాయం చేయలేకపోయారు. దీనిని కప్పిపుచ్చడానికి వైసీపీ నేతలు సిగ్గు లేకుండా మన మీద ఆరోపణలు చేస్తున్నారు. పొత్తులో కొందరికి సీట్లు రాలేదు. రాష్ట్రం బాగు కోరి విశాల దృక్ఫఽథంతో ఆ నేతలు సహకరించాలని మనవి’ అని అచ్చెన్న అన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 03:08 AM