Share News

అంతా మా ఇష్టం..!

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:10 AM

డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) అధికారులు వైద్యుల హక్కులను కాలరాస్తున్నారు.

అంతా మా ఇష్టం..!

నచ్చితేనే పదోన్నతులు తీసుకోండి

వైద్యులకు డీఎంఈ అధికారుల ఆదేశం

ప్రొఫెసర్లు చేరకముందే.. అసోసియేట్‌ పోస్టుల భర్తీ

పదోన్నతి పొందిన వారి నుంచి లిఖితపూర్వక హామీలు

అడ్డగోలుగా పదోన్నతులు కల్పిస్తున్న అధికారులు

అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) అధికారులు వైద్యుల హక్కులను కాలరాస్తున్నారు. తాము అనుకున్నదే జరగాలన్న పట్టుదలతో పదోన్నతుల విషయంలో నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అసోసియేట్‌ ప్రొఫెసర్లకు.. ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారమే జీవో జారీ చేశారు. ఈ జీవో వచ్చిన తర్వాత వారు ఆ పోస్టుల్లో జాయిన్‌ అయ్యేందుకు కనీసం వారం రోజులైనా సమయం ఇవ్వాలి. కానీ, వారికి ఆ సమయం ఇవ్వకపోగా.. ఖాళీ అయిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు సోమవారమే పదోన్నతి ఇచ్చేశారు. దీనికి సంబంధించిన కౌన్సెలింగ్‌ కూడా పూర్తిచేశారు. వాస్తవానికి ప్రొఫెసర్లుగా పదోన్నతి పొం దినవారు ఇంకా ఆ స్థానాల్లో చేరకముందే హడావుడిగా ఈ పని కానిచ్చేశారు. పైగా ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందిన వారికి డీఎంఈ ఆదేశాల మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్‌ ఫోన్లు చేసి.. ఎప్పుడు చేరుతున్నారు..? అసలు చేరతారా లేదా..? అని అడుగుతున్నారు. చేరతాం అని చెప్పిన వారి నుంచి లిఖిత పూర్వక హామీ తీసుకుంటున్నారు.

కొంత మంది చేరుతామని, కొంత మంది చేరబోమని లిఖితపూర్వక హామీలిచ్చారు. అలా హామీలు తీసుకున్న తర్వాత ఆ పోస్టులను సోమవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో చూపించారు. వాస్తవానికి పదోన్నతి అనేది ఉద్యోగి హక్కు. నిబంధనల ప్రకారం పదోన్నతి పొందిన వారికి ఆయా పోస్టుల్లో చేరేందుకు కనీస సమయం ఇవ్వాలి. అలాకాకుండా డీఎంఈ లేదా ప్రిన్సిపాల్స్‌ ఫోన్లు చేసి మీరు చేరుతారా..? లేదా..? లిఖిత పూర్వక హామీ ఇవ్వండని ఒత్తిడి చేయడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఆరోగ్య శాఖలో, డీఎంఈలో ఈ నిబంధనలేమీ వర్తించడం లేదు. మరోవైపు కొత్త స్థానాల్లో చేరతామని లిఖితపూర్వక హామీ ఇచ్చిన తర్వాత, ఆ వైద్యులకు ఏదైనా సమస్య వచ్చి చేరలేకపోతే ఎలా...? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సమస్యలేవీ డీఎంఈ అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో పదోన్నతులిచ్చిన సమయంలోనూ సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో కొంత మంది వైద్యులు డీ ఎంఈని కలిసి కొత్త స్థానాల్లో చేరేందుకు సమయమివ్వాలని కోరారు. కానీ ఇప్పుడు డీఎంఈ అధికారులు అవేమీ పట్టించుకోకుండా వారికి నచ్చినట్లు చేసుకుం టూ పోతున్నారు. వైద్యుల ఇబ్బందులను మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. కేవలం ఖాళీల భర్తీపైనే దృష్టి పెట్టారు.

Updated Date - Feb 06 , 2024 | 04:10 AM