న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నాం
ABN , Publish Date - May 12 , 2024 | 04:02 AM
వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్షపడాలని ఐదేళ్లు న్యాయపోరాటం చేస్తున్నామని వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత తెలిపారు.

మీ ఆడబిడ్డలం... కొంగుచాచి అడుగుతున్నాం
షర్మిలను ఎంపీగా గెలిపించండి: సునీత వినతి
కడప(కలెక్టరేట్), మే 11: వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్షపడాలని ఐదేళ్లు న్యాయపోరాటం చేస్తున్నామని వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత తెలిపారు. కడప నగర శివారులోని జయరాజ్ గార్డెన్‌లో శనివారం ఆమె పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ‘ప్రజలకు న్యాయం చేయాల్సిన మఖ్యమంత్రే అవినాశ్‌ను, నిందితులను వెనకేసుకొచ్చారు. అవినాశ్‌రెడ్డి చిన్నపిల్లాడని జగన్ పదేపదే అనడం, నిందితుడి భవిష్యత్తు గురించి ఆలోచించడం విడ్డూరంగా ఉంది. సీఎంగా న్యాయం ధర్మం, శాంతి భద్రతలు కాపాడాల్సింది పోయి నిందితుడిని వెనకేసుకు రావడం ఒక ఎత్తయితే.. వివేకా హత్య కేసులో ఏ-5 దేవిరెడ్డి శంకరరెడ్డిని అవినాశ్ రెడ్డి సమర్థించడం చూస్తుంటే వారంతా ఒక కూటమిగా ఏర్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. న్యాయం గెలవాలని ఇంట్లోవాళ్లను ఎదిరించి పోరాడుతున్నాం. వైఎస్ బిడ్డ షర్మిల కడప ఎంపీగా బరిలో ఉన్నారు. షర్మిలను గెలిపించి కడప జిల్లా ప్రజలు న్యాయం వైపు నిలిచారని చరిత్రలో చెప్పుకొనేలా తీర్పునిస్తారని మీ నలుగురు ఆడబిడ్డలం కొంగుచాచి అడుగుతున్నా’ అని ప్రజలను ఆమె వేడుకున్నారు. షర్మిల, తాను చేస్తున్న న్యాయ పోరాటాన్ని ఓటు ద్వారా గెలిపిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తక్కువ సమయంలో ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందని, వివేకా, వైఎస్ అబిమానులు, శ్రేయోభిలాషులు చాలామందిని కలిశానని వివరించారు. సమయం లేనందున ఇంటింటికీ వెళ్లి కలవలేకపోయానన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఈ ప్రభుత్వంలో పులివెందులలోనే కాదు... రాష్ట్రమంతా ప్రజల్లో భయం ఉందని ఎన్నికల ప్రచారంలో చూశానన్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్ది ప్రజల భయం తగ్గిందని చెప్పారు. 13న ఓటింగ్ జరుగుతుందని, పోలింగ్ బూత్‌లో మీకు ఎవరూ అడ్డురారని, మీ మనస్సాక్షితో న్యాయం గెలిచేలా ఓటు వేయాలని కోరారు. షర్మిల గెలిపించాలని మీ ఆడబ్డిలమైన వైఎస్ విజయమ్మ, సౌభాగ్యమ్మ, షర్మిల, తాను జిల్లా ప్రజలను కొంగుచాచి అడుగుతున్నామన్నారు. షర్మిలకు విజయమ్మ మద్దతు సంపూర్ణంగా ఉందని చెప్పారు.