Share News

నిబద్ధతతో పని చేస్తారని విశ్వసిస్తున్నాం

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:17 AM

రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల జాబితాను సిద్ధం చేసే క్రమంలో సరైన స్ఫూర్తి, నిబద్ధతతో వ్యవహిస్తారని విశ్వసిస్తున్నట్టు హైకోర్టు వ్యాఖ్యానించింది.

నిబద్ధతతో పని చేస్తారని విశ్వసిస్తున్నాం

రాష్ట్ర ఎన్నికల అధికారులను ఉద్దేశించి హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్య

ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లేందుకు పిటిషనర్లకు వెసులుబాటు

అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల జాబితాను సిద్ధం చేసే క్రమంలో సరైన స్ఫూర్తి, నిబద్ధతతో వ్యవహిస్తారని విశ్వసిస్తున్నట్టు హైకోర్టు వ్యాఖ్యానించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు చట్ట నిబంధనలకు లోబడి ఓటర్ల జాబితా సిద్ధం చేయడమే కీలకమని లక్ష్మీచరణ్‌ సేన్‌ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. నిబంధనలకు లోబడి ఓటర్ల జాబితా సిద్ధం చేయకుంటే వాటికి పవిత్రత ఉండదని, తదనతరం నిర్వహించే ఎన్నికలు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించవని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ప్రస్తావించింది. పర్చూరు నియోజకవర్గంలో పరిధిలో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. జనవరి 5న తాము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకముందే పిటిషనర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల అధికారులు వెకేట్‌ స్టే పిటిషన్‌తో జత చేసిన వివరాలను పరిశీలిస్తే అర్ధమవుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. జాబితా నుంచి ఓట్లను తొలగిస్తూ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ చట్టబద్ధంగా అప్పీల్‌ వేసుకునేందుకు పిటిషనర్లకు వెసులుబాటు ఇచ్చింది. అప్పీల్‌ దాఖలు చేసిన మూడు వారాల్లో దానిని పరిష్కరించాలని, అప్పిలేట్‌ అథారిటీకి స్పష్టం చేస్తూ వ్యాజ్యాలను పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. జయసూర్య ఇటీవల తీర్పు ఇచ్చారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సంబంధిత ఓటర్ల నుంచి వివరణ తీసుకోకుండా ఫారం-7 ఆధారంగా ఇష్టారీతిన తమ పేర్లను తొలగిస్తున్నారంటూ కొందరు పిటిషన్లు వేశారు. వీరిలో బాపట్ల జిల్లా, పర్చూరు నియోజకవర్గంలోని తిమ్మరాజుపాలెం ప్రాంతానికి చెందిన బి. గౌతమి మరో 10 మంది ఉన్నారు. అలాగే నియోజకవర్గం పరిధిలోని అన్నంభొట్లవారి పాలెం, తిమ్మరాజుపాలెం, దేవరపల్లి, బోడవాడ, అడుసుమల్లి, నాగులపాలెం గ్రామాలకు చెందిన మరికొందరు ఓట్ల తొలగింపుపై పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 22 ప్రకారం ఈఆర్‌వో జారీ చేసిన ఉత్తర్వులు, పిటిషనర్లకు రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపిన సమాచారంపై తేదీలు పేర్కొనక పోవడాన్ని ఆక్షేపించింది. తుది ఓటర్ల జాబితా నుంచి పిటిషనర్ల పేర్లను తొలగించవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు.

Updated Date - Feb 06 , 2024 | 04:17 AM