Share News

ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:06 AM

వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్న తమకు, తమ పిల్లలకు రేపు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం

రేపు మాకు, మా పిల్లలకు ఏమవుతుందో తెలియదు

సునీతకు, నాకు దేవుడే రక్షణ

బాబాయి హత్య కేసులో అవినాశ్‌రెడ్డి నిందితుడు

సీబీఐ చెప్పిన విషయాన్నే మేమూ చెబుతున్నాం

సీఎం జగన్‌ అడ్డుపడకుండా ఉండి ఉంటే

ఈ కేసులో నిందితులకు ఇప్పటికే శిక్ష పడేది

మేం రోడ్డుపైకి వచ్చే అవసరమే ఉండేది కాదు

న్యాయం కోసం కొంగుపట్టి అడుగుతున్నాం: షర్మిల

ఆస్తిలో వాటా పొందే హక్కు ఆడబిడ్డకు ఉందని వెల్లడి

అవినాశ్‌ నేరచరిత్రపై జగన్‌ వివరణ ఇవ్వాలి

వివేకా హత్య కేసు నిందితులకు ఓట్లు వేయొద్దు

న్యాయం జరగాలంటే పోరాడే శక్తి కావాలి: సునీత

కర్నూలు/ నందికొట్కూరు, నంద్యాల, ఏప్రిల్‌ 21: వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్న తమకు, తమ పిల్లలకు రేపు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా కూడా ప్రాణాలకు తెగించి మొండిగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు, సునీతకు దేవుడే రక్షణ అన్నారు. ఆదివారం కర్నూలు నగరంలో నిర్వహించిన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్నూలులో అవినాశ్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు ఎంత డ్రామా జరిగిందో అందరికీ తెలుసని, ఆ సమయంలో సీఎం జగన్‌ అడ్డుపడకుండా ఉండి ఉంటే వివేకా హత్య కేసులో నిందితులకు నేడు శిక్షపడి ఉండేదని చెప్పారు. అప్పుడు తాను, సునీత రోడ్డుపైకి రావాల్సిన అవసరమే ఉండేది కాదన్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చింది వాస్తవం కాదా? సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొన్న విషయాలే మాట్లాడుతున్నాం. సీబీఐ వెల్లడించాకే హత్య ఎవరు చేశారన్నది తెలిసింది. ప్రజాకోర్టులో న్యాయం జరుగుతుందని సునీత, నేను కొంగు పట్టుకుని ప్రజలను అభ్యర్థిస్తున్నాం. వివేకానందరెడ్డి ప్రజాసేవలో బతికిన వ్యక్తి. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన పర్సనల్‌ లైఫ్‌ గుర్తుకు రాలేదా?’ అని వైసీపీ నాయకులను ఆమె నిలదీశారు. ‘వివేకానందరెడ్డి సుదీర్ఘకాలం రాజకీయ నాయకుడిగా కొనసాగారు. ఆయన సేవలను జగన్‌ అన్ని విధాలుగా వాడుకున్నారు. చనిపోయిన వ్యక్తి, సంజాయిషీ ఇవ్వలేని వ్యక్తిగత జీవితంపై దుర్మార్గంగా మాట్లాడటం తగదు. వైసీపీ గూండాలు, మూకలకు మళ్లీ చెబుతున్నా.. వివేకా పర్సనల్‌ లైఫ్‌ని టార్గెట్‌ చేసి మాట్లాడటం మానుకోవాలి’ అని షర్మిల హెచ్చరించారు.

చెల్లికి వాటా ఇవ్వాల్సిందే

ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అప్పులపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్తిలో వాటా పొందే హక్కు ఆడబిడ్డకు ఉంటుందన్నారు. న్యాయపరంగా ఇవ్వాల్సింది పోయి.. ఏదో కొసరు ఇచ్చి దాన్ని కూడా అప్పుగా చూపించే వాళ్లను ఏమనాలి? అని ఆమె సీఎం జగన్‌పై అసహనం వ్యక్తం చేశారు. ‘జగన్‌ నాకు అప్పు ఇచ్చారని అఫిడవిట్‌లో చూపించాను. అదే విషయంపై ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా. సమాజంలో ఏ అన్న అయినా తన చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే. అది ఆడబిడ్డకు ఉన్న హక్కు... తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేది మేనమామ కాబట్టి ఆయనకు కూడా బాధ్యత ఉంది. అయితే కొందరు మాత్రం ఆస్తిలో చెల్లెళ్లకు ఇవ్వాల్సిన వాటాను తమ వాటాగా భావిస్తారు. తామేదో చెల్లికి గిఫ్ట్‌గా ఇస్తున్నామని బిల్డప్‌ ఇచ్చేవాళ్లు కూడా సమాజంలో ఉన్నారు. మరికొందరు చెల్లెలు వాటా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా... దాంట్లో ఒక్క కొసరు ఇచ్చి... అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపిస్తున్నారు. అలాంటివాళ్లను ఇంకేమనాలి?... ఇది వాస్తవం. ఇది దేవుడికి తెలుసు. మా కుటుంబం మొత్తానికి తెలుసు’ అని షర్మిల పేర్కొన్నారు.

ఐదేళ్ల పాటు గాడిదలు కాశారా?

ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం జగన్‌ కుంభకర్ణుడిలా వ్యవహరించాడని.. అభివృద్ధిని గాలికొదిలేసి ఐదేళ్లపాటు గాడిదలు కాశారా? అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏపీ న్యాయ్‌ యాత్ర’లో భాగంగా ఆమె కర్నూలు, నందికొట్కూరులో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. ధరల స్థిరీకరణ నిధి కోసం ఏటా రూ.3వేల కోట్లు కేటాయిస్తామన్న జగన్‌రెడ్డి ఈ ఐదేళ్లలో ఒక్క ఏడాదైనా అమలు చేశాడా? అని ప్రశ్నించారు. ప్రతి జనవరికి జాబ్‌ కేలెండర్‌ ఎక్కడిచ్చారని నిలదీశారు. అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే టీచర్ల పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి ఐదేళ్లు ఏంచేశాడని ప్రశ్నించారు. మూడు రాజధానులు అన్నారు.. ఒక్క రాజధాని అయినా వచ్చిందా? ఉన్న కేపిటల్‌ కూడా లేకుండా చేశాడని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 22 , 2024 | 04:06 AM