Share News

DGP Dwaraka Tirumala Rao : ఐదేళ్లలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నాం

ABN , Publish Date - Nov 06 , 2024 | 05:13 AM

గడచిన ఐదేళ్లలో పోలీసు వ్యవస్థలో కొన్ని తప్పులు జరిగాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు.

DGP Dwaraka Tirumala Rao : ఐదేళ్లలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నాం

పోలీసులు ఇష్టం వచ్చినట్లు పనిచేశారు: డీజీపీ

ఎంపీని పట్టుకుపోయి కొట్టడమే ఉదాహరణ

ఒక పార్టీ కార్యాలయంపై దాడి జరిగితే

భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని రాసుకున్నారు

ఆ ఘటనలో ఒక్కరినీ అరెస్టు చేయలేదు

నిందితులను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చు

కేరళలో ఓ ఐపీఎస్‌కు 20 ఏళ్ల తర్వాతా శిక్ష

అనంతపురం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): గడచిన ఐదేళ్లలో పోలీసు వ్యవస్థలో కొన్ని తప్పులు జరిగాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. అప్పట్లో జరిగిన తప్పులు సరిదిద్దడంపై ప్రధానంగా దృష్టి పెట్టామని అన్నారు. ఆరోపణలు, అభియోగాలు ఎవరిపైన వచ్చినా విచారణ చేయాలని, కానీ గత ప్రభుత్వ హయాంలో పోలీసులు సరిగా విధులు నిర్వర్తించలేదని.. ఇష్టం వచ్చినట్లు పనిచేశారని ఆక్షేపించారు. ఒక ఎంపీని పట్టుకుపోయి కొట్టడమే ఇందుకు ఉదాహరణంటూ పరోక్షంగా అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజు ఉదంతాన్ని ప్రస్తావించారు. మంగళవారమిక్కడ పోలీసు శిక్షణ కళాశాలలో నిర్వహించిన డీఎస్పీల పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌లోను, అనంతరం మీడియాతోను ఆయన మాట్లాడారు. ఒక పార్టీ (టీడీపీ) కార్యాలయంపై దాడి జరిగితే.. భావప్రకటన స్వేచ్ఛలో భాగంగానే దాడి జరిగిందని అప్పట్లో పోలీసులు రాసుకున్నారని తెలిపారు. ఆ సంఘటనలో ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదన్నారు. ఏదైనా దాడి, సంఘటన జరిగితే చట్టానికి లోబడి ఎప్పుడైనా నిందితులను అరెస్టు చేయవచ్చని చెప్పారు. కేరళలో జరిగిన ఓ సంఘటన కు సంబంధించి 20 ఏళ్ల తర్వాత ఓ ఐపీఎస్‌ అధికారికి శిక్ష పడిందని గుర్తు చేశారు. తప్పు చేస్తే 30 ఏళ్ల తర్వాతైనా అరెస్టు చేయవచ్చన్నారు. పోలీసులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని, ఆ జవాబుదారీతనాన్ని పోలీసు వ్యవస్థలో మరింతగా పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


h.jpg

శాంతిభద్రతలను కాపాడే విషయంలో తమ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటామ్నారు. మానవ హక్కులు, మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ‘దొంగలు, నేరస్థులను పట్టుకోవడానికి ఫింగర్‌ ప్రింట్‌ వ్యవస్థ ఒక ఆయుధంగా ఉండేది. ఆ వ్యవస్థను మూలన పడేయడమంటే నేరస్థులను పట్టుకోవద్దని చెప్పడమే కదా! ఇప్పుడు మేం ఆ వ్యవస్థను పునరుద్ధరించాం’ అని వెల్లడించారు. ఐపీఎస్‌ అధికారి సంజయ్‌పై వచ్చిన అభియోగాలపై విచారణ జరుగుతోందని, ఆ నివేదిక తనకు ఇంకా రావలసి ఉందని తెలిపారు. ప్రొటోకాల్‌ విషయంలో నిబంధనలను పాటించాలని ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ.. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ... పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచుతూ, శాంతిభద్రతలు కాపాడటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రెండూ విధి నిర్వహణలో కీలకమేనని, వాటిని పక్కాగా అమలు చేయాలని ప్రొబేషనరీ డీఎస్పీలకు డీజీపీ సూచించారు. మానవ హక్కులను కాపాడుతూ, రాజ్యాంగంలో పొందుపరిచిన నియమాలకు అనుగుణంగా పనిచేయడాన్ని ఏ ఒక్కరూ మరువకూడదన్నారు. పోలీసు సేవలు అవసరమైన వారిపట్ల మరింత సానుభూతితో ఉండాలని చెప్పారు. మారుతున్న నేరాలకు అనుగుణంగా అప్‌డేట్‌ కావాలని.. పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌లో చేసిన ప్రతిజ్ఞ మేరకు నిష్పక్షపాతంగా, నిర్భయంగా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలని పిలుపిచ్చారు. పదవీ విరమణ పొందే వరకూ ప్రతిజ్ఞలోని ఈ అంశాలను మరువకూడదన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 05:13 AM