Share News

జగన్‌ కోట బద్దలుకొడుతున్నాం

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:27 AM

‘‘వైసీపీ ఫ్యాన్‌ రెక్కలు విరిగిపోయాయి. అరటిపండు తొక్కలాంటి జగన్‌ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో పడేద్దాం. రాబోయేది కూటమి ప్రభుత్వమే’’

జగన్‌ కోట బద్దలుకొడుతున్నాం

అరాచక వైసీపీని చెత్తబుట్టలో పడేద్దాం

మన భూముల పాసు పుస్తకాలపై

ముఖ్యమంత్రి ఫొటోలు ఎందుకు?

దస్తావేజులు లేవు.. సర్వర్‌లో ఉంచుతారట

తమ ఆస్తిని ప్రజలు రుజువు చేసుకోవాలా?

మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే ఆస్తులు గల్లంతే

జగన్‌ పాలనలో డీఎస్సీ లేదు.. ఉపాధీ లేదు

కేంద్ర సహకారం ఉంటేనే అభివృద్ధి పరుగు

కాకినాడ, ఏలూరు సభల్లో పవన్‌ కల్యాణ్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

‘‘వైసీపీ ఫ్యాన్‌ రెక్కలు విరిగిపోయాయి. అరటిపండు తొక్కలాంటి జగన్‌ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో పడేద్దాం. రాబోయేది కూటమి ప్రభుత్వమే’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సోమవారం ఆయన 17 గ్రామాల మీదుగా రోడ్డుషో నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మతో కలిసి దారిపొడవునా ప్రజలు, రైతులు, కార్మికులను పలకరిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. మరికొద్ది రోజుల్లో జగన్‌ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నామన్నారు. వైసీపీ దుష్టపరిపాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. ఇంకా ఏమన్నారంటే.. మన భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలపై రాజముద్ర ఉండాలి. అంతేగానీ జగన్‌ ఫొటోలు ఎందుకు. పాస్‌పోర్టు సహా అన్ని ముఖ్యమైన పత్రాలపై కేంద్రం, మనదేశ అధికార ముద్ర ఉంటుంది. అంతేగానీ ప్రధాని మోదీ ఫొటో ఉండదు. అక్కడ లేనిది ఇక్కడ ఏంటి? ఇదేం తీరు? ఇకనుంచి దస్తావేజులు ఉండవట. జిరాక్స్‌ ప్రతులు ఇస్తారట. అసలు పత్రాలు సర్వర్‌లో ఉంటాయని చెబుతున్నారు. ఇది ఎంతవరకూ భద్రం. అదే జరిగితే అందరి ఆస్తులు పోతాయి. మన ఆస్తి మనది అని మనమే రుజువు చేసుకోవాలట. ఇదెక్కడి చట్టమో అర్థం కావడం లేదు. ఎవరో వచ్చి ఇది నా ఆస్తి అంటే ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. మన ఆడపడుచులు, పిల్లలకు ఆస్తులు ఎలా ఇవ్వగలుగుతాం. ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఆస్తులు, వనరులు అన్నింటినీ వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి లాంటి వారికి పంచిబెడుతున్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే మన ఆస్తులకు రక్షణ ఉండదు. కష్టపడ్డ ఆస్తులు, భూములకే దిక్కులేనప్పుడు పేదల పట్టా, అసైన్డ్‌ భూములకు రక్షణ ఎక్కడ ఉంటుంది.


రాష్ట్రం కోసమే పొత్తు

రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించి టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులపై దాడులు పెరిగిపోయాయి. అనేకమంది హత్యకు గురయ్యారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారు. నన్ను రాష్ట్ర సరిహద్దులో ఆపేశారు. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు లాంటి నాయకుడు అవసరం. బీజేపీతో కలిసి ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని గట్టిగా నమ్ముతున్నాను. చంద్రబాబు లాంటి విజన్‌ ఉన్న నాయకుడిని అన్యాయంగా, దుర్మార్గంగా 53 రోజులు జైలులో పెట్టిన ఘటన బాధ కలిగించింది.

వైసీపీకి పొలిటికల్‌ హాలిడే

‘‘వైసీపీకి పొలిటికల్‌ హాలిడే ప్రకటిద్దాం. జగన్‌ వక్రబుద్ధి పాలనలో ఒక్క డీఎస్సీ రాలేదు.. ఓ ఉపాధీ లేదు. ఓ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు. అలాంటి ప్రభుత్వానికి హాలిడే ఇద్దాం’’ అని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో ఆయన మాట్లాడారు. ‘‘2019లో రోడ్డు మీద తిరిగి నేనున్నాను అంటూ సీఎం అయిన జగన్‌ ప్రజలను దగా చేశాడు. జగన్‌ ప్రభుత్వ హయాంలో 62 వేల మంది పిల్లలు చనిపోతే ఒక్క సర్వే కూడా చేయలేదు. పసిపిల్లలకు ఇచ్చే చిక్కీలలో కక్కుర్తి పడి రూ.67 కోట్లు బొక్కేశాడు. పిల్లల నోటు పుస్తకాలపై జగన్‌ బొమ్మలెందుకు? ఈయనేమన్నా దేశ నాయకుడా? జాతి నేతల చిత్రాలుంటే పిల్లలకు స్ఫూర్తి. జగన్‌ బొమ్మలెందుకు?’’ అని నిలదీశారు. సొంత చెల్లికే ద్రోహం చేశారని విమర్శించారు. ‘‘ఐదేళ్లు జగన్‌ బెయిల్‌పై ఉండి రాష్ట్రాన్ని పాలించాడు. ఈయన బెయిల్‌ సీఎం. 39 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా మనకు అవసరం లేదు. సీపీఎస్‌ గురించి అసెంబ్లీలో అడుగెట్టిన తొలి సమావేశంలోనే చర్చిస్తా. నేను ఉద్యోగి కొడుకునే. పెన్షన్‌ విలువ నాకు తెలుసు. జగన్‌ ప్రభుత్వం డిజిటలైజేషన్‌ పేరుతో మన సమాచారాన్ని హైదరాబాదులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉంచింది. ఒక రైతుకు ఎన్ని చెరువులు, పొలాలు ఎక్కడెక్కడ ఎన్నాయో ఆ వివరాలన్నీ సేకరించి జనాన్ని మోసం చేస్తున్నాడు. మనదగ్గరున్న పొలం స్టాంప్‌ పేపర్లకు విలువ లేకుండా చేశాడు. మనకు సంబంధం లేకుండా ఓనర్‌షిప్‌ ట్రాన్స్‌ఫర్‌ అవుతోంది. మళ్లీ జగన్‌కు ఓటేస్తే మన ఆస్తుల పత్రాలన్నీ పెట్రోలు పోసుకొని తగలబెట్టుకోవాల్సి వస్తుంది. పులివెందుల గుండాల చేతిలోకి మన ఆస్తులు పోతాయి. జగన్‌ను మనం సాగనంపాలి. మరి కొద్దిరోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.

భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధి

కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని పవన్‌ కల్యాణ్‌ భరోసా ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడుతూ.. అవినీతి పరులను విడచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ ‘కేటాక్స్‌’ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవదాయ శాఖ మంత్రిగా శ్రీశైలం మల్లికార్జున స్వామి మహా కుంభాభిషేకాన్ని కొట్టు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.

Updated Date - Apr 30 , 2024 | 04:27 AM