Share News

అలల వంతెన చెల్లాచెదురు..!

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:28 AM

భారీ అంచనాలు, అంతకుమించిన ప్రచారంతో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అలల వంతెన ముక్కలు ముక్కలుగా విడిపోయి చెల్లాచెదురైంది. విశాఖ నగరంలోని రామకృష్ణా బీచ్‌లో ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ఇప్పటికే..

అలల వంతెన చెల్లాచెదురు..!

మరో మూడు ముక్కలైన ఫ్లోటింగ్‌ బ్రిడ్జి

విశాఖపట్నం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): భారీ అంచనాలు, అంతకుమించిన ప్రచారంతో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అలల వంతెన ముక్కలు ముక్కలుగా విడిపోయి చెల్లాచెదురైంది. విశాఖ నగరంలోని రామకృష్ణా బీచ్‌లో ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ఇప్పటికే.. 100 మీటర్ల పొడవైన ముక్కగా, టి జంక్షన్‌ వ్యూ పాయింట్‌ మరో ముక్కగా సముద్రంలో తేలియాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇది మరో మూడు ముక్కలైంది. అందులో రెండు ఒడ్డున ఇసుకలో, మరొకటి సముద్రంలో తేలియాడుతున్నాయి. టి జంక్షన్‌ వ్యూ పాయింట్‌తో కూడిన మరో ముక్క కూడా సముద్రంలో విడిగా దూరంగా ఉంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) ఇప్పటివరకు చేపట్టిన ప్రాజెక్టుల్లో అత్యంత వివాదాస్పదమైంది ఇదే కావడం గమనార్హం. దీనికి ఎవరి నుంచీ అనుమతులు తీసుకోలేదు. తీరం లోతు, అలల తీవ్రత వంటి వాటిపై అధ్యయనం చేయకుండానే దీని నిర్మాణం పూర్తిచేశారు. తీరా ప్రాజెక్టును ప్రారంభించాక అది రెండు ముక్కలవడంతో మాక్‌ డ్రిల్స్‌ అంటూ డ్రామాలాడుతున్నారు. సముద్రంలో అలజడి తగ్గితే మళ్లీ అలలపై సయ్యాట మొదలుపెడతామని ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఎవరూ లేని సమయంలో ఆ ఫ్లోటింగ్‌ బ్రిడ్జిపై ఎవరైనా ఎక్కి సెల్ఫీ దిగాలని ప్రయత్నిస్తే సముద్రంలో పడిపోయే ప్రమాదం ఉంది. అలాంటిదేమైనా జరిగితే దానికి వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ బాధ్యత వహిస్తారా...?, ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు పెట్టారని కాంట్రాక్టర్‌పై నెపం నెడతారా..? అని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. గత రెండు వారాల్లో ఒక్కరోజు కూడా స్థిరంగా లేని ఆ ఫ్లోటింగ్‌ బ్రిడ్జిని పట్టుకొని వేలాడుతున్న వీఎంఆర్‌డీఏ అధికారుల తీరును ప్రభుత్వ పెద్దలు కూడా ప్రశ్నించకపోవడం గమనార్హం.

Updated Date - Mar 09 , 2024 | 02:28 AM