Share News

గుంటూరులో వార్‌ వన్‌సైడే

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:43 AM

డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌.... తెలుగుదేశం పార్టీ గుంటూరు లోక్‌సభ అభ్యర్థి.

గుంటూరులో వార్‌ వన్‌సైడే

లక్షన్నరకు పైగా మెజారిటీతో గెలుస్తా

మాకు 135-140 సీట్లు గ్యారంటీ

జన్మభూమి రుణం తీర్చుకొనేందుకే రాజకీయాల్లోకి

నాకు ఇక్కడేమీ లేవు.. నన్ను ఏమీ చేయలేరు

30 ఏళ్ల పాటు రాజకీయం చేయడానికే వచ్చా

నా కథ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి

నన్ను కొడితే ఐదేళ్లకైనా వాడి చేయి తీసేస్తా

ఎన్నికల తరువాత జగన్‌రెడ్డికి షాక్‌ ట్రీట్‌మెంట్‌

గుంటూరు, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌.... తెలుగుదేశం పార్టీ గుంటూరు లోక్‌సభ అభ్యర్థి. అమెరికాలో వైద్యుడిగా, ఆంత్ర ప్రెన్యూర్‌గా స్థిరపడిన ఆయన ఏపీ రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు. 2014, 2019లో సీటు కోసం ప్రయత్నించి విఫలమైనా ఈసారి పట్టుబట్టి గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ టికెట్‌ సాధించారు. అంతకుముందే ఆయన పెమ్మసాని ట్రస్టు ద్వారా జిల్లాలో సేవా కార్యక్రమాలు నిర్వహించి మన్ననలు పొందారు. ప్రస్తుతం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ దూసుకుపోతున్నారు. అమెరికా నుంచి టూరిస్టు వీసాతో వచ్చారని ఎగతాళి చేసిన ప్రత్యర్థులకు దీటుగా సమాధానం ఇస్తూ 30ఏళ్ల పాటు రాజకీయం చేయడానికే రాష్ట్రానికి వచ్చానని స్పష్టం చేస్తున్నారు. నానాటికీ తీసికట్టుగా మారుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ ఎలా నెగ్గుకొస్తారో, నెగ్గితే ప్రజలకు ఏమి చేస్తారో ‘ఏబీఎన్‌’ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్‌ డిబేట్‌లో పెమ్మసాని చంద్రశేఖర్‌ మనస్సు విప్పి మాట్లాడారు.

ఆర్‌కే: ప్రస్తుత రాజకీయాల్లో అడుగులు వేస్తున్న కొద్దీ చిరాకేస్తోందా? మజా వస్తోందా? బురదలోకి దిగాను అనుకొంటున్నారా?

పెమ్మసాని: నాకు ముందుగానే ఇవన్నీ తెలుసు బురద అనుకోవడం లేదు. ఇష్టపడి వచ్చా కాబట్టి ఆస్వాదిస్తున్నాను.

రాజకీయాలు అంటే ఎందుకు ఇష్టం?

వ్యక్తిగతంగా ఈ రాష్ట్ర ప్రజలు రూ.15వేలు పన్ను కట్టి నన్ను మెడిసిన్‌ చదివించారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌లో ఫ్రీ సీటు పొంది చదువుకొన్నాను. జన్మభూమికి రుణం తీర్చుకోవడం అనేది ప్రాథమిక కారణం. దీనికి తోడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత బలంగా నిర్ణయించుకొన్నాను. జయదేవ్‌ని పంపించడం, అరాచకం సృష్టించడం. టీడీపీ, కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొన్నా. నాకు ఇక్కడ ఏమీ లేవు. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఆ ఽధైర్యం ఉంది. చేసే తెగువ, చేయాలన్న ఆశయం ఉన్నాయి. వీటన్నింటి దృష్ట్యా నేను సరైన వ్యక్తినని నిర్ణయించుకొని వచ్చాను.


గల్లా జయదేవ్‌ అంత దృఢమైన వ్యక్తి తట్టుకో

లేక రాజకీయం వదిలేశాడు. మళ్లీ జగన్‌ వస్తే

ఏ కేసులో అయినా పెట్టొచ్చుగా?

ఏ కేసులో పెడతారు? ఎన్ని రోజులు జైలులో పెడతారు. ఆరు నెలలు, ఏడాది.. నన్ను జైలులో పెట్టారనుకోండి. జైలులో చదువుకోవడానికి, రాసుకోవడానికి పుస్తకం, పెన్ను, పేపర్‌ ఇస్తారు. నేను చిన్నప్పటి నుంచి ఏసీల్లో పెరగలేదు. నేను తినే తిండి కూడా తక్కువ. ఇంతకంటే ఏమి ఇబ్బంది పెడతారు. నాకు జ్ఞానం ఉంది. అది ఉన్నంత వరకు ఏమీ చేయలేరు.

రఘురామకృష్ణరాజు వలె మిమ్మల్ని కూడా కొట్టొచ్చు కదా?

కొట్టడమంటే మైండ్‌కు సంబంధించినది. అది చట్ట వ్యతిరేకం. పొరపాటున ఎవరైనా చేస్తే ఏదో ఒకరోజు నాకూ సమయం వస్తుంది. కొట్టినోడి చేయి తీసేస్తా. వెనక్కు తగ్గను. నాకు ఐదేళ్లకో, పదేళ్లకో సమయం వస్తుంది. ఆ రోజు అంతకు అంత బదులు తీర్చుకొంటా. రఘురామరాజు ఇంకా బతికే ఉన్నారు. కొట్టిన వాళ్లు ఇంకా ఉన్నారు. జగన్‌కు చాలా జీవితం ఉంది. ఇప్పుడైంది ఐదేళ్లే కదా. ప్రతీ ఒక్కరికి వాళ్ల గ్రహాలు వస్తాయి. కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. మంచి ఇస్తే మంచి జరుగుతుంది. చెడు చేస్తే అదే జరుగుతుంది. థర్డ్‌ డిగ్రీ అనేది ఎవరి పైనా చేయకూడదు.

మీలో ఎందుకు వచ్చింది ఇదంతా?

మాది దిగువ మధ్యతరగతి కుటుంబ. మొదట్లో వ్యవసాయం.. ఆ తర్వాత చిన్న హోటల్‌. రాజకీయ నేపథ్యం చూస్తూ పెరిగాం. అది గ్రాటిట్యూడ్‌. నన్ను ఇక్కడి ప్రజలు ఫ్రీగా చదివించారు. అమెరికాలో అయితే రూ.3కోట్లు అవుతాయి. ఎంత సంపాదించినా ఎవరైనా పైకి వెళ్లాల్సిందే. అదేదో మనకు ఉపయోగపడిన వాళ్ల మధ్యన వెళ్లిపోదామన్నదే నా ఆలోచన.

ఏపీలో ధనిక సీఎం ఇప్పటికే ఉన్నారు.

ఇప్పుడు మీరు దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు?

నేను ఈ స్థాయికి రావడానికి ఇంటర్మీడియట్‌ రోజుకు 15, 16 గంటలు చదివి ఎంసెట్‌లో 24వ ర్యాంకు తెచ్చుకొన్నాను. ఐదేళ్లు మెడిసిన్‌ చేసి, యూఎ్‌సలో కష్టపడి పరీక్షలు రాసి మూడేళ్లు పీజీ చేసి 2001లో బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను. మొత్తం 30 ఏళ్లు కష్టపడి 40శాతం పన్ను చెల్లించాను. జగన్‌ అలా కాదు. 2004లో ఆయన ఆస్తి రూ. కోటి. మొత్తం క్విడ్‌ ప్రో కో ద్వారా ఆస్తులు కూడబెట్టుకొన్నారు. నాతోనే కాదు, ఎవరైనా కష్టపడి పైకొచ్చే వారితో జగన్‌ని పోల్చడం అత్యంత అవమానకరం.

లోక్‌సభ సీటే పట్టుబట్టి కావాలని ఎందుకు

కోరుకొన్నారు? రాజ్యసభ సీటు అయితే

చొక్కా నలగకుండా ఆరేళ్లు ఉండొచ్చు.

నా స్టోరీ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నేను ఏమి చేయబోతున్నాననేది నాకు ఒక్కడికే తెలుసు. వేరేవాళ్లు ఎన్ని చెప్పినా ఈ సమాజానికి ఏమి చేయగలనన్న విజన్‌ ఉంది. అది ఇప్పుడే బయటకు చెప్పలేను.


అమరావతి అభివృద్ధి చెందుతుందంటే వాళ్లకే మంచిది కదా? అక్కడ ఎందుకు ఓడించారు?

జగన్‌ ఇచ్చిన హామీలు చూసి ఆశపడ్డారు. మోసపోయారు. అందువల్ల ప్రజలు ఓట్లేశారు. ఇప్పుడు కాదు పొమ్మన్నారు. ప్రజలు బుద్ధి చెబుతారు. వైసీపీ వాళ్లు బయట కూడా తిరగలేని పరిస్థితి ఉంది. మంగళగిరిలో 40, 50 వేల మెజారిటీ, తాడికొండలో 30, 40 వేల మెజారిటీ వస్తుంది.

సర్వేలు చేసుకుంటున్నారా?

సర్వేలు నిరంతరం జరుగుతున్నాయి. జగన్‌కు భయపడి ప్రజలు పూర్తిగా చెప్పడం లేదు. అది కూడా కలుపుకుంటే మరో 2శాతం అదనంగా వస్తుంది. ఎన్నికల తరువాత జగన్‌రెడ్డికి షాక్‌ ట్రీట్‌మెంట్‌ వస్తుంది. మాకు 135- 140 సీట్లు గ్యారంటీగా వస్తాయి.

ప్రభుత్వంలో మీ పాత్ర ఉంటుందా?

చంద్రబాబు అడిగితే కచ్చితంగా చెబుతాను. చంద్రబాబు, లోకేశ్‌ రాష్ట్ర బాధ్యతలు చూసుకుంటారు. వారు కోరితే నేను తోడ్పడతాను.

ఎవరినైనా భయపెట్టే వాతావరణం ఉన్న ఏపీలో ఎందుకీ రొచ్చు అని ఇంట్లో వాళ్లు, సన్నిహితులు అనలేదా?

అందరూ అన్నారు. కాకపోతే నా ఒక్క జీవితాన్ని త్యాగం చేసినందు వల్లలక్షల మందికి ఉపయోగపడితే అదే చాలు. నేను గుంటూరు పార్లమెంట్‌లో తిరుగుతున్నాను. ఎదుటివారు పోటీ చేయాలంటే భయపడే స్థితికి తీసుకొచ్చా. ధనబలంతో కాదు. నా క్యారెక్టర్‌, సమస్యలపై మాట్లాడే విధానం. కేడర్‌తో కలిసే విధానం. సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తానో చెప్పడంలో ఉన్న నిజాయితీ. ఇవన్నీ నాకు జత కలిశాయి.

చంద్రబాబును మీరు స్టడీ చేశారా? ఆయన గురించి మీకు తెలిసిందేంటి?

చంద్రబాబును నేను ఉస్మానియా యూనివర్శిటీలో ఉన్నన్నాళ్లు చూశా. బాబ్లీపై ఆయన పోరాటం, శ్రమదానం, రైతుబజార్లు, ఉస్మానియా సర్‌ప్రైజ్‌ విజిట్లు ఇవన్నీ దగ్గరుండి చూశా. ఆయనంటే ఒక అభిప్రాయం కలిగింది. నేడు తెలుగుజాతి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బెంజ్‌ కార్లలో తిరుగుతున్నారన్నా, ఇండియాలోనే రిచెస్ట్‌ పర్సన్‌గా అవుతున్నారన్నా ఆయనే కారణం. ఈ విషయంలో వివాదమే లేదు. ఆయనకుండే ఓర్పు, సహనం, కష్టపడే తత్వం నాకు స్ఫూర్తిదాయకం. ఆయనకు పర్సనల్‌ లైఫ్‌ లేదు. అది కొంత వరకూ బాధాకరం. ఆయన వ్యక్తిగత జీవితంపై మాట్లాడడం సరికాదనే భావిస్తున్నాను. 24గంటలు ప్రజల గురించే ఆలోచిస్తారు.

Updated Date - Apr 25 , 2024 | 04:43 AM