Share News

నకిలీ పట్టాలతో ఓటర్లకు గేలం!

ABN , Publish Date - Feb 25 , 2024 | 03:05 AM

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రెవెన్యూ అధికారులతో కలిసి అధికార పార్టీ వైసీపీ నకిలీ ఇంటి పట్టాల పంపిణీకి తెరదీసింది.

నకిలీ పట్టాలతో ఓటర్లకు గేలం!

అనపర్తిలో నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేస్తూ టీడీపీ శ్రేణులకు పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్‌

నిరసన తెలిపిన టీడీపీ నేత రామకృష్ణారెడ్డి

అనపర్తి, ఫిబ్రవరి 24: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రెవెన్యూ అధికారులతో కలిసి అధికార పార్టీ వైసీపీ నకిలీ ఇంటి పట్టాల పంపిణీకి తెరదీసింది. కేవలం ప్రపోజల్స్‌ పంపిన భూములకు చెందిన సర్వే నెంబర్లతో ఓటర్లకు గేలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఆయా భూములకు నకిలీ పట్టాల తయారీకి వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారు. అనపర్తిలో అనేక మంది లబ్ధిదారులు జగనన్న ఇళ్ల స్థలాల కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఏడాదిన్నర కిందట ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కొన్ని గ్రామాల్లో భూములను సేకరించింది. అయితే, ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా సొమ్ములు చెల్లించక పోవడంతో అవి కేవలం ప్రతిపాదనలుగానే మిగిలాయి. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంటి పట్టాల వ్యవహారం తమ కొంప ముంచుతుందని భావించిన వైసీపీ నాయకులు ప్రతిపాదనల్లో ఉన్న భూములకు సంబంధించిన సర్వే నెంబర్లనే వినియోగించి లబ్ధిదారుల పేరుతో నకిలీ పట్టాలు తయారు చేస్తున్నారు. ఇదంతా అనపర్తి తహసీల్దార్‌ కార్యాలయం వేదికగా జరగడం విశేషం. శనివారం డిప్యూటీ తహసీల్దార్‌ శశిధర్‌ తన కార్యాలయంలోనే పట్టాలు తయారుచేసే పనిలో ఉండగా అక్కడికి వెళ్లిన కొందరు టీడీపీ నాయకులు దీనిని గమనించారు. ఈ నకిలీల వ్యవహారాన్ని వెంటనే వారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సమాచారం అందించడంతో ఆయన అక్కడికి చేరుకుని డీటీ శశిధర్‌ను నిలదీశారు. అయితే, ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడం, కలెక్టర్‌ ఆదేశాల మేరకు తయారు చేస్తున్నామని అనడంతో రామకృష్ణారెడ్డి ఆగ్రహించారు. భూసేకరణ జరుగకుండా పట్టాలు ఎలాతయారు చేస్తారంటూ అక్కడే నకిలీపట్టాలతో నేలపై బైఠాయించి నిరసనవ్యక్తం చేశారు.

Updated Date - Feb 25 , 2024 | 03:05 AM