Share News

వలంటీర్లే ముంచేశారు

ABN , Publish Date - Jun 07 , 2024 | 02:15 AM

వలంటీర్లే మా సైన్యం అన్నారు. వలంటీర్ల వ్యవస్థ భేష్‌ అంటూ ప్రశంసలు కురిపించారు. చివరకు ఎన్నికల ప్రచారానికి సైతం వారిని అడ్డగోలుగా వాడేసుకున్నారు.

వలంటీర్లే ముంచేశారు

వారిపై ఆధారపడటం వల్లే ఘోర పరాజయం

పింఛన్లు పంచడానికి తప్పితే వారిలో చాలామంది పార్టీకి ఏ రకంగానూ ఉపయోగపడలేదు

వలంటీర్‌ వ్యవస్థతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి

ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల మండిపాటు

విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి)/చోడవరం, జూన్‌ 6: వలంటీర్లే మా సైన్యం అన్నారు. వలంటీర్ల వ్యవస్థ భేష్‌ అంటూ ప్రశంసలు కురిపించారు. చివరకు ఎన్నికల ప్రచారానికి సైతం వారిని అడ్డగోలుగా వాడేసుకున్నారు. తీరా ఫలితాలు తారుమారు కావడంతో వైసీపీ నేతలు ఇప్పుడు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లే తమను నిలువునా ముంచేశారని, వారివల్లే ఓటమి పాలయ్యామని ఆరోపిస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థ ఏదో బ్రహ్మాస్త్రం అన్నట్టుగా ఇచ్చిన కలరింగ్‌తోనే పార్టీకి తీరని నష్టం జరిగిందని వైసీపీ తాజా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వ్యాఖ్యానించారు. వలంటీర్లపై అతిగా ఆధారపడి 2019 ఎన్నికల్లో పార్టీ విజయానికి కారణమైన కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఘోరమైన ఓటమి చవిచూడాల్సి వచ్చిందని వాపోయారు. పింఛన్లు పంచడానికి తప్పితే వలంటీర్లలో చాలామంది పార్టీకి ఏ రకంగానూ ఉపయోగపడలేదని ఆరోపించారు. కాగా, వైసీపీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలే పునాదిగా నిలిచారని, వలంటీర్‌ వ్యవస్థ కారణంగా గుర్తింపు లేకపోవడంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయని మాజీ మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

ఐప్యాక్‌ టీమ్‌తోనే మునిగిపోయాం: కరణం ధర్మశ్రీ

కార్యకర్తలను పట్టించుకోకుండా ప్రైవేటు కంపెనీ మాదిరిగా ‘ఐప్యాక్‌’ టీమ్‌తో పార్టీని నడిపించడం వల్లే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని కరణం ధర్మశ్రీ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో పార్టీ కేడర్‌ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వివరిద్దామంటే సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వకుండా కోటరీ అడ్డుకుందని ధర్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్మి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయామని పేర్కొన్నారు. ఏం మాట్లాడితే ఏ విధంగా టార్గెట్‌ అయిపోతామోనన్న భయంతోనే పార్టీలో కొనసాగామని వివరించారు. తనకు గెలుపు, ఓటములు కొత్తకాదని, ఫలితం ఏదైనా ప్రజాక్షేత్రంలోనే కొనసాగుతానని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పారు.

జగన్‌ సంస్కరణలు ప్రజలకు నచ్చలేదేమో: అమర్‌నాథ్‌

సీఎం జగన్‌ అమలుచేసిన సంస్కరణలు ప్రజలకు నచ్చలేదేమోనని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలు, కులాలకు అతీతంగా, అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేశామని, కానీ ఊహించని విధంగా ఎన్నికలు ఫలితాలు రావడం ఆశ్చ ర్యం కలిగించిందని అన్నారు. ప్రజలు అడగకుండానే అన్నీ చేయడంతో పాటు 99శాతం హామీలు అమలుచేసినా తమకు మద్దతు ఇవ్వలేదంటే వారు ఇంకా ఏదో కోరుకుంటున్నారనే భావన కలుగుతోందని పేర్కొన్నారు. కేంద్రంలో ఎన్‌డీఏకి రాష్ట్ర ఎంపీల మద్దతు అవసరమైనందున, దీన్ని అవకాశంగా తీసుకుని స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ ఉపసంహరణ, రైల్వేజోన్‌, ప్రత్యేక హోదా వంటి డిమాండ్లను సాధించుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని, సమస్యల పరిష్కారం కోసం వారి తరపున పోరాటం సాగిస్తామన్నారు. ఎన్నికల హామీల అమలుకు ఏడాది సమయం ఇస్తామని, అప్పటికీ నెరవేర్చకపోతే ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని తెలిపారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ అని ఆరోపించడం పిచ్చితనమే అవుతుందని అమర్‌నాథ్‌ ఖండించారు.

Updated Date - Jun 07 , 2024 | 07:29 AM