Share News

ఎంపీపీ కుటుంబంపై వలంటీర్‌ దాడి

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:41 PM

సాక్షాత్తూ అధికార పార్టీ మండల పరిషత్‌ అధ్యక్షురాలి కుటుంబంపై ఓ వలంటీర్‌ దాడి చేసి చితకబాదిన సంఘటన శనివారం బి.కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన ఎంపీపీ కుటుంబ సభ్యులు ఆస్పత్రి పాలయ్యారు.

ఎంపీపీ కుటుంబంపై వలంటీర్‌ దాడి
దాడి సంఘటనపై విచారిస్తున్న సీఐ సూర్యనారాయణ

ఎంపీపీ సహా నలుగురికి గాయాలు

ఒకరు మదనపల్లెకు తరలింపు

వలంటీర్‌ సహా ఆరుగురిపై కేసు నమోదు

బి.కొత్తకోట, ఏప్రిల్‌ 6: సాక్షాత్తూ అధికార పార్టీ మండల పరిషత్‌ అధ్యక్షురాలి కుటుంబంపై ఓ వలంటీర్‌ దాడి చేసి చితకబాదిన సంఘటన శనివారం బి.కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన ఎంపీపీ కుటుంబ సభ్యులు ఆస్పత్రి పాలయ్యారు. శనివారం మండలంలో సంచలనం రేపిన ఈ సంఘటనకు సంబంధించి సీఐ సూర్యనారాయణ, ఎంపీపీ అక్ష్మీనరసమ్మ తెలిపిన వివరాలిలా... బి.కొత్తకోట ఎంపీపీ మేదరి లక్ష్మీనరసమ్మ కుటుంబంతో కలిసి మండలంలోని బుచ్చిరెడ్డిగారిపల్లెలోని ఎస్సీ కాలనీలో నివాసం వుంటున్నారు. ఈ కాలనీలో వున్న 13 సెంట్ల ప్రభుత్వ స్థలంలో గల చింతమాన్లను స్థానిక సర్పంచ్‌ చంద్ర ఇటీవల కోసివేశాడు. దీనిపై ఎంపీపీ లక్ష్మినరసమ్మ అభ్యంతరం చెబుతూ కాలనీ వాసులతో కలిసి తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. సదరు స్థలాన్ని అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు కేటాయించాలని కోరారు. ఇదిలా వుండగా.. ఆ చింత దుంగలను ఇటుకబట్టీ కోసం అంటూ స్థానిక వలంటీర్‌ నరేష్‌ తరలించుకున్నాడు. ఈ విషయం సైతం తహశీల్దార్‌ దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం వలంటీర్‌ నరేష్‌ తన కుటుంబీకులైన హరీష్‌, గణేష్‌ మరో ముగ్గురితో కలిసి ఎంపీపీ నివాసంపైకి దాడికి తెగబడ్డారు. ఇంట్లో వున్న ఎంపీపీ భర్త మేదరి నరసింహులును, మామ చిన్నాయప్పను కొట్టి గాయపరిచారు. అడ్డువచ్చిన ఎంపీపీ లక్ష్మీనరసమ్మ, తోడికోడళ్లు లక్ష్మీనరసమ్మ, రమణమ్మల పై కూడా దాడి చేశారు. వీరందరినీ బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో రమణమ్మను మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై ఎంపీపీ మాట్లాడుతూ గతంలో కూడా వలంటీర్‌ తమపై దౌర్జన్యం చేశాడని పేర్కొన్నారు. సీఐ సూర్యనారాయణ ఆసుపత్రి వద్దకు చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. నిందితులైన వలంటీర్‌ నరేష్‌తో పాటు, హరీష్‌, గణేష్‌ మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:41 PM