Share News

నిఘా చీఫ్‌గా విశ్వజీత్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:28 AM

రాష్ట్ర నిఘావిభాగం అధిపతిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కుమార్‌ విశ్వజీత్‌ నియమితులయ్యారు.

నిఘా చీఫ్‌గా విశ్వజీత్‌

బెజవాడ సీపీగా పీహెచ్‌డీ రామక్రిష్ణ

ఈసీ ఆదేశాలతో నియమించిన సీఎస్‌

గతంలోనూ ఎన్నికల సమయంలోనే

నిఘా బాధ్యతలు చూసిన విశ్వజీత్‌

రాజకీయ ఒత్తిళ్లకు లొంగని అధికారిగా

రామక్రిష్ణకు శాఖలో మంచి పేరు

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నిఘావిభాగం అధిపతిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కుమార్‌ విశ్వజీత్‌ నియమితులయ్యారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా పీహెచ్‌డీ రామక్రిష్ణను ఎన్నికల కమిషన్‌ ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. వైసీపీ అరాచక పాలనలో ఏకపక్ష పోలీసింగ్‌ చేస్తూ అధికార పార్టీ అడుగులకు మడుగులు వత్తుతూ ఐపీసీ చట్టాన్ని పక్కన బెట్టి వైసీపీ చట్టాన్ని అమలు చేస్తోన్న ఐపీఎస్‌ అధికారులపై వరుసగా ఈసీకి ఫిర్యాదులు అందుతున్నాయి. జగన్‌కు కళ్లు, చెవులు, ముక్కు అన్నీ తానై పనిచేసిన ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులుపై వరుస ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించిన ఈసీ ఆయన బదిలీపై నిర్ణయం తీసుకుంది. అంతకుమించి స్వామి భక్తి ప్రదర్శిస్తూ ప్రతిపక్ష నేతపై రాళ్లు పడితే అవి పువ్వులని, ఎదుటి పార్టీ నేతల కళ్లు పొడిచేస్తే అది వీధిలో గొడవంటూ తేలిగ్గా తీసుకున్న విజయవాడ సీపీ కాంతిరాణా ఏకంగా వైసీపీ అధికార ప్రతినిధిగా మారిపోయారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో అధికార పార్టీ నేతలు ప్రెస్‌మీట్‌ పెట్టి చేసే వ్యాఖ్యలన్నీ జోడించి ఐపీఎస్‌ అధికారుల సంఘం తరపున అన్నీ తానై ఎన్నికల కమిషన్‌కు ప్రతిపక్షాలు, పత్రికలపై ఫిర్యాదు చేశారు. అయితే నిజానిజాలు తెలుసుకున్న ఈసీ కాంతిరాణాను సాగనంపింది. ఈ ఇద్దరి పోస్టుల్లో సమర్థవంతులైన ముగ్గురు అధికారుల పేర్లు పంపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి 24గంటలు సమయం ఇచ్చింది. నిఘా అధిపతి పోస్టుకు రైల్వే ఏడీజీ కుమార విశ్వజీత్‌, ఏపీఎస్పీ ఏడీజీ అతుల్‌ సింగ్‌, సీఐడీ ఏడీజీ సంజయ్‌ పేర్లు ప్రభుత్వం పంపింది.

వాటిని పరిశీలించిన ఈసీ గతంలోనూ ఎన్నికల సమయంలో నిఘా అధిపతిగా వ్యవహరించిన కుమార విశ్వజీత్‌ను ఎంపిక చేసింది. బెజవాడ సీపీ పోస్టుకు రవాణా శాఖ కమిషనర్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా, ఏసీబీ డైరెక్టర్‌ పీహెచ్‌డీ రామక్రిష్ణ, టెక్నికల్‌ సర్వీసెస్‌ ఐజీ ఎస్‌.హరికృష్ణ పేర్లు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. రాష్ట్ర పోలీసు శాఖలో ఎవరెవరు ఎక్కడ పని చేశారు.. వారి సామర్థ్యం ఏంటి.. వివాదాలకు దూరంగా ఉంటారా.. రాజకీయాలతో సంబంధం ఉందా....అనే వివరాలు సైతం పంపింది. పరిశీలించిన ఈసీ విజయవాడలో పనిచేయాలంటే ఫైర్‌ బ్రాండ్‌గా పేరుగాంచిన పీహెచ్‌డీ రామక్రిష్ణను సమర్థుడిగా గుర్తించి ఎంపిక చేసింది. ఎక్కడ పనిచేసినా అధికార పార్టీలకు తలొగ్గకుండా బదిలీ అయిన చరిత్ర ఆయనది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను జిల్లా ఎస్పీగా ఎక్కడా ఏడాది కూడా పని చేయనివ్వలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సెబ్‌లో డీఐజీగా నియమిస్తే.... అక్రమంగా ఇసుక తరలించి, రాష్ట్రంలోకి పొరుగు మద్యం తెచ్చుకునే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జగన్‌పై ఒత్తిడి తెచ్చి ఆయనను బదిలీ చేయించారు. నిజాయితీపరుడిగా పేరున్న రామక్రిష్ణ గత కొంత కాలంగా ఏసీబీలో పనిచేస్తున్నారు. ఆయనను పోలీసు కమిషనర్‌గా నియమించడంతో బెజవాడలో ప్రశాంత పోలింగ్‌కు అవకాశం కల్పించినట్లేనని పోలీసు, రాజకీయ వర్గాల్లో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 25 , 2024 | 04:28 AM