విశాఖలో వింత పోకడలు
ABN , Publish Date - Dec 28 , 2024 | 05:53 AM
విశాఖపట్నంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వినూత్న పోకడలకు శ్రీకారం చుట్టారు.

కూటమి నేతల ఫ్లెక్సీలు పెట్టి అడ్డగోలు నిర్మాణాలు
నిర్మాణంలోని మాల్ ఎదుట ‘అనిత ఆశీస్సుల’తో ఫ్లెక్సీ
ఆ చుట్టుపక్కల జీవీఎంసీ, ఏపీఐఐసీ స్థలాల ఆక్రమణ
రియల్టర్ల కొత్త రకం దందా.. చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న నాయకులు
విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వినూత్న పోకడలకు శ్రీకారం చుట్టారు. వారి అనధికార వ్యవహారాలు సజావుగా నడవడానికి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకుల ఫ్లెక్సీలను తమ నిర్మాణ ప్రాంగణాల్లో పెట్టి అధికారులు అక్కడకు రాకుండా నిలువరించడం వారి అలవాటుగా మారింది. ఈక్రమంలో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఎదురుగా (కప్పరాడ) జాతీయ రహదారిని ఆనుకొని మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న మెగా మాల్ వద్ద ‘హోం శాఖ మంత్రి అనిత ఆశీస్సులతో’ అంటూ ఫ్లెక్సీ పెట్టారు. అలాగే స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఐటీ మంత్రి లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలతో పాటు సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చికి సంస్థ యజమాని శాలువా కప్పుతున్న ఫ్లెక్సీ పెట్టి కూడా పనులు చేస్తున్నారు. నిజానికి, రెండేళ్లుగా నిర్మాణాలు జరుపుకొంటున్న ఈ మాల్ వద్ద వైసీపీ హయాంలో అప్పటి మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫ్లెక్సీ ఉండేది. షాపింగ్ మాల్‌కు రాకపోకల కోసం జాతీయ రహదారి పక్కనున్న గ్రీన్‌బెల్ట్‌ను పూర్తిగా తొలగించారు. మాల్‌కు రాకపోకల కోసం జీవీఎంసీ స్థలంలో సిమెంట్ ప్లాట్‌ఫాం నిర్మించారు. ఏపీఐఐసీ భూమిలో కొంత ఆక్రమించి పనులు చేపట్టినట్టు సమాచారం. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఫిర్యాదు చేసేంత వరకు జీవీఎంసీ అధికారులు ఆ నిర్మాణం వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు కూడా ఆక్రమించిన స్థలానికి డబ్బులు వసూలుచేయడం గానీ, లీజు మొత్తం ఖరారుగానీ చేయకుండా చోద్యం చూస్తున్నారు. ఏపీఐఐసీ ఇచ్చిన నోటీసులను మాల్ యాజమాన్యం పక్కన పెట్టేసినా ఏమీ చేయలేకపోతున్నారు. కూటమి నాయకులకు ఇవన్నీ తెలిసినా ఎవరూ నోరెత్తడంలేదు.