Share News

కోడ్‌ ఉల్లంఘనలే

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:06 AM

ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు ప్రాంతాల్లో పార్టీ అధినేతలకు సంబంధించిన ఫ్లెక్సీలు, బోర్డులు, స్టిక్కర్లు ఉండరాదని ఆదేశాలు ఉన్నాయి.

కోడ్‌ ఉల్లంఘనలే
కోసిగి వైఎస్సార్‌ సంచార పశు సేవా వాహనం పై సీఎం జగన్‌

జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల తొలగించని ఫ్లెక్సీలు

ఆదోని పట్టణ నడిబొడ్డున వైసీపీ బ్యానర్‌

సచివాలయాల్లో కోడ్‌వర్తించదా?

పత్తికొండ, మార్చి 17: ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు ప్రాంతాల్లో పార్టీ అధినేతలకు సంబంధించిన ఫ్లెక్సీలు, బోర్డులు, స్టిక్కర్లు ఉండరాదని ఆదేశాలు ఉన్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్నికల నియమావళిని అనుసరించి ఫ్లెక్సీలు, బోర్డులు తొలగించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉల్లంఘించారు. పత్తికొండ మార్కెట్‌ యార్డులో నిర్మించిన వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ కార్యాలయానికి ముఖ్యమంత్రి జగన్‌ స్టిక్కర్‌ను అలాగే ఉంచారు. తేరుబజార్‌లో పోచంరెడ్డి సేవాదల్‌ కార్యాలయంతో పాటు ఆ పక్కనే నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌ ఆరోగ్య సేవా కేంద్రం, ముఖ్యమంత్రి జగన్‌ బొమ్మలను అలాగే ఉంచారు. దీనికి తోడు పత్తికొండ పట్టణంలో వివిధ దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన మా నమ్మకం నువ్వే జగనన్న హోర్డింగ్‌లను తొలగించకుండా అలాగే వదిలేశారు. పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించలేదు. ఎమ్మెల్యే ఇంటి వద్దనే ఎన్నికల నియమావళి అమలు కాకపోతే.. సామాన్యులు నియమావళిని ఎలా పాటిస్తారని పలువురు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు.

ఆదోని పట్టణ నడిబొడ్డున ఉన్న వైసీపీ బ్యానర్‌

ఆదోని : ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్‌ కోడ్‌ అమలులోకి వచ్చింది. కోడ్‌ కారణంగా నేతలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదోని పట్టణంలోని పట్టణ నడిబొడ్డున ఉన్న వైసీపీ కార్యాలయానికి యథేచ్ఛగా వైసీపీ బ్యానర్‌ ఏర్పాటు చేసుకొని ప్రచారం చేస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. వైసీపీ నాయకులు బ్యానర్‌ ద్వారా ప్రచార పిచ్చిని భరించలేకపోతున్నామని, ప్రభుత్వమే ఎన్నికల కమిషన్‌ నిబంధనలు ఉల్లంఘించడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మాధవరం సచివాలయానికి ఎన్నికల కోడ్‌ వర్తించదా

మంత్రాలయం: మాధవరం సచివాలయం-1లో నవరత్నాలు తెలిపే జగన్‌ ఫొటో అలాగే ఉంచారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చి 24 గంటలు దాటినా హైవే రోడ్డుకు, పోలీస్‌స్టేషన్‌కు పక్కనే ఉన్న సచివాలయం బోర్డుపై సీఎం జగన్‌బొమ్మ అలాగే ఉంచడం గమనార్హం.

విగ్రహాలకు ముసుగులు వేయలేదు

కోసిగి : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటికీ అధికార వైసీపీతో కూడిన సీఎం జగన్‌ రెడ్డి ఫొటోలు, వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా వాహనంతో పాటు అలాగే కొత్తగా నిర్మించిన సచివాలయాలపైన సీఎం జగన్‌ నవరత్నాలతో కూడిన ఫొటోలు, స్టిక్కర్లుకు ముసుగు వేయలేదు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అధికార పార్టీకి సంబంధించిన అన్ని ప్రచార ఫ్లెక్సీలను, ఫొటోలను, స్టిక్కర్లను తొలగించాల్సి ఉండగా.. కోసిగిలో మాత్రం అధికారులు పెడచెవిన పెట్టారు.

ప్రభుత్వ భవనాలకు తొలగని రాజకీయ ముఖాలు

వెల్దుర్తి : వెల్దుర్తి పట్టణంలో రైతు భరోసా కేంద్రం భవనం, పంచాయతీ కార్యాలయ ఆవరణలో హోర్డింగ్‌, సుజల స్రవంతి మంచి నీరు సరఫరా చేసే కేంద్రాల మీద ఏర్పాటుచేసిన ప్రజాప్రతినిథుల ఫ్లెక్సీలు తొలగించలేదు.

Updated Date - Mar 18 , 2024 | 12:06 AM