Vijayawada : ఓఆర్‌ఆర్‌కు మహర్దశ!
ABN , Publish Date - Jul 10 , 2024 | 03:56 AM
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)కు మహర్దశ పట్టనుంది. దీనికి ఇప్పటికే అనుమతిచ్చిన కేంద్రం ఈ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించేందుకు వీలుగా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేయనున్నట్టు తెలుస్తోంది.
కేంద్ర బడ్జెట్‌లో నిధులు.. రూ.5-10 వేల కోట్లు ఉండొచ్చని అంచనా
రూ.25 వేల కోట్ల సవరణ అంచనాలతో ఔటర్ రింగ్ రోడ్డుకు ఇప్పటికే అంగీకారం
జగన్ నిర్లక్ష్యంతో 8 వేల కోట్ల వ్యయం పెంపు
విజయవాడ, జూలై 9(ఆంధ్రజ్యోతి): అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)కు మహర్దశ పట్టనుంది. దీనికి ఇప్పటికే అనుమతిచ్చిన కేంద్రం ఈ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించేందుకు వీలుగా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలో ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా అమరావతి ఓఆర్‌ఆర్‌కు కేటాయింపులు ఉంటాయని సమాచారం. ఓఆర్‌ఆర్ మొత్తం 189 కిలోమీటర్లు.
దీనిని రూ.25 వేల కోట్ల వ్యయంతో నిర్మించేందుకు కేంద్రం అనుమతి తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో ఓఆర్‌ఆర్‌కు కేటాయింపులు చేసే అవకాశాలున్నాయని జాతీయ రహదారి సంస్థ అధికార వర్గాలు కూడా చెబుతున్నాయి.
ఈ ఏడాది బడ్జెట్‌లోనే రూ.5 వేల నుంచి 10 వేల కోట్లు కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులలో భూ సేకరణ వ్యయం కూడా కేంద్రమే భరించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు.
ప్రస్తుతం ఈ ఖర్చు రూ.10 వేల కోట్ల వరకు చేరుకుంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక పరిస్థితులలో రూ.10 వేల కోట్లను భరించే పరిస్థితి లేకపోవటంతో సీఎం చంద్రబాబు భూసేకరణ ఖర్చును కూడా కేంద్రమే భరించేలా ఒప్పించే ప్ర యత్నం చేశారు. దీనికి కేంద్రం కూడా అంగీకరించటంతో.. పూర్తిగా కేంద్రమే నిర్మించే అవకాశం ఉంది.
జగన్ నిర్లక్ష్యంతో..
వాస్తవానికి ఓఆర్‌ఆర్ ప్రాజెక్టును ఐదేళ్ల కిందటే ప్రతిపాదించారు. అయితే.. జగన్ సర్కారు రాజధానితోపాటు ఈ రహదారిని కూడా తుంగలో తొక్కింది. దీంతో ఇప్పుడు అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో రూ.17 వేల కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన ఓఆర్‌ఆర్‌కు ప్రస్తుత ధరల మేరకు రూ.25 వేల కోట్ల వ్యయం అవుతుందని భావిస్తున్నారు.
ఇదీ ఓఆర్‌ఆర్ స్వరూపం..
ఓఆర్‌ఆర్ మొత్తం 189 కిలోమీటర్లు..
తూర్పు భాగంలో 78 కిలోమీటర్లు
పశ్చిమ భాగంలో 111 కిలోమీటర్లు
3 దశల్లో, 11 ప్యాకేజీల్లో
ఓఆర్‌ఆర్ నిర్మాణం
6 లేన్లతో యాక్సెస్ కంట్రోల్
ఎక్స్‌ప్రెస్‌వేగా అభివృద్ధి
ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి
గుంటూరు జిల్లాల్లో విస్తరణ
22 మండలాల పరిధిలోని 87
గ్రామాల మీదుగా నిర్మాణం
ఓఆర్‌ఆర్‌లో మొత్తం తొమ్మిది ఇంటర్ చేంజ్‌లు
కొండ ప్రాంతాలలో మూడు టన్నెల్స్ నిర్మాణం
మొత్తం 14 ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం
కృష్ణానది మీద రెండు బ్రిడ్జిలు ఏర్పాటు.
మొత్తం 78 అండర్‌పాస్‌ల నిర్మాణం