Share News

విజయసాయిరెడ్డి బావమరిది

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:29 AM

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి స్వయానా బావమరిది, లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.

విజయసాయిరెడ్డి బావమరిది

ద్వారకానాథరెడ్డి నేడు టీడీపీలో చేరిక

రాయచోటి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి స్వయానా బావమరిది, లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. బుధవారం విజయవాడలో చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. 1994లో గడికోట ద్వారకానాథరెడ్డి లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందారు. 1999లో తెలుగుదేశం పార్టీ ఇవ్వకపోవడంతో అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2009లో సైతం టికెట్‌ కోసం ప్రయత్నించినా దక్కలేదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014లో ఆ పార్టీ టికెట్‌ను ఆశించారు. 2019లో సైతం వైసీపీ, తెలుగుదేశం పార్టీల తరఫున టికెట్‌ను ఆశించినా దక్కలేదు. అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఆయన రాయచోటి టీడీపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. ద్వారకానాథరెడ్డి తండ్రి రామసుబ్బారెడ్డి 1978లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962 నుంచి ఈయన కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంది. ఎంపీ విజయసాయిరెడ్డి భార్య ద్వారకానాథరెడ్డికి స్వయానా అక్క. ద్వారకానాథరెడ్డితో పాటు ఆయన అన్న గడికోట సురేంద్రనాథరెడ్డి, అక్క హరెమ్మ (నందమూరి తారకరత్నకు స్వయానా అత్త) కూడా నేడు టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే రాయచోటి ఎమ్మెల్యే టికెట్‌ను టీడీపీ తరఫున ముగ్గురు నాయకులు ఆశిస్తుండగా ద్వారకానాథరెడ్డి చేరిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Updated Date - Jan 03 , 2024 | 03:29 AM