Share News

‘ఎర్రచందనం స్మగ్లర్‌ అను నేను’

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:11 AM

చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తనపై ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులతోపాటు మద్యం అక్రమ రవాణా కేసులను కూడా వివరించారు.

‘ఎర్రచందనం స్మగ్లర్‌ అను నేను’

అఫిడవిట్‌లో అంగీకరించిన వైసీపీ అభ్యర్థి

చిత్తూరులో నామినేషన్‌ వేసిన విజయానందరెడ్డి

అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తనపై ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులతోపాటు మద్యం అక్రమ రవాణా కేసులను కూడా వివరించారు. దీంతో ‘ఎర్రచందనం స్మగ్లర్‌’ అని ఆయనే స్వయంగా ఒప్పుకొన్నట్టయింది. విజయానందరెడ్డిపై ఏకంగా 12 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులున్నాయి. పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్‌ అయిన ఈయన తన జీవితాన్ని డ్రైవరుగా ప్రారంభించారు. ఎర్రచందనం, మద్యం అక్రమ రవాణా కారణంగా అనతికాలంలోనే ఆర్థికంగా స్థిరపడ్డారు. రాజకీయ నాయకుడి అవతారమెత్తారు. 2014,19 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని వైసీపీ అభ్యర్థులకు పెట్టుబడి పెట్టారని సమాచారం. 2014లో అప్పటి ప్రభుత్వం ఈయనపై పీడీ చట్టం ప్రయోగించి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపింది. విజయానందరెడ్డికి మొదటి నుంచి జగన్‌తో మంచి సంబంధాలున్నాయి. 2014 జనవరి 23న కొట్రాలపల్లెలో ఉన్న విజయానందరెడ్డి ఇంటికి కూడా జగన్‌ వెళ్లారు. పూతలపట్టులో జరిగిన సిద్ధం సభలో ‘విజయానందరెడ్డి మంచివాడు, సౌమ్యుడు’ అని జగన్‌ కితాబిచ్చారు. బలిజ సామాజికవర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసులును కాదని విజయానందరెడ్డికి జగన్‌ టికెట్‌ కేటాయించారు.

ఇదీ.. కేసుల చిట్టా: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు పోలీస్‌ స్టేషనులో 39-2014 ఎఫ్‌ఐఆర్‌ నెంబరుతో, జీడీనెల్లూరు స్టేషన్‌లో 33-2014, కేవీపల్లెలో 77-2013, 3-2014, బంగారుపాళ్యంలో 35-2014, 74-2014, చిత్తూరు వన్‌టౌన్‌లో 73-2014, 75-2014, 101-2014, పెనుమూరులో 58-2014, గుడిపాలలో 86-2015, ఎస్‌ఆర్‌పురంలో 78-2014 ఎఫ్‌ఐఆర్‌ నంబర్లతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేశారనే కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులోని సీఐడీ స్టేషన్లో 51-2014 ఎఫ్‌ఐఆర్‌ నెంబరుతో మద్యం అక్రమ రవాణా కేసు ఉంది. తాజాగా 82-2024 ఎఫ్‌ఐఆర్‌ నంబరుతో చిత్తూరు 2 టౌన్‌లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారనే కేసు నమోదైంది. ఈ కేసులన్నింటి వివరాలను విజయానందరెడ్డి తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

స్మగ్లర్‌కు టికెట్టా?: వరుణ్‌

తిరుపతి వన సంపదను కొల్లగొట్టిన విజయానందరెడ్డికి చిత్తూరు వైసీపీ టికెట్‌ ఇచ్చారని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్‌ విమర్శించారు. ఆయన నామినేషన్‌ కూడా వేశారని, ఇలాంటి వ్యక్తులకు రాజకీయ సమాధి కట్టాలి’ అని వరుణ్‌ పిలుపునిచ్చారు.

Updated Date - Apr 19 , 2024 | 04:11 AM