Share News

విద్యా‘రత్నం’ ఇకలేరు

ABN , Publish Date - Mar 21 , 2024 | 02:45 AM

విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత కొర్రపాటి వెంకట రత్నం (కేవీ రత్నం, 82) తుదిశ్వాస విడిచారు.

విద్యా‘రత్నం’ ఇకలేరు

రత్నం విద్యాసంస్థల అధినేత కేవీ రత్నం కన్నుమూత

అనారోగ్యంతో బాధపడుతూ నెల్లూరులో తుదిశ్వాస

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య సహా పలువురి దిగ్ర్భాంతి

నెల్లూరు(విద్య), మార్చి 20: విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత కొర్రపాటి వెంకట రత్నం (కేవీ రత్నం, 82) తుదిశ్వాస విడిచారు. మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తీవ్ర అస్వస్ధకు గురై కన్నుమూశారు. విద్యారంగంలో చెరగని ముద్రవేసిన ఆయన విద్యాసంస్థల విజయాలకు నెలవుగా నెల్లూరు జిల్లా కీర్తిని ఇనుమడింప చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి లక్షలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందించారు. ఆయన శిష్యులు ఎందరో నేడు ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం చలపనాయుడుపల్లిలో 1943 మే 23న జన్మించిన రత్నం... ఆత్మకూరు ప్రాంతంలోనే పదో తరగతి పూర్తిచేశారు. 1961-62లో పీయూసీ, 1963-66లో నెల్లూరు వీఆర్‌ కళాశాలలో బీఎస్సీ కెమిస్ర్టీలో డిస్టింక్షన్‌ సాధించారు. 1966లో అదే కళాశాల కెమిస్ట్రీ విభాగంలో నెలకు రూ.240 జీతంతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అదే ఏడాది నగరంలోని రజక వీధిలో జయంతి ట్యుటోరియల్స్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 1983లో రాష్ట్రంలోనే తొలిసారిగా రత్నం కోచింగ్‌ సెంటర్‌ ప్రారంభించి, 1985లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అక్కడినుంచి అంచెలంచెలుగా ఎదిగిన రత్నం విద్యాసంస్థలు రాష్ట్రంలోనే సంచలనాత్మక విద్యావేదికగా గుర్తింపు పొందాయి. ఓవైపు విద్యనందిస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలకూ శ్రీకారం చుట్టారు. 2005లో చిన్నారి హార్ట్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి 140మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి అందరి మన్ననలు పొందారు. కేవీ రత్నం మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరు హరనాథపురం శ్రీకృష్ణ అవెన్యూలోని ఆయన నివాసంలో ఉంచిన భౌతికకాయాన్ని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఇతర ప్రముఖులు, విద్యావేత్తలు, విద్యార్థులు సందర్శించి నివాళులర్పించారు.

Updated Date - Mar 21 , 2024 | 08:43 AM