Share News

విషమ ‘పరీక్ష’!

ABN , Publish Date - Feb 01 , 2024 | 03:24 AM

బడుల రూపురేఖలు మార్చామన్న సీఎం జగన్‌ పాలనలో ఎన్నెన్నో లొసుగులు. అయినా వాటన్నిటినీ కప్పిపుచ్చి డప్పాలు కొట్టడం వైసీపీ సర్కారుకు అలవాటైపోయింది!

విషమ ‘పరీక్ష’!

ప్రాక్టికల్స్‌ కోసం పది కిలోమీటర్లు

‘‘ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం. విద్యను రాజకీయంగా చూడకుండా వేల కోట్లు ఖర్చు చేశాం. ప్రభుత్వ బడులను చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారు. పేదల పిల్లలను ప్రపంచ స్థాయి విద్యార్థులుగా పోటీపడేలా చేసే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గను. రాష్ట్రంలో ఏ బడికైనా వెళ్లి అభివృద్ధిని చూడొచ్చు’’.. సరిగ్గా నాలుగు రోజుల కిందట ఇండియా టుడే నిర్వహించిన విద్యా సదస్సులో సీఎం జగన్‌ మాటలివి. కానీ మరో పది రోజుల్లో హైస్కూల్‌ ప్లస్‌లలో చదివే విద్యార్థినులకు ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌ కోసం పది కిలోమీటర్లు వెళ్ళాల్సిన దుస్థితి రాబోతోందని తెలుసా? అదీ.. ప్రాక్టీసు లేకుండానే ప్రాక్టికల్స్‌కు హాజరవ్వాల్సిన విషమ పరీక్షను ఎదుర్కొంటున్నారని తెలుసా??.. అవును ఇది ముమ్మాటికీ నిజం!

హైస్కూల్‌ ప్లస్‌ విద్యార్థినులకు ఇక్కట్లు

ల్యాబ్స్‌ లేకుండానే సెకండియర్‌ పరీక్షలు

వేరే కాలేజీకి వెళ్లాలని సర్కారు సలహా

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

బడుల రూపురేఖలు మార్చామన్న సీఎం జగన్‌ పాలనలో ఎన్నెన్నో లొసుగులు. అయినా వాటన్నిటినీ కప్పిపుచ్చి డప్పాలు కొట్టడం వైసీపీ సర్కారుకు అలవాటైపోయింది! ఈ కోవలోనిదే హైస్కూల్‌ ప్లస్‌ చదువులు! ఎలాంటి ముందస్తు ఆలోచనా లేకుండా, ప్రచారం కోసం హైస్కూల్‌ ప్లస్‌లను ప్రారంభించడంతో.. సక్రమంగా చదువులు సాగక విద్యార్థులు ఇక్కడ ఎందుకు చేరామా? అని కుమిలిపోవాల్సి వస్తోంది. ఇప్పుడు ప్రాక్టికల్స్‌ కోసం పది కిలోమీటర్ల దూరానికి పైగా ఉన్న వేరే కాలేజీలకు వెళ్లాల్సి వస్తోంది. సరైన ప్రాక్టీస్‌ లేకుండానే నేరుగా ప్రాక్టికల్స్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సమీపంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి వెళ్లి అక్కడ ప్రాక్టికల్స్‌ చేయించాలని తాజాగా ప్రభుత్వం ఆదేశించడంతో ఈ దుస్థితి తలెత్తింది.

అంతా రాజకీయ ప్రాపకమే!

ప్రతి మండలంలో ఒక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఏర్పాటుచేస్తామని సీఎం జగన్‌ గతంలో హామీ ఇచ్చారు. దాని అమలు కోసం కొత్త కాలేజీలు కట్టించాల్సి ఉండగా, నిధులు ఖర్చు చేయకుండా తప్పించుకునే మార్గాన్ని ఎంచుకున్న ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో హైస్కూల్‌ ప్లస్‌ అనే విధానం తెచ్చింది. ఏ మండలంలో అయితే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ లేదో అక్కడ ఓ ఉన్నత పాఠశాలలో హైస్కూల్‌ ప్లస్‌ను బాలికల కోసం ప్రారంభించింది. 2022-23 విద్యా సంవత్సరంలో 292 ఉన్నత పాఠశాలల్లో ఇలాంటి ఇంటర్‌ ఫస్టియర్‌ మొదలైంది. మొదటి ఏడాది 3వేల మంది విద్యార్థినులు చేరారు. హడావుడిగా ప్రారంభించేసిన సర్కారు బోధన ఎవరు చేయాలనేదానిని గాలికొదిలేసింది. తాత్కాలికంగా పాఠశాల టీచర్లతోనే బోధన చేయించింది. దీంతో ఫస్టియర్‌ చదివిన విద్యార్థులు దారుణంగా నష్టపోయారు. 15శాతం దాటి ఉత్తీర్ణులు కాలేదు. ఈ విధానం అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో అందులో ఫలితాలను ప్రభుత్వం బయటపెట్టకుండా దాచిపెట్టింది. తీరా మొదటి సంవత్సరం అయిపోయాక అప్పుడు అక్కడ ఇంటర్‌ బోధనకు పూర్తిస్థాయి టీచర్లను కేటాయించారు. కానీ మౌలిక సదుపాయాలను మాత్రం కల్పించలేదు.

ఆ కాలేజీల్లో సాధ్యమయ్యేనా?

రాష్ట్రంలో 474 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలుంటే, వాటిలో సైన్స్‌ ల్యాబ్స్‌ అతంతమాత్రంగానే ఉన్నాయి. ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్‌ జనరల్‌ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ జరుగుతాయి. ఎంపీసీ విద్యార్థులకు రెండు రోజులు, బైపీసీ విద్యార్థులకు నాలుగు రోజులు ప్రాక్టికల్స్‌ ఉంటాయి. హైస్కూల్‌ ప్లస్‌లలో చదువుతున్న విద్యార్థినులు ఆ ప్రాక్టికల్స్‌ కోసం సమీపంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి వెళ్లేలా అధికారులు మ్యాప్‌ చేశారు. పది కిలోమీటర్ల లోపులో ఉన్న కాలేజీలను మ్యాపింగ్‌ చేసినట్లు చెబుతున్నారు. అయితే చాలాచోట్ల పది కిలోమీటర్లు దాటి ప్రాక్టికల్స్‌ వెళ్లాల్సి వస్తోందని అర్థమవుతోంది. ఎందుకంటే ఎక్కడైతే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ లేదో అక్కడే హైస్కూల్‌ ప్లస్‌ పెట్టారు. అంటే ఆ సమీపంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ లేదని అర్థం. మరోవైపు సెకెండియర్‌లో విద్యార్థులు ప్రాక్టికల్స్‌ కోసం పదే పదే ప్రాక్టీసు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రాక్టీసు లేకుండానే నేరుగా ప్రాక్టికల్స్‌కు వెళ్తున్నారని తెలుస్తోంది. ఇంతవజుకు ఒకెత్తయితే.. సమీప కాలేజీకి వీరిని తీసుకెళ్లినా అక్కడి విద్యార్థులకూ ప్రాక్టికల్స్‌ ఉంటాయి. అలాంటప్పుడు అందరూ ఒకేసారి ప్రాక్టికల్స్‌ చేయడం ఎలా సాధ్యమవుతుందో మరి.

సీఎం సభకేనా నిధులు...

ల్యాబ్స్‌కు ఇవ్వలేరా?

జగన్‌ ప్రభుత్వం ఇంటర్‌ విద్యామండలి నిధులను ఇష్టానుసారం వాడేసుకుంది. నాడు-నేడుకు దాదాపు రూ.200 కోట్లు ఇచ్చింది. 2022లో బాపట్లలో జరిగిన ఇంటర్‌ విద్యాశాఖకు సంబంధం లేని సీఎం సభకు మాత్రం ఆగమేఘాలపై రూ.25లక్షలు ఇచ్చింది. ఉన్నత విద్య కమిషన్‌ భవనం మరమ్మతులకూ నిధులు ఇచ్చింది. విద్యార్థులు కట్టే ఫీజుల నుంచి వచ్చిన నిధులను ఇలా ఎడాపెడా వాడేసిన ప్రభుత్వం హైస్కూల్‌ ప్లస్‌లలో ల్యాబ్స్‌కు సొంత నిధులు ఇవ్వకపోగా ఇంటర్‌ బోర్డు నుంచి కూడా నిధులు ఇవ్వలేదు. దీంతో సరైన బోధన లేక, ఇప్పుడు ప్రాక్టికల్స్‌లో మార్కులు తగ్గుతాయేమోనని అక్కడ చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం మాటలు నమ్మి చేర్పించామని ఆవేదన చెందుతున్నారు.

Updated Date - Feb 01 , 2024 | 03:24 AM