Share News

వెరీ వెరీ బ్యాడ్‌!

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:10 AM

ఆరు నెలల్లోనే బెస్ట్‌ సీఎం అనిపించుకుంటా. ఒక్కసారి వచ్చి పోవడం కాదు. 30 ఏళ్లు అధికారంలో ఉండేలా నా పాలన ఉంటుంది’

వెరీ వెరీ బ్యాడ్‌!

దుష్ట పాలనకు ఉదాహరణగా జగన్‌

ఓటమికి ఆయన వైఖరే కారణం

‘ఆరు నెలల్లోనే బెస్ట్‌ సీఎం అనిపించుకుంటా. ఒక్కసారి వచ్చి పోవడం కాదు. 30 ఏళ్లు అధికారంలో ఉండేలా నా పాలన ఉంటుంది’ అని అధికారంలోకి వచ్చిన మొదట్లో జగన్‌ చిలక పలుకులు పలికారు. కానీ... ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదు, పరిపాలన ఎలా సాగించకూడదు అనేందుకు బెస్ట్‌ ఎగ్జాంపుల్‌గా నిలిచారు. దీని ఫలితమే ఈ ఓటమి.

విజ్ఞత మరిచి పచ్చి బూతులు మాట్లాడుతున్న వైసీపీ నేతలను ఒక్కసారైనా జగన్‌ నిలువరించలేదు. పైగా... ‘షిక్కగా’ నవ్వుతూ వాళ్లను ప్రోత్సహించారు. ‘ఈయనేం ముఖ్యమంత్రి’ అని మహిళలు ఈసడించుకున్నారు. ఇప్పుడు ఛీ కొట్టారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చుట్టూ తన సామాజిక వర్గం వాళ్లనే పెట్టుకున్నారు. పోస్టింగ్‌లు, పదవుల్లోనూ వారికే పెద్దపీట. పదవులు దక్కిన వారిని మినహాయిస్తే... ఆ సామాజిక వర్గానికి చెందిన సామాన్యులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లందరికీ జగన్‌ వల్ల కష్టాలూ, నష్టాలే! ‘నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీల’ను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు. ఫలితంగా... తరతమ తేడా లేకుండా అందరూ కలిసి ‘ఫ్యాను’ రెక్కలు విరిచేశారు.

ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు మార్చడం, పాఠ్య పుస్తకాల నుంచి పట్టాదారు పాసు పుస్తకాల వరకు అన్నింటి మీదా తన ఫొటోలు వేసుకోవడం, పథకాల పేర్లు మార్చేయడం... ఇవీ జగన్‌ సాధించిన ‘విజయాలు’! పథకాల పేర్లు, అమలు తీరు మార్చడమే తప్ప జగన్‌ చేసిన సంక్షేమమేదీ లేదు. ఈ విషయాలన్నీ జనం గ్రహించారు.

అమరావతే రాజధానిగా ఉంటుందని అసెంబ్లీలోనూ, గత ఎన్నికల ప్రచారంలోనూ చెప్పారు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక నమ్మకద్రోహం చేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని పాడు పెట్టావు. మూడు రాజధానులంటూ మూడు ప్రాంతాలనూ మోసం చేశారు.

ఇదిగో.. పోలవరం ప్రాజెకును పూర్తి చేస్తానంటూ హడావుడి చేశారు. ఎన్నో గడువులు మార్చారు. చివరకు అతీగతీ లేకుండా చేశారు.

ఏటా జాబ్‌ కేలండర్‌, మెగా డీఎస్సీ, ఉద్యోగాలు, పరిశ్రమలు.. అంటూ గత ఎన్నికల ముందు ఎన్నెన్నో ఆశలు కల్పించారు. ఆపై అన్నీ మరిచారు.

‘ప్రజలను కలవని ఏకైక ముఖ్యమంత్రి’గా జగన్‌ చరిత్రకెక్కారు. ఐదేళ్లూ తాడేపల్లి ప్యాలె్‌సకే పరిమితమయ్యారు. జిల్లాలకు వచ్చినా బారికేడ్లు, పరదాల మాటున తిరిగారు.

ఎన్నికల ముందు ‘వై నాట్‌ 175’ అన్నారు. పోలింగ్‌ ముగిశాక లండన్‌కు వెళ్తూ వెళ్తూ... మాయదారి ఐప్యాక్‌ టీమ్‌ను కలిసి, ‘గతంలో వచ్చిన 151 దాటేస్తాం. దేశం మొత్తం ఇటే చూస్తుంది’ అని జోస్యం చెప్పారు. నిజమే... 151 నంబర్‌ దాటేశారు. కానీ... వైసీపీ కాదు! టీడీపీ కూటమి! ఎన్డీయేలో బీజేపీ తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలు దక్కింది ఇక్కడే కావడంతో దేశమంతా ఏపీవైపే చూస్తోంది. ఆ రకంగా జగన్‌ ‘సగం’ నిజం చెప్పినట్లే!

Updated Date - Jun 05 , 2024 | 07:24 AM