Share News

వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:21 AM

బహిరంగంగా వైసీపీకి అనుకూల ప్రచారం చేసిన ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, సీఎం జగన్‌కు వీరవిధేయుడు, పరమభక్తుడైన కె.వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఎట్టకేలకు సస్పెండ్‌ చేసింది. మార్చి 31వ తేదీన

వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు

జీవో జారీ చేసిన ప్రభుత్వం

అనుమతి లేకుండా అమరావతి దాటి వెళ్లొద్దని ఆయనకు ఆదేశం

గుంటూరు, విజయవాడ కూడా..

సస్పెన్షన్‌ జాప్యానికి శతవిధాలుగా సీఎస్‌ జవహర్‌రెడ్డి యత్నాలు

వెంకట్రామిరెడ్డి వివరణ ఆధారంగా సస్పెన్షన్‌ ఉపసంహరణకు ఎత్తు

కానీ ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో సీన్‌ రివర్స్‌

మరి ఆయన అసోసియేషన్‌ సభ్యత్వం రద్దు చేయరా?

అమరావతి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): బహిరంగంగా వైసీపీకి అనుకూల ప్రచారం చేసిన ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, సీఎం జగన్‌కు వీరవిధేయుడు, పరమభక్తుడైన కె.వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఎట్టకేలకు సస్పెండ్‌ చేసింది. మార్చి 31వ తేదీన కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరులో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకుడు చంద్రయ్యతో కలిసి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసి, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు గురువారం జీవో జారీచేసింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగై ఉండి, ఉద్యోగ సంఘం నాయకుడై ఉండి.. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడినందుకు ఏపీ కాండక్ట్‌ రూల్స్‌-1964 ప్రకారం కూడా ఈ సస్పెన్షన్‌ వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి పంచాయతీరాజ్‌ శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌. ప్రస్తుతం ఇన్‌చార్జి అసిస్టెంట్‌ సెక్రటరీ పోస్టులో ఉన్నారు. మార్చి 31న ఆర్టీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన చేసిన ప్రచారాలపై టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై చంద్రయ్యను, మరో 11 మందిని ఆర్టీసీ యాజమాన్యం ఈ నెల 4వ తేదీన సస్పెండ్‌ చేసింది. కానీ వీళ్లందరికీ నాయకుడిలా వ్యవహరించిన వెంకట్రామిరెడ్డి వ్యవహారంలో మాత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఆయన్ను సస్పెండ్‌ చేయాలని ఎన్నికల సంఘం ఈ నెల 8వ తేదీన ఆదేశించింది. సాధారణ పరిపాలనా విభాగాని(జీఏడీ)కి సమాచారం పంపింది. అయితే ఆ సస్పెన్షన్‌ ఫైలు నాటి నుంచి 13వ తేదీ వరకు జీఏడీలోని వివిధ స్థాయుల అధికారుల మధ్యే చక్కర్లు కొట్టింది. 14వ తేదీన ఎట్టకేలకు సీఎస్‌ జవహర్‌రెడ్డికి చేరింది. ఆ ఫైలును ఆయన మంగళవారం (16వ తేదీ) వరకు పక్కన పడేశారు. దీంతో జగన్‌కు పరమభక్తుడైన వెంకట్రామిరెడ్డిని సీఎస్‌ కాపాడుతున్నారంటూ ‘జగన్‌ సేవలో జవహర్‌’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీంతో 17వ తేదీన సీఎస్‌ వద్ద నుంచి ఆ ఫైలు కదిలింది. గురువారం సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సస్పెన్షన్‌ కాలంలో వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ అనుమతి లేకుండా అమరావతి, గుంటూరు, విజయవాడ దాటి వెళ్లకూడదని జీవోలో స్పష్టం చేశారు.

వివరణ సాకుతో..

వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడకుండా ఉండేందుకు సీఎస్‌ జవహర్‌రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. తనకేమీ తెలియదని, తాను కేవలం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకే కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరుకు వెళ్లానని వెంకట్రామిరెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్‌ మీనాకు 16వ తేదీన వినతి పత్రం ఇచ్చారు. తనతో పాటు ఆర్టీసీ సంఘాల నాయకులు, ఉద్యోగులు కూడా సమస్యలపైనే మాట్లాడారని, రాజకీయ ప్రచారం చేయలేదన్నారు. ఇప్పటి వరకు సస్పెండ్‌ చేసిన 11 మందిపైనా సస్పెన్షన్‌ ఎత్తేయాలని కోరారు. ఈ వివరణ ఆధారంగా సస్పెన్షన్‌ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని సీఎస్‌ ఎత్తు వేశారు. కానీ ఆ మరుసటి రోజు ‘ఆంధ్రజ్యోతి’లో దీనిపై కథనం ప్రచురితం కావడంతో సీన్‌ రివర్స్‌ అయింది. జగన్‌కు వీరవిధేయుడిని సస్పెండ్‌ చేయక తప్పని పరిస్థితి సీఎ్‌సకు ఏర్పడింది. అలాగే ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడినందుకు రోసా నిబంధనల ప్రకారం అసోసియేషన్‌లో వెంకట్రామిరెడ్డి సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్‌ సూర్యనారాయణ విషయంలో ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. వెంకట్రామిరెడ్డి విషయంలో మాత్రం మెతక వైఖరే అవలంబిస్తోంది.

Updated Date - Apr 19 , 2024 | 04:21 AM