పీసీబీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:24 AM
వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్‌లో ఉత్పత్తి నిలిపివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఇచ్చిన ఉత్తర్వు ల్లో జోక్యం చేసుకొనేందుకు హైకోర్టు నిరాకరించింది.

ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీ పిటిషన్‌ఫై హైకోర్టు
అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్‌లో ఉత్పత్తి నిలిపివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఇచ్చిన ఉత్తర్వు ల్లో జోక్యం చేసుకొనేందుకు హైకోర్టు నిరాకరించింది. సదరు ఫ్యాక్టరీ వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సోదరుడిది. కాలుష్య నియంత్రణ పద్ధతు లు సక్రమంగా లేకపోవడంతో పీసీబీ ఇచ్చిన ఆదేశాలపై ఆ కంపెనీ ఎండీ ద్వారంపూడి వీరభద్రారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.జయసూర్య, జస్టిస్ జగడం సుమతితో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పీసీబీ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని, కౌంటర్ దాఖలు చేయాలని పీసీబీని ఆదేశించింది. విచారణను జనవరి 3కి వాయిదా వేసింది. కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు మండలం, లంపకలోవలోని రొయ్యల ఫ్యాక్టరీ వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశిస్తూ డిసెంబరు 2న పీసీబీ విశాఖ జోన్ జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ఉత్తర్వు లు జారీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ కంపెనీ ఎండీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫు న్యాయవాది వి.సురేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఉత్పత్తి నిలిపివేత ఉత్తర్వులు జారీ చేసే అధికారం సదరు అధికారికి లేదని, లోపాలపై తామిచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పలు దేశాలతో సరఫరా ఒప్పందాలు ఉన్నాయని, ఉత్పత్తి నిలిపివేస్తే న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందని, కాబట్టి పీసీబీ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరారు. పీసీబీ తరఫున ప్రభుత్వ న్యాయవాది వై.సోమరాజు వాదనలు వినిపిస్తూ... ‘ఫ్యాక్టరీలోని వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా కాలువల్లోకి వదులుతున్నారు. ఉల్లంఘనలను సరిచేసుకోవడానికి సమయమిచ్చాం. అయినా పట్టించుకోలేదు. ఐస్ ప్లాంట్ నిర్వహణకు పీసీబీ నుంచి కన్సంట్ టు ఆపరేట్(సీటీవో) పొందలేదు. అందుకనే ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తాం. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దు’ అని కోరారు.