Share News

వర్రాను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చాం

ABN , Publish Date - Nov 13 , 2024 | 05:01 AM

సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రా రెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్‌కుమార్‌ రెడ్డిలను అరెస్ట్‌ చేసి కడప 2వ అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చామని పోలీసులు హైకోర్టుకు నివేదించారు.

వర్రాను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చాం

రవీంద్రా రెడ్డికి 25 వరకు రిమాండ్‌ విధించారు

హైకోర్టుకు నివేదించిన ఎస్‌జీపీ.. విచారణ 18కి వాయిదా

అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రా రెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్‌కుమార్‌ రెడ్డిలను అరెస్ట్‌ చేసి కడప 2వ అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చామని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. వీరిలో రవీంద్రారెడ్డికి 25 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు ఇచ్చారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) టి. విష్ణుతేజ వివరించారు. తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయనను కోర్టుముందు హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ రవీంద్రా రెడ్డి భార్య హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే సుబ్బారెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి బంధువులు కూడా హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను హైకోర్టు మంగళవారం లంచ్‌మోషన్‌గా విచారణకు స్వీకరించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది వీఆర్‌ రెడ్డి కొవ్వూరి వాదిస్తూ.. రవీంద్రా రెడ్డితో పాటు ఇతర నిందితులను పోలీసులు ఈ నెల 6 నుంచి అక్రమంగా నిర్బంధించారని, మంగళవారం వేకువజామున కోర్టు ముందు హాజరుపర్చారని, రవీంద్రా రెడ్డిని వివిధ ప్రాంతాల్లో తిప్పి చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మేజిస్ట్రేట్‌ దృష్టికి తీసుకెళ్లగా రవీంద్రా రెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు. వైద్య పరీక్షల నివేదికను కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని, రవీంద్రా రెడ్డిని నిర్బంధించిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను సంబంధిత మేజిస్ట్రేట్‌ ముందు ఉంచేలా ఆదేశించాలని కోరారు. అయితే, ఎక్కడ నిర్బంధించారో వివరాలు చెప్పకుండా, సీసీటీవీ ఫుటేజ్‌ను సమర్పించాలని ఎలా ఆదేశించగలమని ధర్మాసనం ప్రశ్నించింది. వైద్య పరీక్షల నివేదిక వ్యవహారాన్ని సంబంధిత మేజిస్ట్రేట్‌ వద్దే తేల్చుకోవాలని సూచించింది. అక్రమ నిర్బంధానికి సంబంధించిన వివరాలతో అదనపు అఫిడవిట్‌ వేసేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు ఇచ్చింది. పూర్తివివరాలతో కౌంటర్‌ వేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది.

Updated Date - Nov 13 , 2024 | 05:10 AM