Share News

‘యు’టర్నింగ్‌ అధికారులు!

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:35 AM

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమర్పించే నామినేషన్లకు, అఫిడవిట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నియమాలను పాటిస్తుంది.

‘యు’టర్నింగ్‌ అధికారులు!

నామినేషన్లలో లోపాలపై వైసీపీ అభ్యర్థులకు మేళ్లు

తప్పుల తడకలకూ ఆమోదం

కేసులు, ఆస్తులు దాచేసినా మౌనం

కనీసం ఫిర్యాదులూ పట్టని వైనం

‘అన్నీ చిన్నవే’నంటూ.. కనికరం

ఎన్నికల నిబంధనలకు పాతర

విపక్ష అభ్యర్థులవైతే బుట్టదాఖలు

అస్మదీయ అధికారులను ముందే నియమించుకున్న సీఎం జగన్‌

రుణం తీర్చుకునే పనిలో ఆర్వోలు

ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

(అమరావతి-ఆంధ్రజ్యోతి) ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమర్పించే నామినేషన్లకు, అఫిడవిట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నియమాలను పాటిస్తుంది. ఎవరైనా అభ్యర్థి ఒకసారి నామినేషన్‌, అఫిడవిట్‌ను దాఖలు చేసిన తర్వాత.. వాటిని మార్చుకునే అవకాశం లేదు. ఏమైనా లోపాలుంటాయని భావిస్తే మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేసుకోవాలి. వీటిలోనూ ఏమైనా తప్పులు కానీ, ప్రకటించాల్సిన ఆస్తులు, కేసులు కానీ దాచినా.. పరిశీలన సమయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా ఎన్నికల సంఘం అధికారులు వాటిని తోసిపుచ్చుతారు. ఈ విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. కానీ, ప్రస్తుతం ఏపీలో ముగిసిన నామినేషన్ల పర్వం.. అనంతరం చేపట్టిన పరిశీలనలో వైసీపీ అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లలో లోపాల పుట్టలు బయటపడ్డాయి.


మరి రిటర్నింగ్‌ అధికారులు ఏం చేయాలి? నిష్పక్షపాతంగా వాటిని తోసిపుచ్చాలి. కానీ, అలా చేయలేదు. యూటర్న్‌ తీసుకుని తప్పుల తడకలుగా ఉన్న నామినేషన్లను, అఫిడవిట్లను కూడా పలు నియోజకవర్గాల్లో ఆమోదించేశారు. దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న ‘ముందస్తు’ జాగ్రత్త. తన అనుకున్నవారిని ఆయన 4 మాసాల ముందుగానే కీలకస్థానాల్లో నియమించుకున్నారు. ఫలితంగా వైసీపీ అభ్యర్థుల తప్పులు కూడా పట్టించుకోలేనంతగా సదరు అధికారులు స్వామి భక్తి ప్రదర్శించారు. అయితే, ఈ వ్యవహారం నిప్పులాంటి ఎన్నికల సంఘంపై అనుమానాలు రేకెత్తించేలా చేసింది.

కదిరి బాబూరావు. టీడీపీ నేత. ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి 2009లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో ప్రతి పేజీపైన సంతకాలు చేయాలి. అన్నిచోట్ల సక్రమంగా ఉన్నా, ఒక పేజీలో పొరపాటున సంతకం చేయలేదు. అంతే! ఆ కారణంతోనే బాబూరావు నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. ఆ వెంటనే బాబూరావు సుప్రీం కోర్టుకు వెళ్లారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు నామినేషన్‌ను తిరస్కరించిన తర్వాత తామేమీ చేయలేనని స్పష్టం చేసింది. ఇదీ ఎన్నికల కమిషన్‌ అధికారాలకు ఉన్న శక్తి. మరి ఇప్పటి సంగతేంటి?!

ఏం జరిగింది?

తాజా ఎన్నికలకు సంబంధించి పలువురు వైసీపీ అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్‌లలో ఆస్తులు, కేసుల వివరాలు పేర్కొనలేదు. ‘అయినా ఏం కాదు. మేం చూసుకుంటాంలే’ అని భరోసా ఇచ్చేలా కొందరు ఆర్వోలు వ్యవహరించారు. గుడివాడ, బాపట్ల, పెందుర్తి, విశాఖ తూర్పు నియోజకవర్గాల పరిధిలోని రిటర్నింగ్‌ అధికారుల(ఆర్వో) తీరే దీనికి నిదర్శనం. సాధారణంగా అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలు, అఫిడవిట్లను ఆర్వోకు సమర్పించే ముందు తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏవైనా క్రిమినల్‌ కేసులు పెండింగులో ఉండి వాటిని అఫిడవిట్‌లో ప్రస్తావించకపోతే నామినేషన్‌ను తిరస్కరించే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. ఈ కారణంతోనే చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు తమపై ఉన్న కేసుల వివరాలు ఇచ్చేలా పోలీసు శాఖను ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.


కొడాలిపై ఎంత కనికరం!

గుడివాడ ఆర్డీవో పద్మావతి ఆ నియోజకవర్గానికి రిటర్నింగ్‌ అధికారిగా ఉన్నారు. ప్రభుత్వం గత డిసెంబరులో ఆర్డీవోలను బదిలీ చేసింది. వీరిలో ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టి పట్టుమని ఆరు మాసాలు నిండని వారు కూడా ఉన్నారు. కానీ, గుడివాడలో రెండేళ్ల నుంచి ఆర్డీఓగా ఉన్న పద్మావతిని మాత్రం మార్చలేదు. ఎందుకిలా జరిగిందో అప్పుడు తెలియకపోయినా ఇప్పుడు అందరికీ అర్ధమైంది. ‘కొడాలి వెంకటేశ్వరరావు’ అనే దళత దివ్యాంగుడు నామినేషన్‌ వేయడానికి వస్తే తొలుత అనుమతించలేదు. అక్కడి వైసీపీ అభ్యర్ధి, మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పేరు, దివ్యాంగ అభ్యర్థి పేరు ఒక్కటే కావడంతో, ఆయనకు ఏమైనా ఇబ్బంది వస్తుందా? అని సంశయించి నామినేషన్‌ తీసుకోలేదు. మీడియాలో ఈ విషయం రావడంతో ఆ దివ్యాంగుడి నామినేషన్‌ తీసుకున్నారు. ఇక, వైసీపీ అభ్యర్థి కొడాలి నాని సమర్పించిన నామినేషన్‌లో తప్పులున్నాయని టీడీపీ నేతలు ఆధారాలతో ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయగా తీసుకునేందుకు నిరాకరించారు.

మున్సిపల్‌ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించిన అంశాన్ని కొడాలి తన అఫిడవిట్‌లో పేర్కొనలేదు. ఉద్దేశ పూర్వకంగానే ఆయన ఈ పనిచేశారని, అనర్హుడిగా ప్రకటించాలని టీ డీపీ కోరితే పద్మావతి అసలు ఫిర్యాదే తీసుకోలేదు. అంతేకాదు, కొడాలి తనపై ఉన్న 5 క్రిమినల్‌ కేసులకుగాను మూడింటి వివరాలే అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మరో రెండు కేసుల వివరాలు అసంపూర్తిగా సమర్పించారు. నామినేషన్‌ పరిశీలన సమయంలో టీడీపీ నేతలు ఈ అంశంపై వివరాలు ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆమె స్పందించలేదు. ఆమెపై టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె దిగివచ్చి.. నానీపై ఉన్న కేసుల వివరాలు తీసుకున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఆధారాలు, ఫిర్యాదులోని అంశాల ఆధారంగా కొడాలి నామినేషన్‌ను తిరస్కరించడమో లేక ఆయనను అనర్హుడిగా తేల్చడమో చేయాలి. కానీ, పద్మావతి నామినేషన్‌ను గుడ్డిగా ఆమోదించేశారు.


చిన్నదే అంటూ పెద్ద మేలు

పెందుర్తి రిటర్నింగ్‌ అధికారి వైసీపీ అభ్యర్థికి పెద్ద మేలే చేశారు. వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీ్‌పరాజ్‌ అఫిడవిట్‌లో 4-5 పేజీల్లో సరైన సమాచారం ఇవ్వలేదు. ఈ విషయాన్ని జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు తరఫు న్యాయవాది ఆర్వో దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఆర్వో వివరణ కోరారు. ఆ రోజంతా హై డ్రామా నడిచించింది. చివరకు ‘అవన్నీ చిన్న చిన్న విషయాలే’ అంటూ పంచకర్ల అభ్యంతరాలను తోసిపుచ్చారు. అదేవిధంగా విశాఖ తూర్పులో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ విద్యార్హతలపై టీడీపీ అభ్యంతరాలు తెలిపింది. గత ఎన్నికల్లో ఆయన తన విద్యార్హతను పదో తరగతిగా చూపించారని, ఇప్పుడు పీహెచ్‌డీ చేస్తున్నట్లు పేర్కొన్నారని ఆర్‌వో దృష్టికి తీసుకెళ్లింది. దీనిని ఆర్వో లైట్‌ తీసుకున్నారు. ‘‘ఇదేమైనా పె ద్ద విషయమా? చిన్నదే కదా’’ అంటూ ఎంవీవీ నామినేషన్‌ను ఆమోదించారు. బాపట్ల వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి అఫిడవిట్‌లో ఇంటి స్ధలంపై తప్పుడు వివరాలు ఇచ్చారని టీడీపీ అభ్యంతరం తెలిపింది. బీఎస్పీ అభ్యర్థి ఆర్వోకు ఫిర్యాదు చేశారు. దీనిని విచారించకుండానే ఆర్వో తోసిపుచ్చారు. చీరాలలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ నామినేషన్‌పైనా అభ్యంతరాలు వచ్చాయి. ఈ నామినేషన్‌ను తొలుత పెండింగ్‌లో ఉంచిన ఆర్వో.. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఆమోదించేశారు.


అప్పుడే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

ఎన్నికల సంఘం(ఈసీ) నియమాలను రిటర్నింగ్‌ అధికారులే ధిక్కరించి నేతలకు మేలు చేసే ప్రమాదం ఉందని, జగన్‌ తన అస్మదీయులకు కీలక ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చారని ‘ఆంధ్రజ్యోతి’ గత ఏడాది డిసెంబరు, జనవరి మాసాల్లో పలుమార్లు చెప్పింది. ఆర్‌డీవోలే రిటర్నింగ్‌ అధికారులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో తమ అస్మదీయులు, ఏది చెప్పినా తలూపేవారిని ఆయా పోస్టుల్లో నియమించారని గత ఏడాది డిసెంబరు 10న ‘జీ హుజూర్‌ అంటేనే’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. డిప్యూటీ కలెక్టర్ల పోస్టింగ్‌ల్లో అస్మదీయులకు పెద్దపీట వేస్తున్నారని, తటస్థంగా, నిజాయితీగా పనిచేసేవారిని మార్చేస్తున్నారని పేర్కొంది. ఇప్పుడు ఆ వార్తను నిజం చేస్తూ కొందరు అధికారులు పనిచేస్తున్నారు. జగన్‌ వేసిన ముందస్తు ప్లాన్‌ను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు.

Updated Date - Apr 30 , 2024 | 07:23 AM