Share News

పంట పొలాల్లోకి యురేనియం వ్యర్థాలు

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:38 AM

యురేనియం వ్యర్థాల విషయంలో యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.

పంట పొలాల్లోకి యురేనియం వ్యర్థాలు

యూసీఐఎల్‌ టెయిలింగ్‌ పాండ్‌ పైప్‌లైన్‌ లీకేజీ

ఎక్సకవేటర్‌తో శుభ్రం చేయించిన అధికారులు

పులివెందుల, ఫిబ్రవరి 16: యురేనియం వ్యర్థాల విషయంలో యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం ఎం.తుమ్మలపల్లె వద్దనున్న యూసీఐఎల్‌లో నాలుగు రోజులుగా భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే టెయిలింగ్‌ పాండ్‌కు వ్యర్థాలను తరలించే పైప్‌లైన్‌ లీకేజీ కావడం కలకలం రేపుతోంది. యురేనియం వ్యర్థాలను నిల్వ చేసే టెయిలింగ్‌ పాండ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. కానీ ఇక్కడ పదేపదే పైప్‌లైన్‌ లీక్‌ కావడం పరిపాటిగా మారింది. గురువారం యూసీఐఎల్‌ నుంచి టెయిలింగ్‌ పాండ్‌కు వ్యర్థాలను తరలించే పైప్‌లైన్‌ లీకేజీ అయింది. దాదాపు 12 నుంచి 15గంటల పాటు వ్యర్థాలు పొలాల్లోకి ప్రవహించాయి. దీనిని గమనించిన కొందరు రైతులు యూసీఐఎల్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం పైప్‌లైన్‌కు మరమ్మతులు చేశారు. ఆ వ్యర్థాలను పొరపాటున ఎవరైనా తాకితే చర్మం పూర్తిగా ఊడిపోతుందని చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదం జరుగుతుందనే ఆందోళనతో అప్పటికప్పుడు ఎక్సకవేటర్‌తో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించారు. ఈ పనులను ఫొటోలు తీస్తున్న కేకేకొట్టాల వాసులను యూసీఐఎల్‌ సిబ్బంది అడ్డుకొని అక్కడినుంచి పంపేశారు. దీనిపై యూసీఐఎల్‌ అధికారులను వివరణ కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. టెయిలింగ్‌ వ్యవహారాన్ని యూసీఐఎల్‌ గాలికి వదిలేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Feb 17 , 2024 | 09:28 AM