Share News

జగన్‌ కోర్టుకు హాజరయ్యేవరకూ.. ప్రజల్లోకి కోడికత్తి శ్రీను తల్లి

ABN , Publish Date - Jan 30 , 2024 | 02:45 AM

కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు.

జగన్‌ కోర్టుకు హాజరయ్యేవరకూ.. ప్రజల్లోకి కోడికత్తి శ్రీను తల్లి

పెద్ద కుమారుడితో కలిసి మరో పోరాటం

వచ్చేనెల 2 నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన

విజయవాడ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. వచ్చే నెల రెండు నుంచి రాష్ట్రవ్యాప్త యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈ విషయాన్ని వారు విజయవాడలోని న్యాయవాది అబ్దుల్‌ సలీం ఇంటి వద్ద సోమవారం వెల్లడించారు. జైలు నుంచి శ్రీనివాసరావు విడుదలయ్యే వరకు పోరాటం చేస్తామని సావిత్రమ్మ, సుబ్బరాజు వెల్లడించారు. వచ్చే నెల రెండో తేదీన కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామం నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తామని ప్రకటించారు. ‘‘నా కుమారుడి కోసం 75 ఏళ్ల వయస్సులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే పోలీసులు భగ్నం చేశారు. నా కొడుకు మాత్రం విడుదల కాలేదు. శ్రీనివాసరావు విడుదలయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటాను. ప్రతి గడపకూ వెళ్లి మాకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తాం. న్యాయమడుగుతాం. నేను చేస్తున్న పోరాటానికి ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధుల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ వయస్సులో నన్ను చూసేవారు లేరు. నా కొడుకు శ్రీనివాసరావే దిక్కు. ఇప్పటికైనా సీఎం జగన్‌ కోర్టుకు హాజరై విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన దాడి కేసులో సాక్ష్యం చెప్పాలి’’ అని సావిత్రమ్మ కోరారు.

Updated Date - Jan 30 , 2024 | 02:45 AM