Share News

4 నెలలుగా అందని ఉపాధి కూలి డబ్బు

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:03 AM

జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు నిబంధనల మేరకు 15 రోజుల్లోగా వేతనాలు చెల్లించాలి.

4 నెలలుగా అందని ఉపాధి కూలి డబ్బు
హొళగుందలో ఉపాధి పనికి వచ్చిన కూలీలు

జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు నిబంధనల మేరకు 15 రోజుల్లోగా వేతనాలు చెల్లించాలి. స్వరాజ్‌ అభియాన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో 2018 మే 18న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్‌లో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. గడువు లోపు చెల్లింపులు చెల్లించకపోతే చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం అప్పట్లో ఆదేశించింది. అయితే, కర్నూలు జిల్లా హోళగుందలో ఒకటి కాదు..రెండు కాదు.. నాలుగు నెలలుగా ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నా అధికారులకు, పాలకులకు పట్టకపోవడం శోచనీయం. అసలే కరువు ప్రాంతం ప్రభుత్వ చట్టం అమలు కాక.. కూలి పనులు లేక మండల వ్యవసాయ కూలీలు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోకపోవడం శోచనీయం.

.

హొళగుంద, వరి 31 : రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వారివి. రెండు వారాలకోసారి ఇవ్వాల్సిన కూలి పైసలు నాలుగు నెలలైనా ఇవ్వకపోవడంతో అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఆకలితో పనులు చేయలేమని కూలీలు తేల్చిచెబుతున్నారు.

హొలుగుందలో 700 కుటుంబాలు ఉపాధి జాబ్‌ కార్డులు కలిగి ఉన్నాయి. వీరిలో 300 మందికి పైగా ప్రతిరోజూ ఉపాధి పనులకు వెళ్తారు. పూడికతీత, భూములు చదును, ఫారం పాండ్స్‌, కాలువలు తీయడం, చెరువులో పిచ్చి మొక్కలు తొలగించడం లాంటి పనులు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు గుర్తించిన పనులను అధికారులు కూలీలకు ఇస్తున్నారు. అయితే, నాలుగు నెలలు గడిచినా ఉపాధి కూలీల బకాయిలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కూలీలు ఆవేదన చెందుతున్నారు.

Updated Date - Feb 12 , 2024 | 12:03 AM