అందని వేతనం బతుకు భారం
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:11 AM
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు ప్రతి వారం కూలి డబ్బు చెల్లించాలి.

రెండునెలలుగా అందని ఉపాధి వేతనాలు
దాదాపు రూ.100 బకాయి
పూటగడవక కూలీల ఇబ్బందులు
పని వద్ద అధికారులను నిలదీస్తున్న కూలీలు
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు ప్రతి వారం కూలి డబ్బు చెల్లించాలి. ఒకవేళ ఆలస్యమైనా గరిష్ఠంగా 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించాలి. ఆ తర్వాత చెల్లిస్తే వడ్డీతో సహా జమచేయాలని చట్టం చెబుతోంది. కానీ, పనులు చేసి నెలలు గడుస్తోన్నా వేతనాలు అందకపోవడంతో కూలీలు తల్లడిల్లుతున్నా పట్టించుకునేవారే లేకపోవడం గమనార్హం. కార్యాలయాల చుట్టూ కన్నీరు పెడుతూ తిరుగుతున్నా చలనం లేకపోవడం శోచనీయం.
హాలహర్వి, జూన్ 26: కరువు కోరల్లో చిక్కుకుని నలగిపోతున్న కూలీల్లో ఆకలి మంటలు చెలరేగుతున్నాయి. వలసలు నివారించేందుకు ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకంలో నిధులు కొరత ఏర్పడింది. దాదాపు ఏడు వారాల నుంచి కూలీలకు వేతనాలు అందలేదు. ఆకలి మంటలతో విలవిలలాడిపోతున్నారు. దాదాపు రూ.100 కోట్లు బకాయిలు మిగిలిపోవడంతో కూలీలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో 28 మండలాల్లో 479 పంచాయతీలు ఉన్నాయి. 2.53లక్షల జాబ్ కార్డులున్నాయి. 4 లక్షల మందికి పైగా ఉపాధి హామీ పథకం కింద కూలీలు పని చేస్తున్నారు. ఈసారి కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కరువు మండలాలుగా గుర్తించారు. కరువు జిల్లాలో పనులు లేవని సుగ్గిబాట పట్టిన కూలీలకు ఉపాధి భరోసా అన్నారు. ఉన్న ఊర్లో పనులు కల్పిస్తామని అధికారులు చెప్పిన మాటలు నమ్మి పనులకు వెళ్తే సకాలంలో కూలీలు చెల్లించడంలో అధికారులు విఫలమైయ్యారు. కూలీల కోసం అధికారులను నిలదీస్తూన్నారు. రెండు నెలలుగా అందని వేతనాలు కోసం విలవిలలాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వేతనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వెంటనే వేతనాలు అందించాలి
రోజువారి కూలీల వేతనాలతో జీవనం కొనసాగించే గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే కూలీలకు వేతనాలు బ్యాంకు ఖాతలో జమ చెయాలి. లేకపోతే ఆందోళన చేస్తాం.
- గాదిలింగప్ప. గూళ్యం.
తర్వలో కూలీలకు వేతనాలు అందింస్తాం
జిల్లాలో ఉపాధి కూలీలు బకాయిలు వాస్తావమే. త్వరలో కూలీలా ఖాతలో జమచేసేందుకు చర్యలు తీసుకుంటాం. అందరికి వేతనాలు అందేలా చూస్తాం. కూలీలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
- అమర్నాథ్ రెడ్డి, డ్వామా, పీడీ, కర్నూలు